మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతం

గద్దెపైన కొలువుదీరిన సారలమ్మ…మంత్రి సీతక్క పూజలు
తల్లుల విశిష్టత అన్ని  దిక్కుల్లో ప్రతిబింబించేలా జాతర నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడి

మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : తెలంగాణ కుంభమేలా మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని, కన్నెపల్లి నుంచి గద్దెపైకి వొచ్చి సారలమ్మ కొలువు తీరిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం మంత్రి సీతక్క కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం నుండి గద్దె పైకి వొచ్చిన సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు ఇంటికి వెళ్లి ఆలయ శుద్ధి గురించి చర్చించిన మంత్రి అనంతరం సమ్మక్క సారలమ్మ గర్భగుడి నుండి గద్దెలకు చేరుకొని కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ కుంభమేలా మేడారం మహా జాతర  జరుగుతుందని, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కోట్ల మంది భక్తులు వొచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు.

మేడారం మహా జాతర పురస్కరించుకొని ఆదివాసి సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు నడుమ మహా జాతరకు అంకురార్పణ జరిగిందని, వివిధ రాష్ట్రాల నుంచి వొచ్చిన ఆదివాసీలు కొట్టు గోత్రం సంబంధికులు మేడారం గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారని మంత్రి పేర్కొన్నారు. మేడారం జాతరకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, కన్నెపల్లి ఆలయం నుంచి గద్దెపైకి సారలమ్మను ప్రతిష్టించేందుకు ఆదివాసి పద్ధతి ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించామని, డప్పు వాయిద్యాలు, శివశక్తుల సాంప్రదాయాలతో సారలమ్మ కొలువు తీరుతున్నదని మంత్రి అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా హరిత హోటల్‌ వద్ద ఉన్న ట్క్రెబల్‌ మ్యూజియంలో రాష్ట్రంలోని వివిధ ఆదివాసీల సాంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, మన ప్రాంత గొప్పతనం మన తల్లుల విశిష్టత అన్ని దిక్కుల్లో చాటే విధంగా ఘనంగా మేడారం మహా జాతర నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి పూజారులు అమరేందర్‌ కృష్ణయ్య, రామయ్య, మహేష్‌, నితిన్‌, స్వామి బాబురావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *