మోటార్లకు మీటర్లు పెడతామన్నది కేసీఆరే

  • రుణం ఇవ్వాలని కేంద్రానికి లేఖ కూడా రాసారు
  • బయ్యారం స్టీల్‌ ‌ఫ్యాక్టరీపై ఇంతవరకు డీపీఆర్‌ ఇవ్వలేదు
  • నిరూపించేందుకు నేను సిద్ధం..బహిరంగ చర్చకు సిద్ధమా?
  • సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌సవాల్‌
  • ‌పోలీస్‌ ‌వ్యవస్థ దిగజారింది…జైలుకు వెళ్లి వొచ్చిన కార్యకర్తలకు బండి సన్మానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : మోటార్లకు మీటర్లు పెడతామన్నది సిఎం కేసీఆరే అని బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణం ఇవ్వాలని కేంద్రానికి లేఖ కూడా రాసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గ్రామంలో జైలు నుండి విడుదలైన కమలాపూర్‌ ‌కార్యకర్తలను పరామర్శించిన బండి సంజయ్‌ ఈ ‌వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సవాల్‌ ‌విసిరారు. డేట్‌-‌టైమ్‌ ‌ఫిక్స్ ‌చెయ్‌, ‌నేను రెడీ అంటూ ఛాలెంజ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్‌ ‌పై మండిపడ్డారు. బయ్యారం స్టీల్‌ ‌ఫ్యాక్టరీపై ఇంతవరకు డీపీఆర్‌ ఇవ్వని మాట నిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పే అని ఆరోపించారు. నిరూపించేందుకు నేను సిద్ధం..బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ ‌విసిరారు. దమ్ముంటే డేట్‌, ‌టైమ్‌, ‌వేదిక ఫిక్స్ ‌చేసి తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. కేసీఆర్‌ ‌మోచేతి నీళ్లు తాగుతూ కొందరు పోలీసులు బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల్లా మారారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ల అంతు చూస్తామన్నారు. బిచ్చమెత్తుకునేలా చేస్తామన్నారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతాం రుణాలివ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందని చెప్పారు బండి సంజయ్‌. అయినప్పటికీ కేంద్రమే మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ బెదిరిస్తుందంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడం సిగ్గు చేటన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపైనా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల విషయంలోనూ ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. ఈ మూడు అంశాలపై బహిరంగ చర్చకి రావాలని సవాల్‌ ‌విసిరారు.

పోలీస్‌ ‌వ్యవస్థ దిగజారింది…జైలుకు వెళ్లి వొచ్చిన కార్యకర్తలకు బండి సన్మానం
పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. బీఆర్‌ఎస్‌-‌బీజేపీ ఘర్షణణలో జైలుకు వెళ్లి వొచ్చిన బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్‌ ‌సన్మానించారు. పోలీసులు కేసీఆర్‌ ‌మోచేతుల నీళ్లు తాగుతుండ్రని ఆరోపించారు. పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చిండ్రని ప్రశ్నించారు. గూండాలకు తుపాకుల లైసెన్సు ఇస్తారా..? అని నిలదీశారు.

ఈ నెల 5న బీఆర్‌ఎస్‌ ‌గూండాలు తమ కార్యకర్తలపై దాడి చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో మూర్ఖత్వపు బీఆర్‌ఎస్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటల విజయం సాధించారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఈప్రాంతంలో ఈటలకు ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదని విమర్శించారు. ఈటల కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసింది బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలైతే తమ కార్యకర్తలపై కేసులు పెడతారా..? అని బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *