‘‘సామాన్యులు విషయంలో అయితే ఖాతాలో కనీస నిల్వ లేదని.బ్యాంకింగ్ సేవల చార్జీలు అని,ఏటీఎం విత్ డ్రాల్ చార్జీలు అని ఎస్ ఎం ఎస్ చార్జీలు అని విభిన్న రూపాలలో వసూలు చేయగా వచ్చిన ఆదాయాలను ఆర్జిస్తున్న బ్యాంకులు వాటిని కార్పొరేట్ వర్గాల వారికి ఋణాలుగా అందించడమే కాదు.వారి మొండి బకాయిల విషయంలో ఉదాసీనత వైఖరి ప్రకటిస్తు వస్తున్నారు.’’
దేశ ఆర్థిక వ్యవస్ధకు ఉత్తేజం కల్పించాలి అంటే బ్యాంకులు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉండాలి దాని ద్వారానే సామాన్య వర్గాల వారు కూడా రుణాలు పొందే అవకాశం చిక్కుతుంది అనే సదుద్దేశ్యంతో 1969 మరియు 1980 సంలో 20 వాణిజ్య బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది.క్రమేపీ దాని ఫలితాలు ఆర్ధిక వ్యవస్ధలో స్పష్టంగా కనిపించాయి కూడా. అయితే రాను రాను బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యాలకు తిలోదకాలు ఇచ్చిప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు అనేవి కార్పొరేటు వర్గాల వారికి అధికంగా అందించడంతో పాటు వారి పొందిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి బ్యాంకు పుస్తకాల నుండి పక్కకు తొలగించి ప్రభుత్వాలు, బ్యాంకులు కూడా కార్పొరేటు వర్గాల వారికి తమ స్వామి భక్తిని ప్రకటించుకుంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాళా స్ధితికి చేరుకునే పరిస్ధితికి తీసుకు వచ్చాయి. దానితో పాటు బ్యాంకులను ప్రయివేటీకరణ దిశగా పావులు కదుపుతున్నాయి.
నిరర్ధక ఆస్తులు అంటే?
సాధారణంగా బ్యాంకులు తమకు నగదు రూపంలో వచ్చిన డిపాజిట్ల ఆధారంగానే అవి రుణాలను మంజూరు చేస్తాయి.ఇలా తాము ఇచ్చిన రుణాలనే అవి ఆస్తులుగా పరిగణిస్తాయి. ఎందుకంటే వాటిపైన వచ్చే వడ్డీ ఆదాయమే బ్యాంకింగ్ రంగ మనుగడకు మూలాధారం.
సాధారణంగా బ్యాంకులు తమకు నగదు రూపంలో వచ్చిన డిపాజిట్ల ఆధారంగానే అవి రుణాలను మంజూరు చేస్తాయి.ఇలా తాము ఇచ్చిన రుణాలనే అవి ఆస్తులుగా పరిగణిస్తాయి. ఎందుకంటే వాటిపైన వచ్చే వడ్డీ ఆదాయమే బ్యాంకింగ్ రంగ మనుగడకు మూలాధారం.
అయితే అలాంటి ఋణాలుగా ఇచ్చిన ఆస్తులలో అధిక భాగం నేడు బ్యాంకులు కు మొండి పద్దులుగా మారిపోయాయి.ఎందుకంటే బ్యాంకింగ్ నిబంధనలు ప్రకారం చూస్తే బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు లో 90 రోజులపాటు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించక పోయినట్లయితే వాటిని నిరర్ధక ఆస్తులు లేదా మొండి బకాయిలుగా(బ్యాడ్ లోన్స్ గా) పరిగణించి వాటిని బ్యాంక్ ఆస్తుల అప్పుల ఖాతా నుండి తొలగించడం జరుగుతుంది.వీటిని ప్రతీ సంవత్సరం బ్యాంక్ ఖాతాలలో చూపుతూ పోతే బ్యాంకు నష్టాలలో కూరుకుపోయినట్లు అవుతుంది.అందుకు బ్యాంకులు తాము రుణాలు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయాలు లేదా లాభాల కొంత మొత్తాన్ని నిరర్ధక ఆస్తుల ఆదాయంగా బ్యాంక్ ఖాతాలో చూపుతారు. ఈ సమయంలో మొండి బకాయిలను వేరేగా చూపడం జరుగుతుంది వీటినే (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్) నిరర్ధక ఆస్తులు లేదా మొండి బకాయిలు అనే పేరుతో పిలుస్తారు.నిరర్ధక ఆస్తులు అంటే ఉపయోగపడని ఆస్తులు అందుచేత బ్యాంకు ఆస్తి అప్పుల పట్టీలో వీటిని చూపరు.
అంటే వీటిని బ్యాంకులు రద్దు చేసినట్లే కదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.కానీ బ్యాంకులు మరియు ప్రభుత్వాలు మాత్రం దీనికి అంగీకరించవు.ఎందుకంటే ఇక్కడ మొండి బకాయిలు అంటే రుణ మాఫీ మాత్రం కాదు ఎప్పటికైనా వాటిని వసూలు చేసే క్రమంలోనే ఉంటాం అని ప్రభుత్వాలు బ్యాంకులు నొక్కి చెబుతున్నాయి.రుణాల రికవరీ విషయంలో బ్యాంకులు నిరంతరం చేసే ప్రయత్నాలలో మొండి బాకీల నుండి తిరిగి కొద్ది కొద్ది మొత్తాలు వసూలు అవుతూ ఉంటాయి కాబట్టి అవి రద్దు కాబడిన రుణాలు ఏ మాత్రం కాదు.బ్యాంకులు తమబ్యాలెన్స్ షీట్‌ను పటిష్టం చేసుకోవడం, పన్ను ప్రయోజనాలను పొందడం, మూలధనాన్ని పటిష్టం చేసుకోవడం వంటి బ్యాంకుల సాధారణ కసరత్తులో భాగంగా బ్యాంకులు ఈ రుణాలను రైట్ ఆఫ్ చేస్తాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బోర్డులు ఆమోదించిన విధానాలకు అనుగుణంగానే బ్యాంకులు ఈ రైట్-ఆఫ్ నిర్వహిస్తాయి.రైట్ ఆఫ్ అంటే ఇంకా రుణాల వసూలుకు అవకాశం ఉందని అర్ధం చేసుకోవాలి.
అయితే ఇలా మొండి బాకీలుగా ప్రకటించిన లెక్కల్లో బ్యాంకులు రాసుకున్న వాటిల్లో కనీసం పది శాతం కూడా తిరిగి వసూలైన దాఖలాలు లేవని బ్యాంకుల రికార్డులే చెబుతున్నాయి.వాటి ప్రకారం దాదాపు 10 శాతం మాత్రమే తిరిగి వసూలు అవుతున్నాయి అనేది బహిరంగ రహస్యం.అంటే బ్యాంకులు 100 రూపాయిలను మొండి బకాయిలు(రైట్ ఆఫ్) గా ప్రకటిస్తే వాటిలో సుమారు 10 రూపాయిలు మాత్రమే తిరిగి వసూలు అవుతున్నాయి.తిరిగి వసూలు చేసిన ఈ 10 రూపాయలను రైట్ బ్యాక్ అంటారు.ఇక మిగిలిన 90 రూపాయిల రుణం మాటేమిటి అంటే వాటిని సాంకేతికంగా హెయిర్ కట్ అని పిలుస్తారు.అంటే ఆ మిగిలిన ఆ మొత్తానికి నీళ్లు వదులుకున్నట్లే లెక్క. అంటే ఇక్కడ బకాయిల రద్దు అనే పదం ఉపయోగించక పోయినప్పటికీ వాస్తవంగా అది మాఫీ అయినట్లే లెక్క.కానీ ప్రభుత్వాలు బ్యాంకులు మాత్రం రద్దు అనే మాటను సుతారాము ఒప్పుకోవడం లేదు.ఎందుకంటే నిరర్ధక ఆస్తుల వసూలుకు మేము చిత్త శుద్దితో కృషి చేస్తున్నాం అంటూ ప్రభుత్వాలు బ్యాంకులు తరచూ చెబుతూనే ఉంటాయి.
ఇదే వాస్తవం అయితే మొండి బకాయిల్లో తిరిగి వసూలు చేసి బ్యాంక్ ఖాతాలలో ఘనంగా తిరిగి ఇంత వసూలు చేశాం అని ఎందుకు చూపలేక పోతున్నారు అంటే అక్కడ తిరిగి రాబట్టినది అత్యల్పమే కాబట్టి. ఒక సారి రుణం మొత్తాన్ని బ్యాంకు మొండి బాకీగా ప్రకటిస్తే వాస్తవంలో బకాయిదారు తాను చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ చెల్లించకుండా ఉండటానికే విశ్వప్రయత్నం చేస్తాడు. కట్టగలిగే స్తోమత ఉన్నప్పటికీ డబ్బులు కట్టని ఇటువంటి రుణ గ్రహీతలను ‘‘విల్‌ఫుల్ డిఫాల్టర్స్’’గా (ఉద్దేశ్య పూర్వక రుణ ఎగవేతదారులు) బ్యాంకులు పిలుస్తుంటాయి.వాస్తవంగా ఇలాంటి విల్‌ఫుల్ డిఫాల్టర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ కంపెనీలు లాభాలు సాధిస్తు న్నప్పటికీ దివాళా తీసినట్టు తమ ఖాతా పుస్తకాలలో చూపి బ్యాంకులకు రుణాలు ఎగ వేస్తూ, మరల కొత్త కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాయి. కొందరు బడా బాబులైతే దొంగ డాక్యుమెంట్లు సమర్పించి రుణం పొందిన తరువాత కొద్ది వాయిదాలు మాత్రం కట్టిన తరువాత ఎగవేతలు మొదలెడుతున్నారు.
కొందరైతే విదేశాలకు ఉడాయిస్తున్నారు.ఈ రూపంలో లక్షల కొట్ల రూపాయిలు రైట్ ఆఫ్ జాబితాకు చేరిపోతున్నాయి.వీరి ఈ ఎగవేత కార్యక్రమంలో పరోక్షంగా రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతు ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. వీరి ఆసరాతోనే ఎగవేత దారులు వారి రుణం మాఫీ అయినట్లుగానే నిర్దారించుకోవడం జరుగుతుంది.తాము అధికారంలోనికి రావడానికి ఇతోధికంగా సహాయపడ్డ కార్పొరేట్ వర్గాల వారి రుణం తీర్చుకునే సందర్భంలో నాయకులు కూడా రుణాలు ఎగవేతలో తమ పూర్తి సహకారాలు వీరికి అందిస్తున్నారు.ఈ ప్రక్రియలో దీనికి ఏ రాజకీయ పక్షం కూడా మినహాయింపు కాదనే చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయ పక్షాలన్నీ కూడా ఒక తానులో ముక్కలే.మొండి బకాయిల విషయంలో నేటి అధికార పక్షం ఏ విధంగా సమర్దించుకుంటుందో అదే రీతిలో గతంలో అధికారంలో కొనసాగిన ప్రస్తుత ప్రతిపక్షం కూడా గతంలో ఇదే పాట పాడింది.
ప్రతీ సంవత్సరం ఇలా మొండి బకాయిలు పెరిగి పోవడానికి కారణం బడా బాబులకు రుణాలు మంజూరు చేసే విషయంలో నిబంధనలకు తూట్లు పొడవటం.రుణాలు మంజూరులో రాజకీయ నాయకుల జోక్యంగా చెప్పవచ్చు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రైతులు, పేదవారు, మధ్యతరగతి జీవులు ఎవరైనా రుణం తీసుకుని వారు తిరిగి సకాలంలో చెల్లించకపోతే పలు దఫాలు నోటీసులు ఇచ్చి అవసరం అయితే వారి పేర్లతో పత్రికా ప్రకటన ఇచ్చి వారు హామీగ ఇచ్చిన తనఖాగా ఉంచిన ఆస్తులను నిర్దాక్షిణ్యంగా వేలం వేసి రుణాలను తిరిగి రాబట్టుకుంటున్నాయి. కానీ వందలు వేలు కోట్ల అప్పులు తీసుకున్న బడాబాబుల విషయంలో మాత్రం ఎందుకు నిబంధనలు పాటించడం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలి పోయింది.అంతే కాదు. ఒక సామాన్యుడికి బ్యాంకులో రుణం కావాలి అంటే బ్యాంకు ను సంతృప్తి పరచడానికి సవాలక్ష నిబంధనలు.ఖాతాదారుని ఖాతా చరిత్ర, ఆ పత్రాలు ఈ పత్రాలు సిబిల్ స్కోరు అంటూ చెబుతూ పలుసార్లు తిప్పించుకుని పూర్తి సంతృప్తి పొందిన పిదప ఋణం మంజూరు చేసి తిరిగి ముక్కు పిండి వారి దగ్గరనుంచి వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ వర్గాల వారి నుండి కూడా ఇలాగే వసూలు చేసే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనే దానికి వీరి నుంచి సమాధానం దొరకదు.సామాన్యులు విషయంలో అయితే ఖాతాలో కనీస నిల్వ లేదని.బ్యాంకింగ్ సేవల చార్జీలు అని,ఏటీఎం విత్ డ్రాల్ చార్జీలు అని ఎస్ ఎం ఎస్ చార్జీలు అని విభిన్న రూపాలలో వసూలు చేయగా వచ్చిన ఆదాయాలను ఆర్జిస్తున్న బ్యాంకులు వాటిని కార్పొరేట్ వర్గాల వారికి ఋణాలుగా అందించడమే కాదు.వారి మొండి బకాయిల విషయంలో ఉదాసీనత వైఖరి ప్రకటిస్తు వస్తున్నారు.
సామాన్య ప్రజలు రూపాయి రూపాయి దాచుకున్న డిపాజిట్ల నుండే కార్పొరేట్లకు పెద్ద మొత్తల్లో బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి.అంతే కాదు బ్యాంకులు అందించే మొత్తం ఋణాలలో సామాన్య ప్రజానీకమే నిర్దేశిత సమయానికి వడ్డీతో సహా తిరిగి రుణాలను చెల్లిస్తున్నారు.ఈ సందర్భంలో రుణ భారం పెరిగి పోయిన రైతులలో కొందరు ఆత్మ హత్యలు చేసుకుంటూ ఉంటే కార్పొరేట్ వర్గాల వారు మాత్రం రుణాలను ఎగవేస్తూ విలాస వంతంగా దేశ విదేశాలలో సేద తీరుతున్నారు. రుణాలను సకాలంలో చెల్లించలేని సందర్భంలో చిన్న కుటీర పరిశ్రమల యజమానులు రైతులు తమ రుణాలు మాఫీ చేయమని లేదా రీ షెడ్యూల్ చేయమని అభ్యర్దించినా కూడా బ్యాంకులు అందుకు అంగీకరించడం లేదు. పైగా ఇటువంటి ప్రతి పాదనలు అమలు చేస్తే బ్యాంకింగ్ వ్యవస్ధ కుప్ప కూలిపోతుందని ప్రసంగాలు ఇస్తారు.అయితే ఇదే పద్ధతిని బడాబాబుల రుణాల వసూలు విషయంలో బ్యాంకులు ఎందుకు వ్యవహరించడం లేదు అంటే కార్పొరేట్ వర్గాల అండ దండలు నేతలకు అవసరం కనుక రుణాలు మంజూరు చేసే విషయంలో ఇచ్చే హామీలు సరైనవిగా లేకపోయినప్పటికి రెడ్ కార్పెట్ వేసి వారికి రుణాలు మంజూరు చేస్తున్నారు.
రైట్ ఆఫ్ లు ప్రకటించి తమ స్వామి భక్తిని ప్రకటించుకుని భారత బ్యాంకింగ్ వ్యవస్ధను బ్రష్టు పట్టిస్తున్నారు.సామాన్యులు ఎవరైనా ఒకసారి బ్యాంకులో లోన్ తీసుకుని కట్టలేకపోతే.. మరోసారి బ్యాంకులో రుణం మంజూరు చేయవు.. కానీ కార్పొరేట్ బాబులకు మాత్రం ఎగ్గొట్టేకొద్దీ ఇస్తూనే ఉంటారు. డబ్బులుండి కూడా.. కట్టని వాళ్లకే మళ్లీ మళ్లీ ఇస్తున్నారు. ఇలా రుణాలు తీసుకున్న కార్పొరేట్లు.. తమ కంపెనీల నుంచి నిధులను డైవర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కాగ్ కూడా తన నివేదికలో బయటపెట్టింది.దీనిని బట్టి భారతీయ బ్యాంకింగ్ వ్యవస్ధ కాకులను కొట్టి గ్రద్దలకు పంచిన తీరును తలపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
రుద్రరాజు శ్రీనివాసరాజు.
9431239578
లెక్చరర్…ఐ.పోలవరం




