- పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్బండ్ల వద్ద విస్తృత ఏర్పాట్లు
- ట్యాంక్ బండ్పై కనుల పండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో హాజరయ్యే దాదాపు ఇరవై వేల మంది పట్టె భారీ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి ఉండడంతో హాజరయ్యే ప్రజలకు, ప్రముఖులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగు జాగ్రత చర్యలు చేపడుతున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు కూడా చేస్తున్నారు. తాగునీటి సౌకర్యములు, తగు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.
ట్యాంక్ బండ్పై కనులపండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
జూన్ 2వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణ సంచా లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజీపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్ నిర్వహిస్తారు.
మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్కస్ ప్రదర్శన
ట్యాంక్ బండ్పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ళచే స్టాళ్ళతో పాటు చిన్న పిల్లలకు గేమింగ్ షోల ఏర్పాటు చేశారు.





