- పార్లమెంట్ సమావేశాలు ముగిసాక దిల్లీకి రావాలని ఆదేశం
- సీనియర్ల విమర్శలకు సీతక్క ఘాటు సమాధానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలపై హైకమాండ్ ఆరా తీసింది. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే ఢిల్లీ వచ్చి మాట్లాడాలని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. అసమ్మతి నేతలను దిల్లీకి రావాలని ప్రియాంక గాంధీ చెప్పినట్లు తెలుస్తుంది. నేటి అసమ్మతి నేతల వి•టింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుతో చాలామంది నేతలు ఇబ్బంది పడుతున్నట్లు ప్రియాంక గాంధీ దృష్టికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
మరోవైపు రేపు మరోసారి సమావేశం కావాలని సీనియర్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలావుంటే అసమ్మతి నేతల తీరుపైనా రేవంత్ వర్గ మండిపడుతుంది. వీరు అధికార టిఆర్ఎస్, బిజెపిలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవహారాలపై చర్చించేందుకు పార్లమెంట్ సమావేశాలు ముగిసాక దిల్లీకి రావాలని సూచించింది. ఇదిలావుంటే టిడిపి నుంచి వొచ్చిన వారికే పదవుల్లో ప్రాధన్యం ఇచ్చారని ఉత్తమ్ తదితరులు చేసని ఆరోపణలపై సీతక్క ఘాటుగా స్పందించింది. తెలంగాణ కాంగ్రెస్లో ఏర్పడిన తీవ్ర పరిణామాల నడుమ పీసీసీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను నిఖార్సయిన కార్యకర్త కాదు కాబట్టే.. బహిరంగంగా విమర్శలు చేయటం లేదన్నారు.
తమ పదవులు సీనియర్లకు ఆటంకంగా, అసంతృప్తిగా అనిపించాయి కాబట్టే రాజీనామాలు చేశామని తెలిపిన సీతక్క.. కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టాలని కాదని స్పష్టం చేశారు. వాళ్లకు భయపడి కాదని.. బాధను అర్థం చేసుకుని రాజీనామాలు చేశామన్నారు. తాము సంక్షోభం సృష్టించదలుచుకోలేదని.. సమస్యకు పరిష్కారం చూపదలచుకున్నామన్నారు. తమను నాలుగైదు పార్టీలు తిరిగి వలస వొచ్చారంటూ విమర్శలు చేయటం బాధకలిగించిందన్నారు. అలాంటి విమర్శలు విన్నప్పుడు గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడున్నా కష్టపడే మనస్తత్వం ఉంది కానీ.. మాటలు మోసే వ్యక్తులం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీతక్క. ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాల్లో మొత్తం మంది నాయకుల్లో ఎంత మంది పాల్గొన్నారనేది చూస్తే ఎవరు కష్టపడుతున్నారన్న విషయం అర్థమవుతుందని సీతక్క పేర్కొన్నారు. నిజంగా పదవుల పట్ల అసంతృప్తి ఉంటే జాతీయ నాయకత్వంతో తేల్చుకోవాలని సీతక్క సూచించారు. తాము పదవుల కోసం రాలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నప్పుడే పార్టీలోకి వొచ్చామన్న సీతక్క.. ఎలాంటి పదవులు లేకపోయిన కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. సోషల్ వి•డియాలో వొస్తున్న అసత్య ప్రచారాలను పట్టుకుని తమను వలసవాదులుగా చిత్రీకరించటం సరైందని కాదని హితవు పలికారు.
ఇప్పటికీ తాము పార్టీలోకి వచ్చిన ఐదేళ్లు గడిచిందని..ఇంకా టీడీపీ వాళ్లమే అంటే ఎలా అని సీతక్క ప్రశ్నించారు. తాము భుజాన జెండా వేసుకుని కష్టపడుతున్నామని..అయినా ఇలా దెప్పిపొడవటం కరెక్టు కాదన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీల నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు వొస్తుంటే..మేము మాత్రం కాంగ్రెస్ జెండా పట్టుకుని కష్టపడుతుంటే..ఇలా విమర్శించటం బాధాకరమని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న వాళ్లంతా కలిసి కట్టుగా పని చేసినప్పుడే..రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం తీసుకురావటం సాధ్యమవుతుందని సీతక్క అభిప్రాయపడ్డారు.




