- కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
- రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 09 : ఈ వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి 9.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు జరిగిందని, ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇక మార్చి 31 నాటికి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ముందస్తు నిల్వ ఉందని, దీంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన యూరియా మొత్తం 9.93 లక్షల మెట్రిక్ టన్నులని ఆయన తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఉదయం ఎరువుల సరఫరా మరియు నిల్వలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…ప్రస్తుతం రాష్ట్రంలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యం మూలంగా 10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎరువుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 16,615 అధీకృత డీలర్ల ద్వారా యూరియా సరఫరా జరుగుతున్నదన్నారు. మొత్తం రాష్ట్రంలో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కొందరు కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది అవగాహనా రాహిత్యమే కాదు..దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమని ఆయన మండిపడ్డారు. సంబంధిత సహకార సంఘాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం..ఉద్దేశపూర్వకంగా తప్పుచేసిన ఎవరినీ ఉపేక్షించమని తెలిపారు. శుక్రవారం నాడు రాష్ట్రంలో 15,838 మెట్రిక్ టన్నుల యూరియా ఖరీదు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, సంయుక్త సంచాలకులు (ఎరువులు) రాములు తదితరులు పాల్గొన్నారు.




