రామ్‌నగర్‌లో గవర్నర్ దత్తాత్రేయ దంపతుల వోటు
వోటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, ప్రముఖులు
ముస్లిం వోటర్ల ఐడి పరిశీలించిన బిజెపి అభ్యర్థి మాధవీలత…కేసు నమోదు చేసిన పోలీసులు
ఉప్పల్‌లో విషాద ఘటన…వోటేసేందుకు వొచ్చి కుప్పకూలిన మహిళ
నమోదు అయిన
పోలింగ్ శాతం
1. ఆదిలాబాద్ 69.81
2.భువనగిరి 72.34
3.చేవెళ్లలో 53.15
4.హైదరాబాద్ 39.17
5.కరీంనగర్‌లో 67.67
6.ఖమ్మంలో 70.76
7.మహబూబాబాద్ 68.60
8.మహబూబ్‌నగర్ 68.40
9.మల్కాజ్‌గిరి 46.27
10.మెదక్ 71.33
11.నాగర్‌కర్నూల్ 66.53
12.నల్లగొండ 70.36
13.నిజామాబాద్ 67.96
14. పెద్దపల్లి 63.86
15.సికింద్రాబాద్ 42.48
16.వరంగల్ 64.08
17.జహీరాబాద్ 71.91
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలలోపు నిల్చున్న వోటర్లకు వోటు హక్కు వినియోగిం చుకునేందుకు ఎన్నికల అధికా రులు అవకాశం కల్పించారు. అక్కడ క్కడ చెదురు ముదురు సంఘటనలు మిన హా మొత్తంగా సజావుగా పోలింగ్ కొనసాగింది. కాగా వనపర్తి జిల్లా అమరచింత జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్ 228/77లో ఈవీఎంలు మొరాయించాయి. రెండు గంటలుగా ఈవీఎంలు పని చేయకపోవడంతో వోటింగ్‌ను నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 5 గంటల వరకు 61.23 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. మంథని..బెల్లంపల్లి లో ఎక్కవ శాతం వోటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అలాగే మంచిర్యాలలో సమయం ముగిసినప్పటికి వోటర్లు బారులు తీరారు. అయితే ఉదయం నుంచే మందకొడిగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. నగరంలో అయితే వోటు వేయడానికి వోటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 61.23 శాతం పోలింగ్ నమోదైంది. 65 శాతం దాకా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా పోలింగ్ పక్రియ ముగిసింది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ వోటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మొదలయిన పోలింగ్ క్రమంగా సాయంత్రం వరకు ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల పరిధిలో వోటర్లు ఉత్సాహంతో వోటు వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వోటర్లు బారులు తీరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 69.81 శాతం, భువనగిరిలో 72.34 శాతం, చేవెళ్లలో 53.15 శాతం, హైదరాబాద్‌లో 39.17 శాతం, కరీంనగర్‌లో 67.67 శాతం, ఖమ్మంలో 70.76 శాతం, మహబూబాబాద్‌లో 68.60 శాతం, మహబూబ్‌నగర్‌లో 68.40 శాతం, మల్కాజ్‌గిరిలో 46.27 శాతం, మెదక్‌లో 71.33 శాతం, నాగర్‌కర్నూల్‌లో 66.53 శాతం, నల్లగొండలో 70.36 శాతం, నిజామాబాద్‌లో 67.96 శాతం, పెద్దపల్లిలో 63.86 శాతం, సికింద్రాబాద్‌లో 42.48 శాతం, వరంగల్‌లో 64.08 శాతం, జహీరాబాద్‌లో 71.91 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ లో 47.88 శాతం – హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో సాయంత్రం 5 గంటల వరకూ 47.88 శాతం నమోదైంది. హైదరాబాద్‌లో 39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ 53.15 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. ఇక కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై నిలబడ్డ తమపై ఎస్సై దాడి చేశారని.. నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఓ ఓటరు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే వ్యక్తి ఓటు వేస్తూ సెల్ఫీ తీశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సదరు వోటరుపై కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా పిప్రియాల్ తండాలో సాయంత్రం 3 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి తండా వాసులు పోలింగ్ బహిష్కరించగా.. అధికారులు నచ్చచెప్పడంతో వోటు వేసేందుకు సాయంత్రం వొచ్చారు. కాగా, సమస్యలు పరిష్కరించలేదని గిరిజనులు వోటింగ్ బహిష్కరించారు. హైదరాబాద్ పాతబస్తీ వ్నిర్ చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఒకే రూట్‌లో మాధవీలత, ఒవైసీ పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. రెండు వాహనాలు ఒకే రూట్ లో రావడంతో గందరగోళం నెలకొంది. మాధవీలతను పాతబస్తీ వాసులు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకులను అక్కడి నుంచి పంపించేశారు. అయితే, పోలీసుల తీరుపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో ఎన్నికల సిబ్బంది, కొందరు స్థానిక నేతలు ఇంటింటికీ తిరుగుతూ తలుపులు కొట్టి మరీ వోటర్లను పిలిచారు. అంతా వోటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లతాండా పోలింగ్ బూత్ 160లో బాలకృష్ణ అనే వోటర్ వోటు వేసే దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీశాడు. తన తండ్రి గ్రామ పంచాయతీ సిబ్బంది కావడంతో ఫోన్‌తో పోలింగ్ బూత్ లోకి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో వోటు వేసిన వీడియోను సదరు ఓటరు సోషల్ వ్నిడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది అభ్యంతరం తెలిపారు.
సిఎం రేవంత్, మాజీ సిఎం కెసిఆర్ సహా వోటు వేసిన పలువురు ప్రముఖులు
ఇక ఉదయం వాతవారణం కొంత ప్రశాంతంగా చల్లగా ఉండడంతో ప్రముఖులు సహా వోటర్లు బయటకు వొచ్చి వోటేశారు. ప్రముఖులంతా ముందే వొచ్చి వోటేశారు. కొడంగల్‌లో సిఎం రేవంత్ రెడ్డి, చింతమడకలో కెసిఆర్, రామ్‌నగర్‌లో దత్తాత్రేయ, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆయా ప్రాంతాల్లో మంత్రులు, అభ్యర్థులు వోటేశారు. ప్రజలు కూడా గతంతో పోలిస్తే కొంత ఆసక్తిగా ముందుకు వొచ్చిన వాతావరణం కనిపించింది. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో వోటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నల్లొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్ వోటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై వోటు వేసిన అనంతరం వ్నిడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడంపై సీఈవో వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందకు వొస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కిషన్ రెడ్డిపై ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది.ఇక చాలా వరకు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వోటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లూ అర్జున్, ఎన్టీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ఇతర ప్రముఖులంతా తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. వోటర్ స్లిప్పులు పరిశీలించడం కోడ్ ఉల్లంఘన కిందకే వొస్తుందని, పాత బస్తీలో ముస్లిమ్ మహిళల వోటర్ స్లిప్పులు పరిశీలించినందుకు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేశామని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. మాధవీలతపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళలను బురఖా తొలిగించి పరిశీలించడంపై అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం రేవంత్‌పై వొచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 50 శాతం వోటింగ్ నమోదైనట్లు చెప్పారు. జనగామలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. యువజన కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి పోలింగ్ సరళి చూసేందుకు రాగా.. బీఆర్‌ఎస్ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే పల్లా రజాఏశ్వర రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ముస్లిం వోటర్ల ఐడి పరిశీలించిన బిజెపి అభ్యర్థి మాధవీలత…కేసు నమోదు చేసిన పోలీసులు
నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో వోటింగ్ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న ముస్లిమ్ వోటర్ల బురఖాలను తొలగించమని కోరి వోటర్ ఐడీల వెరిఫికేషన్ చేశారు. అజాంపూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఈ వెరిఫికేషన్ చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్‌పేట్ పీఎస్‌లో పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. వోటర్ల స్లిప్‌లను పరిశీలించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. మాధవీలత వోటర్ ఐడీలు, స్లిప్‌లను పరిశీలిస్తూ వోటర్లను తనిఖీ చేస్తున్న వీడియో వెలుగుచూసింది. వోటర్ల ముఖాలను చూసి, వారిని గుర్తించిన తర్వాత వోటింగ్‌కు అనుమతించాలని ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. వోటర్ స్లిప్‌ల తనిఖీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ అన్నారు.
ఉప్పల్‌లో విషాద ఘటన…వోటేసేందుకు వొచ్చి కుప్పకూలిన మహిళ
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్‌లోని ఆంధ్ర యువతి మండలిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 349లో వోటు వేసేందుకు వొచ్చిన ఓ మహిళ వోటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలోనే ఆమె కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆమెను ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. మృతురాలిని భరత్‌నగర్‌కు చెందిన గట్టు విజయలక్ష్మి(65)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.




