- విజయభేరిలో ఆరు గ్యారంటీలను ఆమె ప్రకటిస్తారు
- అధికారంలోకి వొచ్చిన 30 రోజుల్లో గ్యారంటీలను అమలు
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- బీఆరెస్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమన్న కేసీ వేణు గోపాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేథావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తుక్కుగూడలో విజయభేరి సభ ఏర్పాట్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ తో కలిసి పరిశీలించిన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ…విజయభేరిలో సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటిస్తారన్నారు. ఆనాడు తెలంగాణ ఇస్తానని కరీంనగర్ సభలో ఇచ్చిన మాటను సోనియమ్మ నిలబెట్టుకున్నారని, అదే తరహాలో విజయభేరిలో ప్రకటించే ఆరు గ్యారంటీలను నెరవేరుస్తారని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు.
అధికారంలోకి వొచ్చిన 30 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కుటిల రాజకీయాలతో కాంగ్రెస్ సభను జరగకుండా చేయాలనుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సభ కోసం రైతులు ముందుకొచ్చి స్థలాన్ని ఇచ్చారన్నారు. సోనియా గాంధీ పాల్గొంటున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితమని ఆయన విమర్శించారు. అధికారమదం తలకెక్కి కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజలు సరైన సమాధానం చెబుతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బీఆరెస్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం : కేసీ వేణు గోపాల్
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆరెస్ ప్రభుత్వమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. శుక్రవారం తుక్కుగూడలో విజయభేరి సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, ఇచ్చిన హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. బీజేపీ పాలనలో జాతీయత ఎక్కడుందని ప్రశ్నించారు.నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమవుతుందని వేణుగోపాల్ తెలిపారు. నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలతో సహా 90 మంది ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంతో తెలంగాణా రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయన్నారు. ఆదివారం ఉదయం 10.30కి ఎక్స్ టెండేడ్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు విజయభేరి బహిరంగ సభ ఉంటుందని అందులో 6 గ్యారంటీలను సోనియా గాంధీ విడుదల చేస్తారన్నారు.
తెలంగాణలోనూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : జైరామ్ రమేష్
భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన విధంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం తుక్కుగూడలో విజయభేరి సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామన్నారు. దిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతుందని రమేష్ విమర్శించారు.




