2002 సంవత్సరంలో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోదీ నే ఉన్నారు. ఇంతకాలం ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ వివాదం తిరిగింది. ఎట్టకేలకు రెండేళ్ల కిందట.. మోదీ కి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. దీంతో ఈ విషయం సమసిపోయిందని అందరూ భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఇప్పుడు బ్రిటన్ కు చెందిన బీబీసీ మీడియా ఇదే గుజరాత్ అల్లర్లపై “ద మోదీ క్వశ్చన్” పేరుతో డాక్యుమెంటరీని రెండు భాగాలుగా తయారు చేసింది.ఈ ఒక భాగంలో మోదీ సీఎంగా ఉన్న సమయాన్ని ప్రస్తావించింది. మరో భాగంలో విశ్వహిందూపరిషత్..ఆర్ఎస్ఎస్ లు కలిసి ఉమ్మడిగా ఈ దారుణ మారణహోమాన్ని సృష్టించాయని ఈ డాక్యుమెంటరీ పేర్కొంది. దీనికి బలమైన ఊతం మోదీ నే అని పేర్కొనడం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిచ్చింది.దేశంలో డాక్యుమెంటరీ ప్రసారం చేసే ఆలోచన లేనప్పటికీ కీలకమైన క్లిప్పింగ్స్ సామజిక మాధ్యమాల్లో ప్రసారం కావడం వల్ల ముఖ్యంగా ‘విశ్వగురువుగా’ కీర్తించబడుతున్న మోదీ కి భారీ సెగ పెట్టినట్లైంది.దానితో విశ్వసనీయత లేని డాక్యుమెంటరీ అంటూ దుయ్యబట్టింది. బ్రిటన్లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని కేంద్రం ఆరోపించింది.
దేశాన్ని తెల్లదొరలు వదిలి వెళ్లి 75 ఏండ్లు గడిచిన వారి ఆత్మలు మన పాలకులలో చొరబడి ఉపా,దేశద్రోహం లాంటి కేసులు సామాన్యులమీద పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. న్యాయంగా పాత్రికేయ వృత్తిని కూడా నిర్వహించలేని పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. దేశ వ్యాప్తంగా న్యాయస్థానాలన్నీ భావప్రకటనకు, స్వేచ్ఛకు గొడుగుపట్టాలి. దాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాల్ని, చర్యల్ని తోసిపుచ్చడం వాటి ప్రాథమిక విధి. పౌరుల స్వేచ్ఛను అణగదొక్కేందుకు భారతీయ శిక్షాస్మృతిలో కీలకమైన సెక్షన్ 124 (ఎ) ప్రకారం రాజద్రోహం కింద ప్రజల స్వేచ్ఛను హరించవచ్చు. బ్రిటిష్ వలస పాలకులు చేసిన ఈ చట్టాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు బాసటగా నిలిచినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. సెక్షన్ 66 (ఎ) రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకటించి న్యాయస్థానం అనేక మందిని కాపాడింది. రాజ్యాంగంలోని 19 (1) (ఎ) అధికరణం కల్పించిన వాక్ స్వాతంత్య్రం ,భావ ప్రకటన స్వేచ్ఛ మీడియాకు వర్తిస్తుందని తెలిసి కూడా మోదీ నాయకత్వానికి అడ్డువచ్చిన రాజకీయపార్టీలు, బీజేపీ దురాగతాలు బయటపెట్టిన మీడియాను, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన ప్రజాస్వామ్యవాదులను అపహాస్యం చేస్తూ, వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి, రాజ్యాంగ సంస్థలను వాడుకొని, ప్రతీకారంతో, రాజకీయ ద్వేషంతో నయాన్నో,భయాన్నో లొంగదీసుకునే ప్రయత్నం అహరహం ప్రతిచర్యలకు పాల్పడుతుందనే విమర్శఉంది. ఈ నేపథ్యంలో కేరళ జర్నలిస్టుల మాదిరి దేశమంతా పార్టీలకు కొమ్ముకాయకుండా ఒక్కటవ్వాలి. జర్నలిస్టులు సమాజహితం కోసం పనిచేస్తే ప్రశ్నించే గొంతుకలకు సభ్యసమాజం వెన్నంటి ఉంటుందనేది నిర్వివాదాంశం.
బీబీసీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ ప్రసార వార్తా సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా 250 కంటే ఎక్కువ కరస్పాండెంట్లతో 50 విదేశీ వార్తల బ్యూరోలను నిర్వహిస్తుంది.ఎప్పుడో ఇరవై ఏండ్ల కిందట జరిగిన సంఘటనలు ఇప్పుడు ప్రస్తావించడం ఏంటి? ఇది కుట్రపూరితమని బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేయగా ఈ డాక్యుమెంటరీని మనదేశంలో నిషేదించారు.ఇది బీజేపీ నాయకత్వం జీర్ణించుకోవడం లేదు అంతటితో ఆగకుండా ప్రతీకారంగా దేశం అంతా బీబీసీకి చెందిన సంస్థలపై, కార్యకలాపాలపై నిఘాపెంచి,బెదిరింపుల్లో భాగంగా ఐటి బృందాలు సర్వే (రైడ్) చేశాయనే విమర్శ ఉంది. బీబీసీ మీద సర్వే ద్వారా అందులో నుంచి ఏదన్న చిట్టెలుక దొరకుతే బీబీసిని ఆడుకోవచ్చని మోదీ జేబు సంస్థలు ఉవిళ్లూరుతున్నాయి.గతంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీ మీద, దైనిక్ జాగ రణ్ మీద, న్యూస్ క్లిక్ మీద ఈడీ లో, ఐటీలో ఏవో ఎందుకు సర్వేలు చేశాయో, బీబీసీ మీద కూడా అందుకే చేసాయని.. దేశీయ వార్తాసంస్థల మీద చేసినప్పుడు విదేశీ సంస్థల మీద చేయకూడదా? అని కేకలు పెట్టాడు అర్ణబ్ గోస్వామి. ఆ వరుసలో రిపబ్లిక్ టివి మీద మాత్రం కేసులు పెట్టలేదా? అని తనను కూడా కలుపుకున్నాడు.మొత్తానికి సారాంశం ఏమిటంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందని, పైశాచిక అంనందాన్ని వెలుబుచ్చారు.అపూర్వానంద్ అనే దిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బీబీసి మీద ఐటి,దాడులను భావ ప్రకటన స్వేచ్ఛ కోరుకునే ప్రజలమీద ప్రయోగిస్తున్న మనోవైజ్ఞానిక క్రీడలుగా వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ అన్న విలువ విషయంలో రాజీపడేదిలేదు అని, గప్పాలు కొట్టుకునే అమెరికా నంగినంగిగా, భావప్రకటనా స్వేచ్ఛకు తమ మద్దతు ఉంటుందని ఒక ప్రకటనతో దులుపుకుంది. 2022 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక ప్రకారం 180 దేశాలకు గాను భారత్ 142 స్థానం నుండి 150స్థానానికి పడిపోయింది. మోదీ హయాంలో హరించుకపోతున్న మీడియా,భావప్రకటన స్వేచ్ఛకు నిలువెత్తు తార్కాణం.
-డా.సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాయం, వరంగల్.
సెల్. 9866255355.




