రాష్ట్రంలోనే ఆదర్శంగా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 2: పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డుని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్ చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్ల 46 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 160 దుకాణ సముదాయాల నిర్మాణ పనులకు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో రైతులకు, కొనుగోలుదారులకు, వ్యాపారస్తుల సౌకర్యార్థం 2016 లో సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. నాటి నుండి దశలవారీగా మార్కెట్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉల్లిగడ్డ, కూరగాయల మార్కెట్ వ్యాపారాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే జియాగూడలోని మీట్ మార్కెట్ సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.దేశంలోనే మొట్టమొదటిసారిగా 160 దుకాణాలతో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు.పెరుగుతున్న వ్యాపారాలకు అనుగుణంగా యార్డు పక్కనే గల 40 ఎకరాల రైల్వే స్థలం అందించాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ద్వారా రైల్వే శాఖకు విన్నవించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హారిక, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మార్కెటింగ్ శాఖ అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *