రాజకీయాల కోసం రాజ్యాంగంపై టిఎంసి దాడి

  • వికసిత భారత్‌కు..వికసిత బెంగాల్‌ కీలకం
  • సిఎఎను టిఎంసి ఎందుకు వ్యతిరేకిస్తుంది
  • మళ్లీ కేంద్రంలో వొచ్చేది మోదీ ప్రభుత్వమే…
  • చివరి దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

కోల్‌కతా, మే 29 : బుజ్జగింపు రాజకీయాల కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగంపై దాడి చేస్తుందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఓబీసీల హక్కులను ఊడలాక్కుని ముస్లిమ్‌లకు రిజర్వేషన్‌ కల్పించాలనుకుంటుందన్నారు. ఓబీసీ సర్టిఫికెట్లను కోల్‌కతా కోర్టు రద్దు చేసిందని, జూన్‌ 1న వికసిత్‌ బెంగాల్‌కు ప్రజల వోట్లే కీలకమని చెప్పారు. బెంగాల్‌ ప్రజలకు ఉద్దేశించిన అవకాశాలు చొరబాటుదారుల పరం కానున్నాయని మోదీ హెచ్చరించారు. సీఏఏను టీఎంసీ ఎందుకు టీఎంసీ వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు. చొరబాటుదారులకు ఇక్కడ సుస్ధిరస్థానం కల్పించాలనే ఆలోచనే ఇందుకు కారణమని మోదీ వివరించారు.

పశ్చిమబెంగాల్‌ వ్యాప్తంగా ఈసారి కనీవినీ ఎరుగనంతగా బీజేపీకి ప్రజల మద్దతు కనిపిస్తుందని, ప్రజల ఆదరణ అనూహ్యంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మరోసారి మోదీ సర్కార్‌ వొస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలు ఇచ్చారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మధురాఫూర్‌ బుధవారం నాడు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ..కోల్‌కతాలో జరిపిన రోడ్‌షోలో ప్రజలు చూపిన ఆదరణ ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు.

2024 ఎన్నికల్లో కోల్‌కతాలో ప్రజలతో పాల్గొంటున్న చివరి సమావేశమని, అక్కడి నుంచి తాను ఒడిశా, పంజాబ్‌ వెళ్తున్నానని, గురువారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుందని అన్నారు. బెంగాల్‌ ప్రజల నుంచి వొచ్చిన స్పందన చూస్తుంటే వారి ఆశీస్సులు తన వెంటే ఉన్నాయని బలంగా నమ్ముతున్నానని మోదీ అన్నారు. ’వికసిత్‌ భారత్‌’ దిశగా ఇండియా పయనం సాగిస్తుందని, అందుకోసం వికసిత్‌ బెంగాల్‌ చాలా కీలకమని చెప్పారు. ఇది సాధ్యం కావాలంటే ఇదే విజన్‌ ఉన్న ఎంపీలను గెలిపించుకోవాలని, తద్వారా తమకు ఆశీస్సులు అందించాలని ప్రధాని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *