రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం వివక్ష

– పొలిటికల్ సైన్స్ జాతీయ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం

కాళోజీ జంక్షన్, హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రాల నుంచి ఆదాయాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం, వివక్ష వహిస్తున్నదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో పాపులిస్ట్ పాలసీస్ ఇన్ పోస్ట్ లిబరలైజేషన్ ఇండియా అనే అంశంపై సోమవారం జరిగిన సదస్సుకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం అధ్యక్షత వహించగా రిటైర్డ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కోదండరాం కీలకోపన్యాసం చేశారు. సంక్షేమ పథకాల అమలుపై విమర్శాత్మక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు “కంటి తుడుపు చర్యలుగా” మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో పలు ఉద్యమాలు, సంస్కరణల ఫలితంగా సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అవి ప్రైవేటీకరణకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం ప్రజలను స్వయం పోషకులుగా తీర్చిదిద్దే దిశగా ఉండాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఈ విధానాల ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా ఆదాయ భద్రత, ఆహార భద్రత వంటి అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా, యూరప్ దేశాలతో కుదురుతున్న ఒప్పందాలు దేశ ఆర్థిక విధానాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. సంక్షేమాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించే ధోరణి పెరుగుతోందని విమర్శించారు. సంక్షేమ వ్యవస్థ బలహీనపడితే కార్పొరేట్ రంగం బలపడే అవకాశముందని హెచ్చరించారు. జాతీయ స్థాయి నిర్ణయాధికారం అధికంగా కేంద్రం చేతుల్లో కేంద్రీకృతమవుతోందన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. వీటి ప్రభావం సమాజంపై విస్తృతంగా పడే అవకాశం ఉందని కోదండరామ్ స్పష్టం చేశారు. సెమినార్ డైరెక్టర్ ఆచార్య వి.రామచంద్రం మాట్లాడుతూ రెండు రోజుల జాతీయ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు.
సంస్కరణలకు మానవీయ కోణం అనుసంధానం కావాలి :కె.శ్రీనివాస్ 
ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు డాక్టర్ కె.శ్రీనివాస్ తన ప్రసంగంలో నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో అమలులోకి వచ్చిన సంక్షేమ పథకాల ప్రభావాన్ని విశ్లేషించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభ పరిస్థితులు పెరిగినప్పటికీ పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహం నెలకొన్నదన్నారు. ఆర్థిక సంస్కరణలకు మానవీయ కోణం అనుసంధానం కావాలన్నారు. ప్రజా సంక్షేమం ఆ దృక్కోణంతో ముడిపడి ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఋణ సేకరణపై కఠిన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షేమం ఒక హక్కుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా అనేక సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వాల వద్ద సమాజ హిత కార్యక్రమాల అమలుకు తగిన నిధులు లేవన్నారు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కేంద్రీకృతమవుతోందని వ్యాఖ్యానించారు. పాత సంక్షేమ పథకాల పేర్లు మారుతున్నప్పటికీ, వాటి స్వరూపం పెద్దగా మారడం లేదని విమర్శ చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాల ప్రభావంతో సంక్షేమ పథకాలు రూపుదిద్దుకుంటున్నాయ న్నారు. సంపద కేంద్రీకరణ సమాజంలో అసమానతలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సరళీకృత ఆర్థిక విధానాలు ప్రజల్లో కొన్ని మార్పులను తీసుకువచ్చాయన్నారు. ప్రజల సమ్మతితో అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలు మరింతగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
———————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *