నరేంద్రమోదీ తెలంగాణ గడ్డ హైదరాబాద్ మీద బిజెపి సమరనాదం వినిపిస్తే కేసియార్‌కు అది ఎన్నికల శంఖారావంగా వినిపించింది.
అమిత్ షా, తరుణ్ చుగ్, నడ్డా ఏదో ఒక రూపంలో కేసియార్‌కు దమ్ముంటే అసెంబ్లీ రద్దుతో ఎన్నికలకు రమ్మని సవాళ్ళు విసరడం మొదలైంది. మా ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఉండమని ఆశీర్వదించారన్న ముఖ్యమంత్రి బిజెపి కి దమ్ముందా ఎన్నికల్లో పోటీ చేయడానికని సవాల్ విసరడం, గోకినా, గోకక పోయినా గోకుతూనే ఉంటామని కవ్వించడం జరిగిపోయింది. ఈ పరస్పర సవాళ్ళలో ప్రజల ప్రమేయం లేదు, ప్రయోజనం లేదు.
మేమేమి తక్కువ లేము… అసెంబ్లీ రద్దు చేయండి… సీట్లు తెచ్చుకుంటామని కాంగ్రెస్ కూడా సవాల్ విసిరింది.
కేసియార్ మీద ఒక సవాల్ నేరుగా విసరకుండా నరేంద్రమోదీ ముందస్తు ఎన్నికల మంట అంటించి వెళ్ళాడు. నిజానికి 2018 ముందస్తుతోనే వేలాది కోట్లు ప్రజాధనం వృధా అవడం 2022లో మరో సారి పునారావృతం అయితే ఐదు లక్షల అప్పులున్న రాష్ట్రంపై అదనపు భారం కాదా? ఇది బాధ్యత గల పాలక, పక్ష ప్రతిపక్షాలకు తగునా? ఉన్నది సరిపోదని శ్రీలంక రాజకీయ సంక్షోభాన్ని గుర్తు చేస్తూ రాజపక్షే గతి పడుతుందని కేసియార్, మోదీలపై దమ్ముత్తి పోస్తున్నారు కాని ఇందులో ప్రజాపక్షమెవరో ప్రజలు తేలుస్తారన్న భయం కూడా లేదు. దేశానికి అమృత కాలమని, తమ హయాంలోనే ఇంకో 25 ఏండ్లు నిరాటంక అభివృద్ది కొనసాగుతుందని బిజెపి ప్రకటించి స్వాతంత్య్ర అమృత ఫలాలను అదానీ, అంబానీ, పన్ను ఎగవేతదారులకు పంచి పెడుతున్నది.
ముర్ము లాంటి అభ్యర్ధిని రాష్ట్రపతి ఎన్నికలకు నిలిపి కొత్త సోషల్ ఇంజనీరింగ్‌తో అనేక తప్పులకు జిలుగుపూత పూస్తున్నాది. చివరకు కాబోయే రాష్ట్రపతి మర్ము ట్విట్టర్‌లో నూతన పార్లమెంట్ విస్టాపై జాతీయ అశోక స్తంభ చిహ్నంలో క్రూరంగా రూపుమారిన సింహాలు చిన్నమార్పుతో పెద్ద సందేశమని వారే పేర్కొనే దుస్సహాస, అవాంఛిత తీరును ప్రోది చేస్తున్నది.
జవాబుదారిగా ప్రభుత్వాలు ఉండాలనే బిజెపి దిల్లీ నుండి గల్లీ లీడర్లతో ఎన్నికలకు సిద్దమా అని కవ్వించడం ఏ గుడ్ గవర్నన్స్‌కు ఉదహరణనో జవాబు చెప్పాలి. దేశాన్ని స్వీయ రాజకీయా ప్రయోజనాల కోసం బలి చేయాలనుకుంటే ఏ పాలకుడైనా రాజపక్షే తీరు దొంగచాటుగా దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.
తెలంగాణను ముంచెత్తుతున్న వరదల్లో నష్టపోయిన రైతులను, ప్రజలకు కాపాడుకోవడానికి ముందస్తు ఎన్నికల తొందర వదలి క్షేత్ర స్థాయిలో కలిసి పని చేయాలని, కేంద్ర సహాయం పెద్ద ఎత్తున అందడానికి ఒత్తిడికై ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ పక్షాలను ప్రజాపక్షం చేసేది విపత్కర కాలంలో క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేసే తీరేనని అందరు గుర్తించాలి.
– డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు




