మోదీ ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట

గ్యాస్‌ ‌ధరలతో ప్రజలకు గుండెదడ
దేశ ప్రజలపై కేంద్రం దొంగ దాడి
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలన
గ్యాస్‌ ‌ధరల పెరుగుదలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
‌ధరలకు వ్యతిరేకంగా నిరంతరంగా పోరాడుతామని ప్రకటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : గ్యాస్‌ ‌ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారంగా మార్చారని టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై మండిపడ్డారు. గడియకోసారి పెరుగుతున్న గ్యాస్‌ ‌ధరలతో ప్రజలకు గుండెదడ వొస్తుందన్నారు. మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి దేశ ప్రజలపై దొంగ దాడి చేస్తుందని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉందన్నారు. గ్యాస్‌ ‌ధర పెంపుపై నిరసన చేపట్టిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలకు కేటీఆర్‌ ‌ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భగ్య పాలనకు నాయకత్వం వహిస్తున్న మోదీ, ధరలతో దేశ ప్రజలపై దండయాత్ర చేయడం, పన్నులు పెంచి ప్రజల నడ్డి విరచడాన్నే సుపరిపాలనగా భావిస్తున్నారని కేటీఆర్‌ ‌విమర్శించారు.

గ్యాస్‌ ‌ధరల పెంపుకి అంతర్జాతీయ కారణాలను చూపించి తమ చేతకానితనాన్ని దాచాలనుకుంటున్న మోడీ ప్రభుత్వ కుటిల నీతిని దేశ ప్రజలు గుర్తిస్తున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఉజ్వల పథకం పేరుతో తమకు అంటగట్టిన సిలిండర్‌లను పెరుగుతున్న గ్యాస్‌ ‌ధరలతో మహిళలు ఉపయోగించడం లేదన్న కేటీఆర్‌, ‌మళ్లీ క్టటెల పొయ్యి దిక్కు చూస్తున్నారన్నారు. అధికారంలోకి వొచ్చినప్పటి నుంచి బీజేపీ చెప్తున్న జుమ్లాలా మాదిరిగానే ఉజ్వల పథకం తయారైందన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ధరలను నియంత్రించి దొంగ నాటకాలు ఆడే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరని తగ్గించాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర అసమర్థ పాలన విధానాలపై నిరంతర పోరు సాగిస్తామని కేటీఆర్‌ ‌తేల్చిచెప్పారు. 8 సంవత్సరాల అసమర్థ మోడీ పరిపాలనలో సుమారు 170 శాతం పెంపుతో, ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంట గ్యాస్‌ అమ్ముతున్న ప్రభుత్వంగా ప్రపంచ రికార్డ్ ‌సృష్టించిందని విమర్శించారు. తాజాగా పెంచిన రూ. 50తో ఈ  ఏడాది కాలంలోనే రూ. 244 మేర గ్యాస్‌ ‌బండ రేటును పెంచిన మోదీ పాలనను చూసి అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుందన్నారు.

2014లో మోదీ అధికారంలోకి వొచ్చినప్పుడు రూ. 410గా ఉన్న సిలిండర్‌ ‌ధర ఈ రోజు సుమారు మూడు రెట్లు పెరిగి రూ. 1100 దాటడం దురదృష్టకరమన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 1100పైగా గ్యాస్‌ ‌రేటు చేరడం బీజేపీ అసమర్థ పరిపాలనకు నిదర్శనమన్నారు. ధరేంద్ర మోడీ హయాంలో సిలిండర్‌ ‌బండ ధరలతో పేదల్ని బాదే కార్యక్రమం అడ్డూ అదుపు లేకుండా సాగుతుందన్నారు. రాయితీకి రామ్‌ ‌రామ్‌ ‌చెప్పి..సబ్సిడీ ఎత్తేసి దేశ ప్రజలపై మోదీ దొంగ దాడి చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. నానాటికి రూపాయి విలువ తగ్గిపోతుంటే? మరోవైపు అడ్డూఅదుపు లేకుండా పెట్రో రేట్లు పెరుగుతున్నాయన్నారు.

చుక్కలన్నంటుతున్న నిత్యావసరాల రేట్లతో ప్రతీ భారతీయ కుటుంబ బడ్జెట్‌ ‌భారంగా మారిందన్నారు. బీజేపీ అసమర్థ విధానాలతోనే ప్రజలకు అవసరమైన ప్రతీ వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుందని అయినా కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల బాధల్ని పట్టించుకునే సోయి లేదన్నారు. దేశ ప్రజలతో కష్టాలతో సంబంధం లేకుండా పాలిస్తున్న మోదీ రాజ్యంలో భరించలేని విధంగా ధరలు పెరిగాయన్న కేటీఆర్‌, ‌కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయాలు పడిపోయాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కనికరం లేకుండా ప్రజల రక్తాన్ని పెరుగుతున్న ధరల పేరుతో పీల్చి పిప్పి చేస్తుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకముందు గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెంపుపై గొంతు చించుకున్న నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులంతా ఇప్పుడు తేలు కుట్టిన దొంగల లెక్క గప్‌ ‌చుప్‌ అయ్యారని కేటీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *