- ఉమ్మడి పాలనలో ఏకపక్ష నిర్ణయాలు చెల్లవ్
- ప్రజల కోణంలో పాలన చేయడం మొదలు పెట్టాలి
- దేశం కోసం దూకుడు ప్రదర్శించాలి
- ప్రజలు స్వయం శక్తితో బతికేలా చేయాలి
- విద్య, వైద్యరంగాలను బలోపేతం చేయాలి
దేశంలో అప్రతిహత నేతగా, తిరుగులేని నేతగా గణతికెక్కిన నరేంద్ర మోదీ ప్రధానిగా మనుగడ కోసం ఇతరులపై ఆధారపడవలసిన స్థితి వచ్చింది. భారత ప్రజాస్వామిక చైతన్యం కారణంగానే ఇలా జరిగింది. ఎంతటి వారైనా ప్రజల ముందు దిగదుడుపే అని నిరూపించిన సదర్భం ఇది. మోదీనే మోసి అలసిపోయిన బిజెపి నేతలకు కలలోనైనా ఊహించలేని పరిణామం. పదేళ్ల కాలం మోదీ పాలన ఒక ఎత్తు..ఈ ఐదేళ్ల కాలం మరో ఎత్తు అన్న విషయం గుర్తించి ముందుకు సాగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడ చెప్పని స్థాయిలోకి ఆయనను, ఆయన పార్టీని పడగొట్టిన శక్తి ప్రజలదే. ప్రజలను కలవకుండా, ప్రతిపక్షాలతో చర్చించకుండా, పార్టీకి చెప్పకుండా తనకుతోచిన విధంగా ముందుకు సాగుతున్న తీరును ప్రజలు ఈసడించుకున్నారు.
ప్రస్తుతం దేశం ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటోంది. అవేమీ పరిష్కరించలేని సమస్యలు కాదు..అవన్నీ కూడా పరిష్కార యోగ్యంగా ఉన్నవే. కాకపోతే చిత్తశుద్ది పెట్టి పనిచేయాల్సి ఉంది. ఎన్‌డిఎ పక్షాలకు అధికారం వచ్చింది. ఉమ్మడిగా పాలించే అవకాశం చిక్కింది. ప్రజల ఆశను శ్వాసగా చేసుకుని ఇక దేశం కోసం పనిచేయాల్సి ఉంది. ఎన్‌డిఎ పక్షాలు ప్రధానంగా ముందుగా దేశం ముందున్న సమస్యలపై చర్చ చేయాలి. తమతమ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవాలి. వాటిని ఎన్‌డిఎ వేదికపై పెట్టి చర్చించాలి. ముందుగా ప్రజలు తమంతగా తాము ధైర్యంగా బతకగలిగే పరిస్థితులను తీసుకుని రావాలి. ఇందుకు సంకల్పం కూడా కావాలి. ఎన్నికల్లో గెలిచాం..మరో ఐదేళ్ల తరవాత గెలవడంఎలా అన్న తరహాలో పథకాలతో పోటిపడుతూ పోతే ప్రజలు మరో పార్టీని ఆదరిస్తారని గుర్తించాలి. ఇక ప్రధానంగా ఉచిత పథకాలకు, తాయిలాలకు స్వస్తి పలకాలి. ప్రజలను బిచ్చగాళ్లుగా చేసే పథకాల రచనను మానాలి. ప్రజలు స్వయం శక్తితో బతికేలా చేయాలి. వండివార్చి పెడతామన్న రీతిలో డబ్బుల పందేరం చేసే పద్దతులను మానుకోవాలి. ప్రధానంగా విద్య, వైద్యరంగాలను బలోపేతం చేయాలి. ప్రతి ఒక్కరు సర్కార్ స్కూళ్ల వైపు చూసేలా చేయాలి. కార్పోరేట్ దోపిడీని అడ్డుకోవాలి. వైద్యరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు రావాలి. ప్రభుత్వ ఆస్పత్రులు కార్పోరేట్ ఆస్పత్రులను తలదన్నేలా పటిష్టం చేయాలి. ఇందుకు ఎంతైనా ఖర్చు చేయాలి. అలాగే ధరలను అదుపు చేసేందుకు కసరత్తు చేయాలి.
నిరుద్యోగ సమస్యను ప్రధాన అంశంగా తీసుకుని ముందుకు సాగాలి. అదేపనిగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలను అడ్డుకోవాలి. విశాఖ స్టీల్ కావొచ్చు..ఎల్‌ఐసి లాంటి సంస్థలను బలోపేతం చేస్తే కొంతయినా నిరుద్యోగ సమస్య తీరుతుందని గుర్తించాలి. కొత్తగా సంస్థలను తీసుకుని రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతే గాకుండా సమస్యలు ఏవైనా పార్లమెంటులో చర్చ జరిగేలా చూడాలి. గత పదేళ్లలో ఏ అంశంలోనూ సమగ్ర చర్చ జరగలేదు. విపక్షాలను పురుగులకన్నా హీనంగా చూశారు. మాట్లాడితే సభనుంచి బయటకు పంపారు. ఈ తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నుంచి బయటపడాలి. బీజేపీలో ఆత్మవిమర్శ వస్తుందని..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని..ప్రజలకు మేలు జరుగుతుందని అంతా భావించేలా చేయాలి. బిజెపి అంటే ఇక్కడ మోదీ అని మాత్రమే గుర్తించాలి. మంచి చేసి ప్రజల మనసులు గెల్చుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవాలన్న భావన లేదా ఆలోచన స్థిరపడాలి. ధరలు తగ్గించడం, ముఖ్యంగా గ్యాస్, పెట్రో ధరలు తగ్గించడం, నిత్యావసరాల ధరలు తగ్గించడం, జిఎస్టీ భారాలపై కోతలు పెట్టడం, బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గించడం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేయడం వంటి విషయాల్లో ఆలోచన చేయడం వంటివి బిజెపి నేతల ఎజెండాలో ప్రధానం కావాలి. ఎన్‌డిఎ నేతల ఎజెండాలో ఇవి చేరాలి.
ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కాకుండా ఎలాంటి చర్చలు చేసినా, మేధోమధనం చేసినా ప్రజలు పట్టించుకోరని తాజా ఫలితాలు రుజువు చేశాయి. అందుకే బిజెపికి వాతలు పెట్టారు. 400 సీట్ల లక్ష్యం నెరవేరకుండా చేశారు. కేవలం బిజెపిని 240 సీట్లకే పరిమితం చేయడం ద్వారా ఎన్‌డిఎ నేతలకు పగ్గాలు అప్పగించారు. ఇప్పటికయినా బిజెపి అగ్రనాయకులుగా ఉన్న మోదీ, అమిత్ షా లు ఈ పరిణామాలను గుర్తించాలి. అన్ని పార్టీలకన్నా తాము భిన్నమని చెప్పుకుంటున్న బిజెపి ప్రజల కోణంలో పాలన చేయడం మొదలు పెట్టాలి. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ చేయాలి. ప్రజలకు నమ్మకం కలిగించాలి. వీటిపైనే మేథోమధనం చేయాలి. ఇలాంటి సమయంలో బీజేపీ అగ్ర నాయకత్వం స్పీడ్ పెంచాలి. బీజేపీ ఆశించిన స్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదన్నది నూటికినూరు శాతం నిజం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగుతుందని అంతా ఆశిస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి తన ఎజెండాను మార్చుకోవాలి. ముందుగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి.
అందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగాలి. అప్పుడే నమ్ముతారని గుర్తించాలి. ఇకపోతే దేశంలో రాజకీయాల తీరు మారాలి. ఇంతకాలం దూకుడు ప్రదర్శించిన బిజెపి ఇప్పుడు దేశం కోసం దూకుడు ప్రదర్శించాలి. ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవడమే కాదు.. సీట్లు కూడా దక్కించుకుంది.కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ , ఇప్పుడు సమాధానం వెతుక్కోవల్సి వస్తుంది.ఇక ఈ ఎన్నికల్లో మరో కీలక పరిణామం బిఆర్‌ఎస్, బిఎస్‌పి రాజకీయ చిత్రం నుంచి అదృశ్యమయ్యాయి. బిఆర్‌ఎస్‌గా మారి దేశ రాజకీయాలనే ప్రభావితం చేస్తామన్న కెసిఆర్ స్వంత నియోజకవర్గం లాంటి మెదక్ కూడా గెలవలేకపోయారు. అన్నాడిఎంకె కూడా మొత్తంగా మాయమైపోయింది. ఒడిషాలో బిజెడి కూడా బిజెపి విషయంలో ఊగిసలాడి చివరకు అధికారం పోగొట్టుకోవడమే గాక లోక్‌సభ ప్రాతినిధ్యం కూడా పోగొట్టుకుంది. ఉద్యమాలకూ ఎన్నికలకూ సంబంధం వుండదనే సిద్దాంతాలు కూడా ఈ ఫలితాలతో తారుమారైనాయి.
రైతాంగ ఉద్యమం నడిచిన చోట్ల బిజెపికి తీవ్రమైన దెబ్బ తగిలింది. మొత్తంగా వాతావరణంలో మార్పు తేవడంలోనూ ఆ ప్రభావం పడింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, యు.పి, పశ్చిమ ప్రాంతంలో బిజెపి ఓటమికి ఈ ఉద్యమమే కారణంగా భావిస్తున్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం వంటి అంశాలను చర్చలోకి తేవడానికి ఆ వర్గాలను ఆకర్షించడానికి కారణమైనాయి. మైనార్టీలలో వచ్చిన మార్పు యు.పి ఫలితంలో కీలక పాత్ర వహించింది. ఏక వ్యక్తి కేంద్రంగా పని చేసే మోదీ మిశ్రమ ప్రభుత్వాన్ని నడపగలరా అనే సందేహాలు కూడా విూడియా బాహాటంగానే వ్యక్తం చేసింది. కార్పొరేట్ శక్తులు తమ ప్రయోజనాల కోసం ఎంతైనా వొత్తిడి తెస్తుంటాయి. భారత రాజ్యాంగ రక్షణ అనే అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు బలంగా నమ్మారు. దేశ చిత్రపటాన్ని మోదీ ముఖచిత్రంగా మార్చేసిన వైపరీత్యానికి తెర దిగింది. ఓ రకంగా చెప్పాలంటే పార్లమెంటులో ప్రజల తీర్పు మోదీ నైతిక పరాజయంగా చూడాలి. ఫాసిస్టు తరహా పాలనకు వ్యతిరేకంగా ప్రజల తీర్పుగా దీన్ని చూడాలి. దేశంలో ప్రజాస్వామిక విలువలను గౌరవించాలని తేల్చిచెప్పారు.
ఇండియా’ వేదికలో 99 స్థానాలతో కాంగ్రెస్ దాదాపు 40 శాతం ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ విధమైన పరిస్థితి వస్తుందని కమలనాథులు ముందుగా ఊహించలేదంటే వారు నేలవిడిచి సాము చేశారని చెప్పాలి. రాజ్యాంగం రాష్ట్రాల హక్కులు, లౌకిక తత్వం, రైతాంగ ఉద్యమాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలు కాకుండా కేవలం వ్యక్తిగతమైన, ఉద్వేగ భరితమైన అంశాలే వోటర్లను నడిపిస్తాయనే అంచనాతో ఎన్నికల్లోకి వెళ్లిన బిజెపిని గట్టి దెబ్బ కొట్టారు. వోటర్ల తీర్పు చూస్తే ఇవన్నీ ప్రభావం చూపించాయని అర్థమవుతుంది. ఉత్తరాన, పశ్చిమాన బిజెపి ప్రాబల్యం తగ్గలేదనీ దక్షిణాన, తూర్పున మాత్రమే ఇతరుల ప్రభావం అధికమని భావించిన వారికి కూడా ఈ ఫలితాలు చెంపదెబ్బలాంటివి. ఉత్తర భారతంలో మోదీ స్వయంగా పోటీ చేయడమే గాక ఆయనతో దీటైన ప్రధాని అభ్యర్థిగా చలామణి అయ్యే యోగి ఆదిత్యనాథ్ పాలించే యు.పి లో బిజెపి ఘోరంగా దెబ్బతిన్నది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ప్రచారం, ప్రతిపక్షాలు వ్యతిరేకమనే ముద్ర ఆదుకోలేక పోయింది. యు.పి లో ప్రతిపక్షాల ముందు బిజెపి నిలువలేకపోయింది. గతంలో దానికి స్వంతంగా 62 స్థానాలు వస్తే ఈ సారి 33కు పడిపోయాయి.
గతంలో అయిదు స్థానాలే వచ్చిన ఎస్.పి ఇప్పుడు 37తో మొదటి స్థానంలోకి వచ్చింది. ములాయం మరణానంతరం అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఇదే పెద్ద విజయం. బిఎస్‌పి వేరుగా పోటీ పెట్టి పూర్తిగా ఓడిపోయినా దాని వల్లనే 16 స్థానాలు బిజెపికి పోయాయి. లేకపోతే ఈ సంఖ్య మరింత అధికంగా వుండేది. బీహార్‌లోనూ కొంత ఫలితం వచ్చింది. ఇక బిజెపి కుట్రలతో ప్రలోభాలతో ప్రాంతీయ పార్టీలన్నిటినీ చీల్చిన మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి పైచేయి సాధించి సీట్లు తెచ్చుకున్నది. బిజెపి 9 సీట్లకు పరిమితమైంది. మొత్తంపైన గతంలో దక్షిణాన 30 సీట్లు వుంటే ఇప్పుడు 41కి చేరాయి. మరో వంక ‘ఇండియా’ కు గతంలో 58 వుంటే ఇప్పుడు 74కు చేరాయి. ఇక తూర్పున ఒడిషాలో అధికారం, ఆధిక్యత రెండూ దక్కినా బెంగాల్‌లో బిజెపి గతంలోని స్థానాలు 12కు తగ్గాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ లలో బిజెపితో ముఖాముఖి పోటీలో కాంగ్రెస్ స్థానాలు గతంలో కంటే బాగానే పెరిగాయి. రాహుల్ గాంధీ యాత్రలు, కార్యక్రమాలు పార్టీలో కదలిక తేవడమే గాక ఆప్ కూడా కూటమితో కలసి రావడం తోడైంది. బీహార్‌లో ఆర్జేడి కూడా ముఖ్య పాత్ర వహించింది. ఈ విధంగా మొత్తంపైన ఎవరూ ఊహించని విధంగా ‘ఇండియా’ వేదిక బిజెపి, ఎన్‌డిఎకు ధీటుగా నిలిచిందంటే ప్రజల మద్దతే కారణం.
ప్రజాస్వామ్యంలో ప్రజలు శక్తివంతులు. ఎవరు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో చెప్పలేం. అందువల్ల ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయాలి. పార్టీలను దృష్టిలో పెటుటకుని కాదు అని గుర్తించాలి. దేశం కోసం ఏమైనా చేయగలరన్న నమ్మకం ప్రజల్లో కలిగితే గుండెల్లో పెట్టు కుంటారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిబుల్ తలాక్ రద్దు చేయాల్సిందే. ఉమ్మడి పౌరస్మృతి రావాల్సిందే. వీటితో పాటు ప్రజలు బతకడం ఎలా అన్న ఆలోచన చేయకపోతే ప్రజలకు ఈ చారిత్రాత్మక విజయాలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ఆకలి, నిరుద్యోగం ముందు ఈ విజయాలు పెద్దవిగా కనిపించవని బిజెపి నేతలు గుర్తించాలి. అందుకే మునుపటితో పోలిస్తే కాంగ్రెస్ చాలా బలపడిందన్నది మాత్రం గుర్తుంచుకోవాల్సిందే. ఇదంతా ప్రజల్లో వచ్చిన మార్పుగా గుర్తించి బిజెపి నేతలు ముందుకు సాగితేనే దేశ ప్రజలు స్వాగతిస్తారు. విపక్షాలను తిట్టిపోస్తూ..అసలు సమస్యలను పక్కదారి పట్టించే రాజకీయాలను మానుకోవాలి.
-ఎం. శ్రీనివాస్,
సీనియర్ జర్నలిస్ట్





