( మండువ రవీందర్‌రావు )
ఎన్నికల యుద్ధానికి ముందే తెలంగాణ కాంగ్రెస్ తన ఓటమిని అంగీకరిస్తోందా అంటే, ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కూడా అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటలు అదే సంకేతాన్నిచ్చేవిగా ఉన్నాయి. మరో ఏడాదిలోపు జరుగనున్న ఎన్నికలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇది కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డ్యామేజీ చేసేదిగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేనని, రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో కాంగ్రెస్ విజయం సాధించితీరుతుందని ఒకపక్క ఆపార్టీ నేతలు కాలుకు బలపం కట్టుకుని తిరుగుతూ ప్రచార కార్యక్రమంలో మునిగితేలుతుంటే కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీ ఆశలపై నీళ్ళు చల్లెవిగా ఉన్నాయి. ఆయన మాటలకు కాంగ్రెస్ పార్టీ యావత్ క్యాడర్ ఆయోమయంలో పడిపోయింది. రాష్ట్ర నాయకత్వం మొదలు డిల్లీ నాయకులుకూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిది ఒక సంచలనాత్మక వార్త అయింది. ఎన్నికలకన్నా ముందే ఆ పార్టీ ఓటమిని ఒప్పుకోవడమన్నది ఇతర పార్టీలు శుభపరిణామంగా భావిస్తున్నాయి. తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేస్తామని ఘంటాపథకంగా చెబుతున్న భారతీయ జనతాపార్టీకి ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి ఇదొక ఆయుధంగా మారింది.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఇప్పటికే కాంగ్రెస్ ఫీల్డ్ నుండి వెళ్ళిపోయిందంటూ ప్రచారాన్ని ప్రారంభించడం తెలిసిందే. ఎలాగూ ఓడిపోతామని తెలిసికూడా ఇంకా యాత్రలపేరున కాలయాపన చేయడమెందుకని ఆయన చురక అంటిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి కేవలం కాంగ్రెస్ గురించే కాకుండా ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత మెజార్టీ రాదంటూ జోష్యం చెప్పడంతో మిగతా పార్టీలుకూడా ఆలోచనలో పడ్డాయి. కాంగ్రెస్‌కైతే నలభై నుండి యాభై సీట్లవరకు వస్తాయని, అప్పుడు బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌తో చేతులు కలపక తప్పని పరిస్తితి ఏర్పడుతుందంటూ కోమటిరెడ్డి పేర్కొనడంకూడా బిజెపికి ఒక అవకాశంగా మారింది. తాము మొదటినుండి బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటేనని చెబుతున్నది కోమటిరెడ్డి మాటల ద్వారా స్పష్టమైందంటూ ఆ పార్టీ ద్వజమెత్తుతోంది. గతంలో బిజెపి, బిఆర్‌ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో వాస్తవంలేదని, వాస్తవంగా తామన్నదే సరైందని ఇప్పుడు బిజెపి వాదిస్తోంది. తాజా అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతలకు కెసిఆర్ కితాబివ్వటంకూడా అదే అంశాన్ని చెబుతోందంటున్నాయి బిజెపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ టికట్ మీద గెలిచే అభ్యర్థులు బిఆర్‌ఎస్‌లో కలుస్తారన్న ప్రచారం ఇప్పటికే ఉంది.కోమటి రెడ్డి మాటలు అందుకు వత్తాసు పలికేవిగా కనిపిస్తున్నాయని, అందుకు ఆ రెండు పార్టీలను కాదని బిజెపినే ఎంచుకోవాలని ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసేదిగా ఉంది. ఇదిలాఉంటే కాంగ్రెస్ నాయకులంతా ముక్త కంఠంతో కోమటిరెడ్డి మాటలను ఖండిస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని రేవంత్‌రెడ్డి చేస్తున్న శ్రమనంతా బూడిదలో పోసిన పన్నీరులా కోమటిరెడ్డి చేస్తున్నారని వారు వాపోతున్నారు.
కాగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా బాగానే స్పందించారు. వాస్తవంగా ఆయన ఏ సందర్భంలో మాట్లాడాడన్నది తనకు తెలియదంటూనే, పార్టీకి ఎవరు నష్టం కలిగించినా ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అయితే అధిష్టానం అన్ని చూసుకుంటుందని, అంతర్ఘతంగా చర్చించి చర్యలు తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకునే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆలోచనలో లేదు. అదే విషయాన్ని ఇటీవల రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించిన సందర్భంలో స్పష్టం చేసిన విషయంకూడా తెలిసిందే. దీనిపై బిఆర్‌ఎస్ నాయకత్వంకూడా స్పందించింది. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో వారికే తెలియదని మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారోకూడా తెలియదన్నారు. ఏదియేమైనా ఈసారి తెలంగాణలో దాదాపు అన్ని పార్టీలుకూడా ఇప్పటికే విస్తృత ప్రచారాలు ప్రారంభించాయి.
వామపక్షాలు మినహా అన్ని పార్టీలుకూడా బిఆర్‌ఎస్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. అయితే నిన్నటివరకు బిఆర్‌ఎస్‌తో పొత్తులోనే ఉంటాయనుకున్న వామపక్షాలుకూడా ఇప్పుడు పొత్తులేవీ ఉండవని, కేవలం ఆ పార్టీతో అవగాహనే ఉంటుందని ఆ పక్షాలు అంటుండడంతో ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఒంటరిగానే బరిలో ఉండే అవకాశాలుంటాయను కుంటున్నారు. వాస్తవంగా గెలుపు సంగతి ఎలా ఉన్నా వామపక్షాలు కొన్ని ప్రధానమైన స్థానాలను డిమాండ్ చేసే అవకాశాలుండడంతో వాటిని వదులుకునే ఉద్దేశ్యంలేని బిఆర్‌ఎస్ ఈసారి ఒంటరిగానే బరిలో ఉండి, ఫలితాలు వెల్లడైన తర్వాత పొత్తులగురించి ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారంకూడా ఉంది. మొత్తానికి కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీ) ఆలోచనాదోరణిలో అనేక మార్పులు తెచ్చేవిగా కనిపిస్తున్నాయి.




