రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటన

నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
•జాతీయ రహదారులు, వైద్యారోగ్య, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి
సమస్యల పరిష్కారంపై దృష్టి..
•లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు
•సమాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

దిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నడుం బిగించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో నలుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడంతో పాటు తెలంగాణ నుంచి ఎంపీకైన లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు వైరి పక్షమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలుస్తున్నారు. హైదరాబాద్‌లో రక్షణ భూముల బదలాయింపు, రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఇళ్ల నిర్మాణం, నగరాల్లోని పెండింగ్‌ ‌పనుల పూర్తి, వైద్యారోగ్య శాఖ బకాయిల మంజూరు విషయమై కేంద్ర మంత్రులతో సమావేశమై వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.
రాజధాని ప్రగతిపై…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగర సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దృష్టిసారించారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌ ‌నగరంలో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో తొలిరోజైన సోమవారం ముఖ్యమంత్రి రక్షణ శాఖ మంత్రిని కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నగరంలో ఎలివేటెడ్‌ ‌కారిడార్లకు అవసరమైన రక్షణ శాఖ భూముల బదలాయించాలని కోరారు. నాడు ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ మంత్రి పలు ప్రాంతాల్లో భూముల బదలాయింపునకు అంగీకరించడంతో నగరంలో పలు ఎలివేటెడ్‌ ‌కారిడర్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది.
ఆ కారిడార్లకు ముఖ్యమంత్రి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పర్యటనలో రక్షణ శాఖ పరిధిలోని మరో 2,450ఎకరాల భూముల బదలాయింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ను కోరారు. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అయితే నగరంలో పలు ప్రాంతాల్లో రహదారుల విస్తరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకాలు తొలగిపోతాయి. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌ ‌లాల్‌ ‌ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతి పేదవాని ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన (పట్టణ)-పీఎంఏవై (యూ) కింద కేంద్రం ఇళ్లను మంజూరు చేస్తున్నందున, తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.  పీఎంఏవై (యూ) కింద గ్రాంటుగా తెలంగాణకు రావల్సిన రూ.784,88 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌… ‌మెట్రో రైలు..
హైదరాబాద్‌ ‌నగరానికి ఒకనాడు జీవనాడిగా ఉన్న మూసీ నది ప్రస్తుతం మురికి కూపంగా మారిపో యింది. మూసీ కాలుష్యంతో నగరంతో పాటు ఉమ్మడి నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌కు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే లండన్‌లో థేమ్స్ ‌నది రివర్‌ ‌ఫ్రంట్‌ను పరిశీలించారు. మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్థానికులకు ప్రయోజనం చేకూర్చేలా తీర్చిదిద్దుతామని, ఇందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. నగరంలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. నగరంలో వివిధ మార్గాల్లో మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు. ఈవిషయంలో తమకు చేయూతని వ్వాలని కోరారు.
వరంగల్‌.. ‌కరీంనగర్‌ ‌సమస్యలపైనా…
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇతర నగరాలైన వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌సమస్యలపైనా కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చర్చించారు. స్మార్ట్ ‌సిటీ మిషన్‌ ‌కింద వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌పట్టణాల్లో చేపట్టిన పనులు పూర్తికాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ పనులు పూర్తయ్యే వరకు స్మార్ట్ ‌సిటీ మిషన్‌ ‌కాలపరిమితిని మరో ఏడాది పాటు పొడిగించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఎన్‌హెచ్‌ఎం ‌బకాయిలు రాబట్టేందుకు కృషి….
తెలంగాణలో ప్రజారోగ్య రంగంపై తమ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో రెండో రోజైన మంగళవారం కేంద్ర మంత్రి నడ్డాతో భేటీ అయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ‌కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజప్తి చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా కేంద్రం వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసిందని, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
image.png
లోక్‌సభలో….
లోక్‌సభలో మంగళవారం జరిగిన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి గెలుపొ ందినా, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా లోక్‌సభలో పోరాడాలని ఎంపీలకు సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ వైరుధ్యాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు అనే గుర్తించి ముందుకు సాగాలని, రాష్ట్ర ప్రయోజనాల సాధనకు పార్లమెంట్‌ను వేదికగా చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఎంపీలకు సూచించారు.
ఆర్‌ఆర్‌ఆర్‌… ‌రహదారుల విస్తరణ… ఐకానిక్‌ ‌బ్రిడ్జి..
జాతీయ రహదారుల నిర్మాణం, నూతన జాతీయ రహదారుల ప్రకటనలో తెలంగాణ రాష్ట్రం వెనుకంజలో ఉండడంతో ఆ అంశంపైనా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.  ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించినందున, దక్షిణ భాగంలోని చౌటుప్పల్‌ ‌నుంచి అమన్‌గల్‌-‌షాద్‌నగర్‌-‌సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంలో భూ సేకరణ, పనుల తీరును వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను అనుసంధానించే హైదరాబాద్‌-‌విజయవాడ జాతీయ రహదారిని (ఎన్‌హెచ్‌-65) ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌ (ఓఆర్‌ఆర్‌ ‌గౌరెల్లి జంక్షన్‌) ‌నుంచి వలిగొండ-కొత్తగూడెం రహదారి (ఎన్‌హెచ్‌-930‌పీ), కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌-‌కరివెన-నంద్యాల (ఎన్‌హెచ్‌-167‌కే) జాతీయ రహదారుల పనుల్లోని జాప్యం,  ఐకానిక్‌ ‌బ్రిడ్జి పనులు ప్రారంభంకాకపోవడంతో వాటిని వెంటనే ప్రారంభించాని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.  హైదరాబాద్‌- ‌కల్వకుర్తి (ఎన్‌హెచ్‌ 765‌కే) రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని,  హైదరాబాద్‌-‌శ్రీశైలం (ఎన్‌హెచ్‌ 765) ‌మార్గంలో ఆమ్రాబాద్‌ ‌టైగర్‌ ‌రిజర్వు ఫారెస్టు పరిధిలో నాలుగు వరుసల ఎలివేటెడ్‌ ‌కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని,  హైదరాబాద్‌-‌మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారికి (ఎన్‌హెచ్‌-163) ఎదురవుతున్న పర్యావరణ ఆటంకాలు తొలగించాలని, సేతు బంధన్‌ ‌స్కీం కింద 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 1617 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల స్థాయిని పెంచాలని ముఖ్యమంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *