రష్యా ఊహకు అందనంతగా ప్రతిఘటన !

  • ఉక్రెయిన్‌ను దారికి తెచ్చకోవడంలో విఫలం
  • ఏడాది దాటినా ముగింపు దశకు చేరని యుద్ధ్దం

మాస్కో,మార్చి2 : ఉక్రెయిన్‌పై దాడి ఇంత భయంకరంగా ఉంటుందని బహుషా రష్యా కూడా ఊహించి ఉండదు. ఒకటి రెండురోజుల్లో సునాయాసంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవచ్చన్న పుతిన్‌ అం‌చనాలు తలకిందుల య్యాయి. ఏడాది దాటినా ఉక్రెయిన్‌ను దారికి తెచ్చుకోలేక పోయింది. రష్యా దాడులకు ధీటుగా ఏడాదిగా ఉక్రెయిన్‌ ఎదురుదాడి చేస్తూనే ఉంది. తన దేశ అస్థిత్వాన్ని కాపాడుకుంటూనే రష్యాను గట్టిగా ఢీకొంటోంది. మరోవైపు అమెరికా తదితరదేశాలు కూడా మద్దతును పెంచుతున్నాయి. ఉక్రెయిన్‌ ‌యుద్దంతో నష్టపోతున్న దేశాలు కూడా మెల్లగా గొంతువిప్పి రష్యా తీరును ఎండగడుతున్నాయి.రష్యాలో కూడా ఈ యుద్దం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మరోవైపు రష్యా సైనికులు వేలల్లో మరణి స్తున్నారు. ఈ క్రమంలో మెల్లగా ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అలాగే సైనిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. పరిస్థితులు చేజారుతాయన్న భయంతో ఆయా దేశాలు కొంత వెనకడుగు వేస్తున్నాయి. లేకపోతే ఈ పాటికి ఉక్రెయిన్‌కు మద్దతుగా అనేక దేశాలు యుద్దరంగంలోకి దిగేవే. అలాగే ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది. అణుబాంబు బూచి చూపుతున్న పుతిన్‌ ..‌ప్రపంచంలో తన ప్రతిభను పూర్తిగా కోల్పోయారు.

ఆయా దేశాలు ఇప్పుడు పుతిన్‌ను చూసి ఏవగించుకుంటున్నాయి.  పుతిన్‌ ‌కూడా బహుశా యుద్దం ఇంత దారుణంగా ఉంటుందని ఊహించి ఉండరు. ఒకటి రెండు రోజుల్లో ఉక్రెయిన్‌ ‌దారికి వస్తుందని కదనరంగంలోకి దిగి ఉంటారు. కాకపోతే అంత ఈజీ కాదని ఇప్పుడు తెలిసి ఉంటుంది. మరోవైపు తమ లక్ష్యం పూర్తయ్యేదాకా సైనిక ఆపరేషన్‌ ‌కొనసాగుతుందని రష్యా ప్రకటించింది. అడపాదడపా దాడులతో భయపెడుతూనే ఉంది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఉక్రియిన్‌ ‌మాత్రం బాగా దెబ్బతింది. దీన్ని పునర్నించుకోవడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పనికాదు. తమను ఒంటరి చేయొద్దని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలను ఇప్పటికే వేడుకున్నారు. ఉక్రెయిన్‌కు ఇయు సాయం కావాలని కోరారు. అణు యుద్ధం వచ్చే ప్రమాదముందని, దీనిని ఎదుర్కొనేందుకు అణు దళాలు అప్రమత్తంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు. మూడో ప్రపంచ యుద్దం తప్పదని అంతా భావించారు. కానీ అది రాష్యాకు కూడా ప్రమాదమని రష్యాన్‌ ‌నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే పుతిన్‌ ‌మరింత పట్టుదలగా ఉక్రెయిన్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పౌరులు చనిపోతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునే క్రమంలో వరుస రాకెట్‌ ‌దాడులు, పేలుళ్లతో ఉక్రెయిన్‌ ‌రగులుతోంది. పశ్చిమ దేశాల నుంచి పొంచివున్న ప్రమాదాలను తిప్పికొట్టే క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన ప్రధాన లక్ష్యాన్ని చేరుకునే వరకూ ఉక్రెయిన్‌లో చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ ‌కొనసాగుతుందని రష్యా రక్షణ శాఖ మంత్రి తెలిపారు.

పశ్చిమ దేశాల నుంచి పొంచివున్న సైనిక పరమైన ముప్పు నుంచి రక్షించు కోవడమే రష్యా ముందున్న ప్రధానలక్ష్యం. మా దేశంపై పోరాడేందుకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ ‌ప్రజానీకాన్ని పావుగా వాడుకోవాలని చూస్తున్నాయి. ఈ దుర్మార్గాన్ని సహించం. ఈ ముప్పును తిప్పికొట్టేదాకా ఆపరేషన్‌ ‌కొనసాగుతుందని తెలిపారు. అయితే ఏడాదిగా ఇప్పటికే ఇరు దేశాలు ఎంతో నష్టపోయాయి. ఉక్రెయిన్‌లో తక్షణమే యుద్దాన్ని నిలిపేయాల్సిన అవసరం ఉంది. ఇరుదేశాల నాయకులు శాంతిమార్గం పట్టాలి. ఇకపోతే దాడుల కారణంగా ఉక్రెయిన్‌ ‌నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌జెలెన్‌స్కీ సంచలన ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాలు పోయినా సరే రష్యాకు లొంగేది లేదని స్పష్టం చేశారు. రష్యాకు తగిన గుణపాఠం నేర్పిస్తామంటూ పేర్కొన్నారు. రష్యా దాడుల్లో అమాయక పౌరులు, చిన్నారులు చనిపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలకు పుతిన్‌ ‌భారీ మూల్యం చెల్లించు కోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తామని ఇటీవల పర్యటన సందర్భంగా ప్రకటించారు. పుతిన్‌ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్‌ ‌పిలుపు ఇచ్చారు. అయితే రష్యాను ఎదుర్కొ నేందుకు అమెరికన్‌ ‌దళాలను పంపే ఆలోచనేలేదని అన్నారు. మొత్తంగా ఉక్రెయిన్‌పై దాడులు ఆగుతాయా లేదా అన్నది తెలియదు. అప్పటి వరకు ఉక్రెయిన్‌ ‌బిక్కుబిక్కుమంటూనే పోరాడుతోంది. ఇది ఎంతకాలం అన్నది చూడాలి. రష్యా కూడా ఇది ఎంత తొందరగా యుద్దాన్ని ముగిస్తే అంతమంచిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *