రాయల సీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా

విజయవాడ, జూలై 3 : నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా కోసం పోరాటం కోసం ఈనెల 28న ఛలో ఢిల్లీకి రాయలసీమ స్టీరింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌బైరెడ్డి రాజశేఖర్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై బైరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. గతంలో కర్నూలు రాజధానిగా పెట్టి మళ్లీ హైదరాబాద్‌ ‌తరలించారని… ఇప్పుడు ఈ సీఎం జగన్‌ ‌న్యాయ రాజధాని పెడతామంటున్నారన్నారు. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని మండిపడ్డారు. రాయలసీమ నాయకులు తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. తమ దగ్గర ఉన్న ఖనిజ సంపద మరెక్కడా లేదని.. ఐరన్‌ ఓర్‌, ‌బరైటీస్‌, ‌మైనింగ్‌ ‌కొల్లగొట్టుకుపోతున్నారని విమర్శించారు.

రాయలసీమ అంటే పెట్టుబడులు పెట్టే వారు రావడం లేదన్నారు. సినిమాల్లో తమ ప్రాంతం వాళ్లను రౌడీలు, కబ్జా కోరులుగా చూపించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాయలసీమ విషయంలో కేంద్రం, రాష్ట్రం కళ్లు తెరవాలని హితవుపలికారు. జగన్మోహన్‌ ‌రెడ్డి స్పందించి మోడీపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ ‌చేశారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేయించుకున్న జగన్మోహన్‌ ‌రెడ్డి రాయలసీమకు ఏ చేయలేదని విమర్శించారు. ‘మా ప్రాంతానికి రు ఏం చేశారో చెప్పాలని జగన్‌ను అడుగుతున్నా. మాకు అత్యంత అన్యాయం జగన్‌ ‌సిఎం అయ్యాకే జరిగింది. అప్పర్‌ ‌భద్ర ప్రాజెక్టు 26వేల కోట్లతో కడుతున్నారు.

కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు వచ్చే పరిస్థితి ఉండదు. అప్పర్‌ ‌భద్ర వల్ల రాయలసీమ నాశనం అవుతుందని జగన్‌ ‌కేంద్రానికి ఎందుకు చెప్పలేదు. ఎందుకూ పనికి రాని కేబుల్‌ ‌బ్రిడ్జి ఎందుకు… సెల్ఫీలు దిగడానికా. సీఎంకు లేఖలు రాసినా పట్టించుకోరు, వినిపించుకోరు. జగన్‌ ‌చెవిలో సీసం పోసుకున్నారు కాబట్టి సేవ్‌ ‌రాయలసీమ పేరుతో పోరాటం చేస్తాం. మా రాయలసీమ హక్కుల కోసం జులై 28న ఛలో దిల్లీకి పిలుపునిచ్చాం‘ అని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *