కూతురు పెళ్లి బిల్లులను ప్రైవేట్ సంస్థ చెల్లింపులపై ఫిర్యాదు
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 12 : తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. రజత్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ డివోపీటీకి తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రజత్ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని డీవోపీటీ కోరింది.
డివోపీటీనే నేరుగా చర్యలు తీసుకోకుండా తన ఫిర్యాదును రాష్టాన్రికి పంపడంపై ఢిల్లీ హైకోర్టును గవినోళ్ల శ్రీనివాస్ ఆశ్రయించారు. న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ధర్మాసనం విచారణ నిర్వహించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్‌పై చీఫ్ సెక్రటరీ ఎలా చర్యలు తీసుకుంటారని దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. డివోపీటికి నోటీసులు జారీచేసి రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి హైకోర్టు వాయిదా వేసింది. రజత్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కూడా పిటిషన్‌లో గవినోళ్ల శ్రీనివాస్ కోరారు.



