- పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలు
- అభ్యర్థులను ప్రకటించి ముందే రంగంలోకి బీఆర్‌ఎస్..
- ఎంపికపై ఇంకా కసరత్తు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్
- సుడిగాలి పర్యటనలతో ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న మంత్రులు హరీష్ రావు, కెటిఆర్
- ఆరు గ్యారంటీలు తమను గట్టెక్కిస్తాయన్న ధీమాతో కాంగ్రెస్
- బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ప్రధాని మోదీ రెండు పర్యటనలు
మండువ రవీందర్‌రావు,ప్రత్యేక ప్రతినిధి
ఇవ్వాళ రేపు అంటూ ఎదురు చూస్తున్న రోజు రానే వొచ్చింది. చీఫ్ ఎన్నికల కమీషన్ రాజీవ్ కుమార్ సోమవారం మద్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. షెడ్యూల్ ప్రకారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీలకు కేవలం ఏడు వారాల సమయమే మిగిలింది. ఈ 51 రోజుల్లో ఎవరి భవిష్యత్ ఏమిటన్నది తేలనుంది. అయితే గత ఎన్నికలతో పోల్చిచూస్తే ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా ఈసారి గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. షెడ్యూల్ కన్నా ముందు ఎన్నికలు వొచ్చినా ఎదుర్కునేందుకు ముందు నుండే సిద్ధపడడంతో తాజా షెడ్యూల్ ప్రకటన వారికి పెద్దగా ఆందోళన కలిగించకపోయినా, ఆయా పార్టీలను మాత్రం పరుగులు పెట్టిస్తున్నాయి. ఒక విధంగా ప్రచారంలో అన్ని పార్టీలు ముందంజలో ఉన్నప్పటికీ అధికార బిఆర్‌ఎస్ మాత్రం అభ్యర్ధుల జాబితాను ప్రకటించడం ద్వారా ముందు వరుసలో నిలిచింది.
రాష్ట్రంలోని 119 స్థానాలకుగాను 115 మంది అభ్యర్థులను ఆగస్టు 21ననే ప్రకటించింది. అభ్యర్ధుల ఎంపిక విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వొస్తున్నది. ప్రధానంగా స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల అభ్యర్థిత్వాల పట్ల పడిన పీఠముడిని మెల్లగా విప్పుకోగలిగింది. మిగతా చోట్ల కూడా చాలావరకు అలకలను నేర్పుగా సమన్వయపర్చింది. అయినప్పటికీ కొందరు పార్టీకి గుడ్ బై చెప్పారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటన ద్వారా ఎవరు పార్టీ వీడి పోతారన్నది కూడా ముందే తేలిపోవడంతో ఇక ఆ పార్టీ గెలుపు మీదే దృష్టిసారిస్తుంది. అభ్యర్ధులెవర•న్నది ముందే ప్రకటించడంతో తమతమ నియోజకవర్గాల్లో ప్రచారానికి వారికి కావల్సినంత సమయం లభ్యమైంది. ఒక విడుత ప్రచార కార్యక్రమాన్ని ఇప్పటికే వారు ముగించుకోగా, పార్టీ ముఖ్యనాయకులు కెటిఆర్, హరీష్ రావులు సుమారు డెబ్బై నుండి ఎనబై నియోజవర్గాలను సుడిగాలిలా చుట్టబెట్టారు. ఈ సందర్భంగా వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేసుకుంటూ వారు ప్రజలతో మమేకమవుతున్నారు.
ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఈ నెల 16న వరంగల్‌లో భారీ స్థాయిలో బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ప్రచారంలో ముందున్నప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీ ఈ సభ ద్వారానే ఎన్నికల నగరా మోగించబోతుంది. ఎందుకంటే గత రెండు సార్లుగా అధికారంలో కొనసాగుతూ వొచ్చిన బిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకరువు పెట్టడంతోపాటు, నవంబర్ 30న జరుగునున్న ఎన్నికల్లో ప్రజలు తిరిగి తమకే పట్టంకట్టే పక్షంలో చేపట్టనున్న మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆ సభలో కెసిఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు, బిజెపి ప్రకటిస్తున్న సంక్షేప పథకాలను తలదన్నే విధంగా బిఆర్‌ఎస్ మానిఫెస్టో ఉంటుందని ఇప్పటికే మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎవరి ఊహకు అందని విధంగా బిఆర్‌ఎస్ మానిఫెస్టో ఉంటుందనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్‌తో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి సమానంగా పోటీపడుతున్నాయి. బిఆర్‌ఎస్‌కు సమ ఉజ్జీ మేమేనంటే మేమే నంటూ ఈ రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన జాతీయ నాయకత్వాలు తెలంగాణ ఎన్నికలపైన దృష్టి సారించడంతో ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకోనున్నాయి. ఇక్కడ అధికార బిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు కూడా ఇతర పార్టీలతో కూటమికట్టే పనిలో ఉన్నాయి. కాగా ఈసారి అధికార బిఆర్‌ఎస్ మాత్రం ఒంటరిగానే ఈ కూటములను ఎదుర్కునాల్సి ఉంది. తెలంగాణ అధికారంపై పట్టు సాధించే విషయంలో పోటీ పడుతున్న వైఎస్ ఆర్‌టిపి పార్టీ, బిఎస్పీ, వామపక్ష పార్టీలైన సిపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి లాంటి పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే పొత్తులు, సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నది. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించిన ఆ పార్టీ స్క్రుటినీ పూర్తిచేసి అధిష్టానానికి పంపించింది. అక్కడ అధికారిక ముద్ర పడాల్సి ఉంది.
ఇప్పటికే వివిధ పార్టీల నుండి సుమారు నలబై నుండి నలబై అయిదు వరకు నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. వారికిచ్చిన హామీలు ఒక వైపు, బిఆర్‌ఎస్‌ను శంకరగిరి మాన్యాలకు పట్టించాలన్న పట్టుదలతో ఉన్న పార్టీలతో పొత్తు ఒక ఎత్తు కావడంతో, అభ్యర్ధుల జాబితా విడుదలకు జరుగుతున్న జాప్యం కారణంగా, ఎవరు అసలైన అభ్యర్థి అన్నది కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు. గత నెలలో జరిగిన సిడబ్ల్యుసీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకా గాంధీతోపాటు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రావడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఊపు వొచ్చింది. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు అంశాల గ్యారెంటీ కార్డుతో పార్టీ శ్రేణులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దానికి తగినట్లుగా వివిధ అంశాలపైన డిక్లరేషన్‌ల పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిననోజు కానుకగా తెలంగాణను గెలిచి గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆ పార్టీ తెగ ఉత్సాహపడుతుంది. ఆరునూరైనా అధికారానికి రావాలనుకుంటున్న కాంగ్రెస్ ఈ నెల 15 నుండి సుమారు పదిరోజుల పాటు బస్సుయాత్రల ప్రణాళికను రూపొందించింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు పార్టీ కేంద్ర నాయకులు పలువురు ఈ యాత్రల్లో పాల్గొనే అవకాశంముంది.
ఇక బిజెపి విషయానికొస్తే తెలంగాణపైన కాషాయ జండా ఎగురవేయడమే లక్ష్యంగా దూసుకు పోతున్న ఆ పార్టీ, రాష్ట్రంలో అధికార బిఆర్‌ఎస్ తప్పిదాలను వెలికితీసి నిలదీస్తున్నది. నవంబర్ ఎన్నికల తర్వాత కెసిఆర్ వెల్లేది ఫామ్‌హౌజ్‌కేనని ప్రచారం చేస్తున్నది. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌లాగా దిలీలోని బిజెపి అధినాయత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. ఈ నెల మొదటి మూడు రోజుల్లోనే ఆ పార్టీ ముఖ్యనాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండు సార్లు తెలంగాణ జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బిఆర్‌ఎస్ ప్రభుత్వంపైన, రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించిన తీరు లక్ష్యసాధనలో ఆ పార్టీ కనబరుస్తున్న శ్రద్ధను తెలియజేస్తున్నది. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన సుమారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం, శంఖుస్థాపనలు చేయడం కూడా తమ లక్ష్యసాధనలో భాగమనే చెప్పాలె. ఎన్నికలలోపు మరో రెండు సార్లు ఆయన తెలంగాణలో పర్యటించే విధంగా ఆ పార్టీ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. కాగా ఈ నెల 10 నుండి 27 వరకు జాతీయ స్థాయి నాయకులతో ప్రతీ నిమోజకవర్గంలో కనీసం రెండేసి సభలు నిర్వహించాలనుకుంటున్న ఆ పార్టీ వర్గాలకు అనుకోకుండా షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికలకన్నా ముందే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగనుండడం కూడా అవకాశంగా మారింది. దేశంలోని ముఖ్యనేతలంతా తెలంగాణపైన తమ దృష్టిని కేంద్రీకరించే ఒక మంచి అవకాశం వారికి లభించిననట్లైంది. ఎట్టి పరిస్థితిలో దక్షిణాదిలో తెలంగాణను వదిలిపెట్టేదేలేదన్న పట్టుదలతో బిజెపి ఉంది.





