రాష్ట్రపతి ఎన్నికలో స్థానిక పార్టీల పాత్ర కీలకం

రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పదవీకాలం వొచ్చే నెల 24న ముగియనుండడంతో ఈ ఎన్నిక అనివార్య మయింది. వొచ్చే నెల 18న జరుగనున్న ఈ ఎన్నికలో అభ్యర్థులెవరన్నది ఇంకా తేలకపోయినా అధికార, విపక్షాలు మాత్రం తీవ్రంగా పోటీపడుతున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ ఎనిమిదేళ్ళలో ఎన్డీయేకు సారథ్యం వహిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇప్పటివరకు అనేక విజయాలను హస్తగతం చేసుకుంటూ వొస్తున్నది. దేశంలో ఇప్పటివరకు బిజెపి పాలిత రాష్ట్రాలు పద్దెనిమిదికి చేరాయి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా బిజెపిదే పై చెయ్యి. అయినప్పటికీ తమ అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి ప్రస్తుతానికి ఆ పార్టీకి లేదు. రాష్ట్రపతి ఎన్నికకు కావాల్సిన వోట్ల కోసం బిజెపి ప్రాంతీయ పార్టీలవైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

అధికార పక్షమైనా, ప్రతిపక్షాలైనా రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కనీసం అయిదు లక్షల నలభై మూడు వేల రెండు వందల పదిహేడు వోట్లు అవసరం. ఎన్డీయేకు ప్రస్తుతానికి అయిదు లక్షల ముప్పై అయిదు వేలు మాత్రమే ఉన్నాయి. మ్యాజిక్‌ ‌ఫిగర్‌ ‌దాటాలంటే మరో ఎనిమిది వేల 217 వోట్లు అవసరం కానున్నాయి. అందుకే ప్రాంతీయ పార్టీల వైపు ఎన్డీయే చూస్తుంది. తమతో కలిసి వొచ్చే పార్టీలకోసం అన్వేషణ ప్రారంభమయింది. అయితే రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాతే వారికి కావాల్సిన మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా కేంద్రంలోని అధికార బిజెపితో ఎలాంటి గొడవ పెట్టుకోకుండా తటస్థంగా వ్యవహరిస్తుంది ఆంధప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ.

కాని, రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడిని ఎంపిక చేస్తే మాత్రం తమ మద్దతు ఉండబోదన్న విషయాన్ని ఇప్పటికే కేంద్రానికి తెలియజేసినట్లు తెలుస్తున్నది. వెంకయ్యనాయుడు విషయంలో వైఎస్‌ఆర్‌పార్టీ మొదటి నుండి సానుకూలంగా ఉన్నట్లులేదు. ఆయన ఆలోచన ధోరణి అంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న భావన వైఎస్‌ఆర్‌ ‌పార్టీలో ఉంది. దీంతో కేంద్రం ఇప్పుడు సంశయంలో పడింది. వెంకయ్యనాయుడిని ఎంపిక చేసి వైఎస్‌ఆర్‌ ‌మద్దతును పోగొట్టుకోవాలా, వైఎస్‌ఆర్‌ ‌మద్దతు కావాలనుకుంటే మరో వ్యక్తిని ఎంపిక చేసుకోవాలా అన్న ఆలోచనలో పడ్డట్లు తెలుస్తున్నది. ఒక వేళ వైఎస్‌ఆర్‌ ‌పార్టీ సానుకూలం కాని పక్షంలో బీజేడీ, అన్నా డిఎంకె మద్దతిచ్చినా ఎన్డీయే తన అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉంది. బీజేడీ అధినేత, బీహార్‌ ‌ముఖ్యమంత్రి పట్ల బిజెపి వర్గాలు అగ్రహంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కులగణనను బిజేపి వ్యతిరేకిస్తున్నది. కాని, నితీష్‌కుమార్‌ ఇటీవల మిత్రపక్షాలతో కులగణనపై ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అది బిజెపి అగ్రహానికి కారణమయింది. అలాగే అన్నా డీఎంకే, బిజెపి మధ్య కూడా పొరపొచ్చాలున్నాయి. హిందీ, తమిళ్‌ ‌వివాదం, నీట్‌ ‌మెడికల్‌ అడ్మిషన్‌ల వంటి మరికొన్ని అంశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్నా డీఎంకే నిర్ణయాలు తీసుకుంది.

ఇకపోతే ప్రతిపక్షాలు ఏమేరకు పోటీ పడతాయన్న విషయం ఆసక్తిగా మారనుంది. వాస్తవంగా యూపీయేతో కలిపి విపక్ష పార్టీలన్నిటి బలం అయిదు లక్షల యాభై ఒక్క వేయ్యి 431 ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి గెలుపుకు కావాల్సినదానికంటే ఎనిమిది వేల 214 వోట్లు ఎక్కువగానే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ పార్టీలన్ని ఒక తాటిపైకి వొచ్చి ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతాయా లేదా అన్నది మాత్రం క్వశ్చన్‌ ‌మార్కే. తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ను కూడా రాష్ట్రపతి అభ్యర్థినిగా నిలబెట్టే అవకావాలున్నాయన్న వార్తలు వొస్తున్నాయి. ఏపిలో వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకిస్తున్నట్లు, తెలంగాణలో గవర్నర్‌ ‌తమిళసై అభ్యర్థిత్వంపట్ల టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. గవర్నర్‌ ‌తమిళిసైకి తెలంగాణ సర్కార్‌కు మధ్య ఇటీవల చాలా దూరం పెరిగింది. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం తీసుకుంటున్నదన్న కోపం తెరాస సర్కార్‌కుంది. పూర్వాశ్రమంలో బిజెపి పార్టీ పక్షాన పనిచేసిన తమిళిసై ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలున్నాయి.

అయితే ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతాయా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. బిజెపి ప్రత్యమ్నాయ పార్టీ ఏర్పాటు విషయంలో కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మదిలో ఎవరున్నారన్నది ఇంకా బహిర్ఘతం కావాల్సి ఉంది. అయితే కెసిఆర్‌ ఆలోచనలో ఇద్దరు పేర్లున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు శరద్‌ ‌పవార్‌. ‌కాగా రెండవ వ్యక్తి అన్నా హజారే అని తెలుస్తున్నది. ఈ ఇద్దరి పేర్లు అన్ని పక్షాలకు అమోదయోగ్యమేనంటున్నారు. ఒక వేళ బిజేపి కూడా వీరిలో ఎవరిని ఎంపిక చేసిన మరో వ్యక్తి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయంటున్నారు. కాని, రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు శరద్‌పవార్‌ అం‌తగా ఉత్సాహాన్ని చూపించడంలేదని తెలుస్తున్నది. ఈ నెల 15 నుండి నామినేషన్ల ఘట్టం మొదలు కానుంది. 29న నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన అనంతరం జూలై 2న ఉపసంహరణ జరగేలోగా దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *