న్యూదిల్లీ, మే 28: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిసి జూన్ 2న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలకు ఆహ్వానిం చారు. దేశ రాజధాని దిల్లీలోని సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానం పలికారు. ఆహ్వానంపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించి, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీని సన్మానించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు ప్రధాన పండుగ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే వేడుకల్లో సోనియాగాంధీ పాల్గొనాలని కోరుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో తనకు (పీఎం మోదీ) పాకిస్థాన్ గుర్తుకు వొస్తుందని అన్నారు. పాక్ ప్రధాని పుట్టినరోజుకు ఎవరు హాజరయ్యారని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోదీ పాకిస్థాన్లో పర్యటించి పాక్ ప్రధానిని కౌగిలించుకున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగంలో మార్పులు వంటి అంశాలు ప్రస్తావనకు వొస్తే బీజేపీకి పాకిస్థాన్ గుర్తుకు వొస్తుందన్నారు. గత 10 ఏళ్లుగా దేశ ప్రగతి కార్డును బీజేపీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు గాంధీ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నడూ ప్రధానిని, ప్రధాని కార్యాలయాన్ని అగౌరవపరచలేదని పేర్కొన్నారు. డిపాజిట్ కూడా దక్కని స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొనడం హాస్యాస్పదం అని రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.





