- కొరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రి లేఖపై రాహుల్
- హరియానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 22 : భారత్ జోడో యాత్రను ఆపేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాకులు వెతుకుతుందని రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్ మాండవీయ అనేక దేశాల్లో కొరోనా మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో యాత్రను ఆపాలని తనకు రాసిన లేఖపై హరియానా రాష్ట్రంలో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ స్పందిస్తూ ఇది బిజెపి కొత్త ఆలోచన అన్నారు. దేశంలో వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడంతో వారు భయపడుతున్నారని ఆరోపించారు రాహుల్. కాగా కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర హరియానాలో కొనసాగుతుంది.
గురువారం ఉదయం 6 గంటలకు నుహ్‌లోని మలాబ్ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో రాహుల్ గాంధీతో హరియానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, ఇతర పార్టీ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కుమారి సెల్జా, కరణ్ సింగ్ దలాల్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం నుహ్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా చేరారు. యాత్ర గురుగ్రామ్ జిల్లాలోని సోహ్నాలోని అంబేద్కర్ చౌక్ వద్ద విరామం తీసుకునే ముందు నుహ్‌లోని ఘసెరా గ్రామం గుండా వెళ్లి బల్లభఘర్ మోర్ సమీపంలోని లఖ్వాస్ సోహ్నా వద్ద రాత్రి బసకు ఆగింది. కాగా హర్యానాలో మొదటి దశ యాత్ర డిసెంబర్ 23న ముగుస్తుంది. తర్వాత రెండవ దశలో యాత్ర జనవరి 6న పానిపట్ జిల్లాలోని సనోలి ఖుర్ద్ వద్ద ఉత్తరప్రదేశ్ నుండి హర్యానాలోకి తిరిగి ప్రవేశిస్తుంది.




