రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం ఊడగొడుతుంది

  • విద్య, వైద్య రంగానికి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పెద్దపీట
  • రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
  • మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి
  • బెల్లంపల్లిలో వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రులు

బెల్లంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రేవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుందని మంత్రులు హరీష్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డిలు అన్నారు. గురువారం బెల్లంపల్లిలో నూతనంగా రూ.17కోట్ల రూపాయలతో నిర్మించిన వంద పడకల హాస్పిటల్‌ని ప్రారంభించారు. అనంతరం ఏఎంసి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన నూతన మార్కెట్‌ ‌కమిటి పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బహిరంగ సభలో వారు మాట్లాడుతూ…బిజెపి ప్రభుత్వం ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, ‌రైల్వే, రక్షణతో పాటు సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్‌ ‌సంస్థలకు ఊడిగం చేస్తూ ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తుందన్నారు.

బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నోటిఫికేషన్‌లు జారీ చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. ప్రధాని మోడీ రామగుండంలో సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ఒక మాట మాట్లాడి దిల్లీలో మరో మాట మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో మిగ్నెట్‌ ‌గనులను గుజరాత్‌ ‌గనుల సంస్థకు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి గనులను మాత్రం వేలం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపిని హఠావో…సింగరేణి బచావో అని ప్రజలను, నాయకులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్‌ ‌విద్య, వైద్య రంగానికి  పెద్దపీట వేశారని, జిల్లాకో మెడికల్‌ ‌కళాశాలతో పాటు డయాలసిస్‌ ‌సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా అన్ని వసతులతో ప్రభుత్వ హాస్పిటళ్లను నిర్మిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి మెరుగైన విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన వంద పడకల హాస్పిటల్‌లో పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందితో పాటు పల్లె దవాఖానాలు, నూతన పిహెచ్‌సి భవనాలను, గ్రామాల్లో రహదారులు, అగ్రికల్చర్‌ ‌కళాశాలను ఏర్పాటు చేయాలని మంత్రులకు విన్నవించారు. స్పందించిన మంత్రులు గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి రూ. 10కోట్ల నిధులను నెల రోజుల వ్యవధిలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా వంద పడకల హాస్పిటల్‌లో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ ‌నేత, ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ  దండే విఠల్‌, ‌మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్‌ ‌నల్లాల భాగ్యలక్ష్మి-ఓదెలు, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్‌రావు, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ‌భారతీ హోళీకెరీ, ల్లా గ్రంథాలయ చైర్మన్‌ ‌ప్రవీణ్‌, ‌జిల్లా జడ్పీ వైస్‌ ‌చైర్మన్‌ ‌సత్యనారాయణ, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డుసభ్యులు, బెల్లంపల్లి మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ ‌సభ్యులు, పిఎసిఎస్‌  ‌చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే  అభిమానులు, నియోజకవర్గ రైతులు, మహిళలు, ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *