మైసూరు వేడులకలో ప్రధాని మోడీ యోగాసనాలు
దేశ వ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు
ప్రపంచ వ్యాప్తంగానూ యోగా డే ఉత్సవాలు
బెంగళూరు, జూన్ 21 : యోగా మన సమాజానికి శాంతిని కలిగిస్తుంది, ఇది మన ప్రపంచానికి శాంతిని తెస్తుంది, యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు.
మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీతో పాటు 15 వేల మందికి పైగా యోగా అభ్యాసకులు వేడుకల్లో పాల్గొన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన జరుగుతుందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ఈ ఏడాది ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో యోగా డే ఉత్సవాలు జరిపారు. విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత లభిస్తాయని ప్రధాని మోదీ వివరించారు. మంచి ఆరోగ్యానికి…యోగా బాటలు వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగానూ యోగా డే ఉత్సవాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు జరిగాయి. యోగాతో శాంతివస్తుందని మహర్షులు, ఆచార్యులు చెప్పారన్నారు. యోగాతో ప్రపంచానికి శాంతి లభిస్తుందన్నారు.
యోగా మనల్ని బలవంతులుగా చేస్తుందన్నారు. యోగా ప్రజలను, దేశాలను కలుపుతుందని మోడీ అన్నారు. 75 చారిత్రక ప్రాంతాల్లో యోగా ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. యోగా డే ప్రపంచవ్యాప్తంగా పండుగలా మారిందని గుర్తు చేశారు. ఆరోగ్యం, శాంతి, సంతోషానికి సూచిక యోగా అని అన్నారు. కొన్నేళ్ల క్రితం అయితే ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, కానీ ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా విస్తరించిందన్నారు. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోడీ తెలిపారు. ప్రధానితో పాటుగా కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈ కార్యక్రమలో పాల్గోన్నారు.




