రణరంగంగా రైతుల ‘దిల్లీ చలో’

  • నగరంలోకి ప్రవేశించడానికి రైతుల విశ్వప్రయత్నం..శంభు బార్డర్‌ వద్ద ఉద్రిక్తత
  • రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ…మరోసారి బాష్పవాయు ప్రయోగం
  • భద్రత మరింత కట్టుదిట్టం…ట్రాఫిక్‌తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఫిబ్రవరి 14 : తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’ రణరంగాన్ని తలపిస్తున్నది. నగర శివారులో రైతుల నిరసన రెండో రోజుకు చేరుకుంది. బుధవారం కూడా నగరంలోకి ప్రవేశించడానికి రైతులు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండడంతో మరోసారి వారిపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. రైతులు, పోలీసుల మధ్య పలు చోట్ల తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌, హరియాణాల నుంచి దిల్లీకి బయలుదేరిన రైతులు ఎన్ని అడ్డంకులెదురైనా లెక్కచేయడం లేదు. ఎలాగైనా దిల్లీ చేరుకుని ఆందోళన కొనసాగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రైతులను అడ్డుకునేందుకు పోలీసులూ అంతే స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఒక రోజు ముందుగానే జాతీయ రహదారులపై బారికేడ్లు, అడ్డుగోడలు నిర్మించిన వారు మంగళవారం పంజాబ్‌, హరియాణాల్లో రైతులను ఎక్కడికక్కడ నిరోధిస్తూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే బారికేడ్లను ధ్వంసం చేసుకుని మరీ రైతులు ముందుకు సాగుతున్నారు. దీంతో పోలీసులు బాష్ప వాయుగోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను, జల ఫిరంగులను ప్రయోగించారు…డ్రోన్లనూ వినియోగిం చారు…ఈ ఘటనల్లో పలువురు పోలీసులు, రైతులు గాయపడ్డారు.

ఇక నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకువాడే డ్రోన్లు పంజాబ్‌ భూభాగంలోకి రావడంపై ఆ రాష్ట్ర పోలీసు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావొద్దని వారు స్పష్టం చేశారు. ఇక దిల్లీలో పోలీసుల ఆంక్షలతో జనం నరకం చవి చూస్తున్నారు. పలు రహదారుల్లో ట్రాఫిక్‌ను మళ్లించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు మెట్రో స్టేషన్ల గేట్లను అధికారులు మూసి వేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం..చర్చలకు సిద్ధమంటూనే ఇప్పటికిప్పుడు కనీస మద్దతు ధరపై చట్టం చేయలేమని చెబుతుంది. సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ‘దిల్లీ చలో’ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు మహిళలతో సహా రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో దిల్లీకి బయలు దేరారు. బారికేడ్లను ధ్వంసం చేసేందుకు వారు జేసీబీని వెంట తెచ్చుకున్నారు.

అక్కడికి 40 కిలోవిూటర్ల దూరంలో ఉన్న హరియాణా, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతం శంభు నుంచి ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలు, మేకులతో రోడ్డుకు అడ్డుగా పోలీసులు పెట్టిన ఆటంకాలను తొలగించేందుకు ట్రాక్టర్లతో తొలగించేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులనూ రైతులపైకి పోలీసులు ప్రయోగించారు. దీంతో రైతులు పరుగులు పెట్టారు. బాష్ప వాయు గోళాల పొగ నుంచి రక్షణ కోసం రైతులు గోనె సంచీలను వినియోగించారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో శంభు సరిహద్దుకు చేరుకున్న రైతులు అడ్డుగా నిలిచిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు డ్రోన్ల ద్వారా బాష్ప వాయుగోళాలు జార విడిచారు. అయినా సరే బెదరకుండా ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నాలు కొనసాగించారు. శంభువద్ద వంతెనకు రక్షణగా పెట్టిన రేకులను ధ్వంసం చేసి కిందపడేశారు. రోడ్డు మార్గం ద్వారా కాకుండా పక్కనే ఉన్న పొలాల ద్వారా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులను బాష్ప వాయు గోళాలతో అడ్డుకుంటున్నారు.

ఆటంకాలను అధిగమించి పొలాల ద్వారా దిల్లీవైపు దూసుకెళ్తున్న కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంభువద్ద జరిగిన ఘర్షణలో డీఎస్పీ సహా 24 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని అంబాలాలోని హాస్పిటల్‌కి తరలించారు. 60 మంది రైతులూ గాయపడ్డారు. హరియాణాలో 64 కంపెనీల పారా మిలిటరీ బలగాలను, 50 కంపెనీల పోలీసులను మోహరించారు. పంజాబ్‌, హరియాణా సరిహద్దులను అంతర్జాతీయ సరిహద్దు మాదిరి మార్చేశారని విమర్శించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమేనని తెలిపారు. ఇదిలావుంటే, సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరపకుండా కనీస మద్దతు ధరపై చట్టాన్ని తొందరపడి తీసుకురాలేమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. ఎంఎస్‌పీ గ్యారంటీకి సంబంధించిన డిమాండుపై రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ నిరసనను అప్రతిష్ఠ పాలు చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులను హెచ్చరించారు.

రెండు రౌండ్ల చర్చల్లో కర్షకుల అనేక డిమాండ్లను అంగీకరించామని, కొన్ని అంశాలపై ఇంకా ఒప్పందం కుదరలేదని కేంద్ర మంత్రి చెప్పారు. మరోవైపు, బవానా స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగించేందుకు కేంద్రం చేసిన ప్రతిపాదనను దిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులను అరెస్టు చేసి జైల్లో వేయడాన్ని  అంగీకరించబోమని, ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని దిల్లీ హోమ్‌ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌ లేఖ రాశారు. ఇక, దిల్లీలో ప్రవేశించే సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీసులు పలు చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు.

రైతు సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. బుధవారం మరోసారి పంజాబ్‌ నుంచి హరియాణాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన నేపథ్యంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..‘చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *