యూకెలో ఆర్థిక సంక్షోభం – ద్రవ్యోల్బణ కుదుపులు

యూకె ప్రధాని లీజ్‌ ‌ట్రస్‌ ఉద్వాసన అంచున ఉన్నట్లు, ఆమె పదవికి గండం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్లో 10 శాతం దాటిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో లీజ్‌ ‌ప్రవేశ పెట్టిన ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, లీజ్‌ ‌ప్రధానిగా కొనసాగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంధన ధరలు కూడా చుక్కల్లోకి ఎక్కడంతో యూకెలో మరోసారి రాజకీయ సంక్షోభం తెలెత్తే పరిస్థితి వచ్చిందని, కుదేలైన బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిలో పట్టడంలో లిజ్‌ ‌ట్రస్‌ ‌విఫలం అయ్యారనే వార్తలు ప్రపంచ దేశాల్లో వేగంగా చక్కర్లు కొడుతున్నాయయి.
3వ యూకె మహిళా ప్రధానిగా లీజ్‌ ‌ట్రస్‌:
05 ‌సెప్టెంబర్న (41 రోజుల క్రితం) బ్రిటన్‌ ‌ప్రధానిగా ఎన్నికై పదవి చేపట్టిన 3వ మహిళా ప్రధాని లిజ్‌ ‌ట్రస్‌ ‌దేశంలో నెలకొన్న అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలం అయ్యిందనే అభిప్రాయాన్ని మెజారిటీ కన్జర్వేటివ్‌ ‌పార్టీ ప్రతినిధులు వ్యక్తం చేయడం గమనార్హం. ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో లిజ్‌ ‌ట్రస్‌ ‌తగు నిర్ణయాలు తీసుకోలేకపోయారని, ఆమె ప్రధాని పదవిని త్యాగం చేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల యూకెలో నిర్వహించిన ప్రధాన మంత్రి ఎన్నికలో పార్లమెంటరీ పార్టీ సభ్యులు లీజ్‌ ‌ట్రస్కు అధిక ఓట్లు (57 శాతం ఓట్లు పొందారు) ఇవ్వగా ఆమె పియంగా పదవి బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలుసు. ఎన్నికల్లో ఓడి పోయిన వారిలో భారత సంతతికి చెందిన 42-ఏండ్ల రిషీ సునక్‌(43 ‌శాతం ఓట్లు పొంది)తో పాటు పెన్నీ మోర్డంట్లు రెండు, మూడవ స్థానాల్లో నిలిచారు. తాజాగా ‘యుగొవ్‌’ ‌సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటీవల జరిగిన ప్రధాన మంత్రి ఎన్నికల్లో 62 శాతం ఓటర్లు లిజ్‌ ‌ట్రస్ను ఎన్నుకొని తప్పు చేశామని, 16 శాతం మాత్రమే లిజ్‌ ‌ట్రస్‌ ఎన్నిక పట్ల తమ నిర్ణయం సరైనదేనని తెలపడం విశేషం. కన్జర్వేటివ్‌ ‌పార్టీని ఇరకాటంలో పెట్టిన ఆర్థిక సంక్షోభ కారణంగా యూకెలో ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం:
లీజ్‌ ‌ట్రస్‌ ‌ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టగానే దేశంలో అప్పటికే నెలకొన్న ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్భణాలను కట్టడి చేయడానికి సెప్టెంబర్‌ ‌చివరన మిని-బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టినప్పటికీ పరిస్థితులను అదుపులో పెట్టలేక పోయారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా యూకె ఆర్థిక శాఖ మంత్రి ‘క్వాసీ క్వార్టెంగ్‌’‌ను పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను ‘జెరెమీ హంట్‌’‌కు ఇవ్వడం జరిగి పోయింది. బ్రిటన్‌ ‌చట్టాల ప్రకారం లిజ్కు ఏడాది పాటు పదవీ గండం ఉండకపోవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నిబంధనల్ని మార్చుట ద్వారా ఆమె పదవిని వదులుకోవలసి వస్తుందని వింటున్నాం. ఉక్రెయిన్‌ – ‌రష్యా యుద్ధంతో పెరిగిన చమురు, నిత్యవసరాల ధరలను కట్టడి చేయడంలో లీజ్‌ ‌సఫలమవుతుందనే నమ్మకంతో ఉన్న పార్టీ ప్రతినిధులు తీవ్ర నిరాశకు లోనై వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ట్రస్పై అవిశ్వాస గళం వినిపిస్తున్నారు. పెరిగిన ధరలను తగ్గిస్తానని, ఇంధన ధరలను అదుపులోకి తెస్తానని, కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని లీజ్‌ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ప్రధానమంత్రిగా రిషీ సునక్‌ ‌వైపు మొగ్గు:
పదవి చేపట్టిన వెంటనే లీజ్‌ ‌ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వకపోగా, పరిస్థితులు చేయి దాటడం జరిగిపోతున్నది. కార్పొరేట్‌ ‌పన్నులను 25 నుంచి 19 శాతానికి తగ్గించడమనే నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంతో లీజ్‌ ‌ట్రస్‌ ‌నాయకత్వం పట్ల నమ్మకం పలుచనవుతున్నది. గత ఆరేళ్లలో నలుగురు ప్రధానులను (డెవిడ్‌ ‌కామెరాన్‌, ‌థెరెసా మె, బోరిస్‌ ‌జాన్సన్‌, ‌నేటి లీజ్‌ ‌ట్రస్‌) ‌మార్చిన అధికార కన్జర్వేటివ్‌ ‌పార్టీకి దెబ్బ మీద దెబ్బ తలుగుతూనే ఉన్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ లిజ్‌ ‌ట్రస్‌ ‌ప్రధానిగా తప్పుకున్నట్లయితే మన భారత సంతతికి చెందిన రిషీ సునక్‌ ‌వైపుకే టోరీ యంపీలు మొగ్గు చూపే అవకాశం ఉండవచ్చని తెలుస్తున్నది. దాదాపు 200 సంవత్సరాలు ఇండియాను నిరంకుశంగా ఏలిన బ్రిటీస్‌ ‌పాలకులను ఏలడానికి రాజ్యాంగపరంగా మన రిషీ సునక్కు ప్రధానమంత్రి పదవి దక్కాలని కోరుకుందాం.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
 కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *