మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో లోపాలు

బిఆర్‌ఎస్‌ నేతలకు ఏటీఎంలా ‘కాళేశ్వరం’
 రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి
 రెండు మూడు రోజుల్లో శ్వేత పత్రం
 మేడిగడ్డ బ్యారేజ్‌ను కళ్లారా చూశాకే.. నివేదికపై చర్చ
 హెలికాఫ్టర్‌ సిద్ధంగా ఉంది…కేసీఆర్‌, హరీష్‌ రావు కూడా
మేడిగడ్డకు రావాలి: అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో లోపాలున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం 5వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి భట్టి విక్రమార్క వోటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ మొదలుపెట్టారు. అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని పేర్కొన్నారు. వీటిని పరిశీలించడానికి తాము మేడిగడ్డకు వెళ్లున్నామని, వాస్తవాలను కళ్లారా చూసేందుకు బీఆర్‌ఎస్‌ సభ్యులు కూడా రావాలని కోరగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డపై అధికారులు ఇచ్చిన నివేదికను చర్చించాలంటే ముందు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. మేడిగడ్డ నిర్మాణ లోపం వల్ల కుంగిందా, ఇసుకలో పేకమేడ కడితే కుంగిందా ? బాంబులు వేయడంతో కుంగిందా అన్నది చూసి తెలుసుకోవచ్చన్నారు. కేసీఆర్‌ సృష్టించిన అద్భుతం గురించి..ఆయనే సభ్యులకు వివరిస్తే బాగుంటుందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను కళ్లారా చూశాకే.. నివేదికపై చర్చిస్తామన్నారు. కేసీఆర్‌ కూడా మేడిగడ్డకు రావాలని.. ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను సిద్ధంగా ంచామని, హరీష్‌ రావు కూడా మేడిగడ్డకు రావాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. మేడిగడ్డలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. డ్యామ్‌ డిజైన్‌లో చాలా తప్పులున్నాయని, కాంగ్రెస్‌ హయాంలో కట్టిన పలు ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయని, ఇటీవల కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కుంగిపో తున్నాయని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, అలాంటి ప్రాజెక్టులను సరిగ్గా నిర్మించనిపక్షంలో నష్టపోయేది మనమేనన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ఖజానా డబ్బు చాలా వృథా అయిందని, ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను నిర్మించి.. అభివృద్ధి చేశామని ప్రజల్ని మోసం చేశారని సీఎం రేవంత్‌ విమర్శించారు. దేవాలయాలు ఎంత పవిత్రమైనవో.. రైతులకు ప్రాజెక్టులూ అంతేనని చెప్పారు.

ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘తెలంగాణకు ప్రధానంగా తాగు, సాగునీటి కోసం రెండు వనరులున్నాయి. అవి కృష్ణా, గోదావరి జలాలు. కృష్ణా జలాలపై ఇప్పటికే కొంత మేర శాసనసభలో చర్చించాం. వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించగలిగాం. ఇక రెండోది గోదావరి జలాలు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టాలని గతంలో పాలకులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.38,500 కోట్ల అంచనాతో 2008లో టెండర్ల ప్రక్రియ చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి.భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్‌ అనే బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఇలా బ్యారేజీలు కట్టుకుంటూపోయారు. చివరకు రూ.38,500 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.1.47 లక్షల కోట్లకు పెంచారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. అంచనాలు ఎలా పెంచారు? రీడిజైనింగ్‌ ఎలా చేశారు? అందులో సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి? రీడిజైనింగ్‌కు సంబంధించి నిపుణులు ఇచ్చిన డీపీఆర్‌ ఎక్కడ?ఆ తర్వాత జరిగిన నిర్మాణం, నిర్వహణ.. ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నల్లాగే మిగిలాయి.మేడిగడ్డ బ్యారేజీ కింద ఇసుక కదలడం వల్లే కుంగిపోయిందని గత ప్రభుత్వంలో నేతలు అన్నారు. రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. ఇంత జరిగితే.. బ్యారేజీ వద్దకు ఎవరూ వెళ్లకుండా.. చూడనీయకుండా పోలీసు పహారా పెట్టారు.

భారత్‌-పాక్‌ సరిహద్దు వద్ద కూడా ఆ స్థాయిలో సెక్యూరిటీ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాజెక్టు పరిస్థితి ఏంటనే వివరాలతో కూడిన నివేదికను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. చివరకు ఆ నివేదికనూ గత ప్రభుత్వం తప్పుబట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మేడిగడ్డ వద్ద జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని పెద్ద ఎత్తున టీవీలు, పత్రికల్లో వచ్చింది. దీంతో తక్షణమే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించాం. విజిలెన్స్‌ కమిటీ ప్రాథమికంగా ఓ నివేదిక ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలు, నిర్వహణలో నిర్లక్ష్యం సహా అనేక విషయాలను అందులో ప్రస్తావించింది. ఇప్పటికీ బ్యారేజీ వద్ద ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కొంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ వారికి పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ బ్యారేజీ సందర్శనకు రావాలని కోరాం. అదే జరిగితే అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రతి ఒక్కరికీ తెలుస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో గొప్పది.. అద్భుతం.. అని ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారాస నేతలకు ఏటీఎంలా మారిందని.. వారి ఇళ్లల్లో కనకవర్షం కురిసిందని మేం అనడం లేదు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అదొక్కటే మా ఉద్దేశం. ప్రాజెక్టుల వద్ద ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి రెండు మూడు రోజుల్లో శ్వేత పత్రం విడుదల చేస్తాం’ అని రేవంత్‌ రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *