హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్ల అవినీతి, మెడిగడ్డ బ్రిడ్జి విఫలం కావడానికి కారణం అయిన సీఎం కెసిఆర్, ఇరిగేషన్ మంత్రి, ప్రభుత్వ కార్యదర్శిలు, ఇంజనీర్ లు, ఎల్ అండ్ టీ కంపెనీ కాంట్రాక్ట్ లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. ఈ మొత్తం అవినీతి, అక్రమాలు, ప్రజాధనం వృధాపై సుప్రీం కోర్ట్ పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ అక్రమ ఆస్తులను జాతీయ చేయటానికి భారత రాష్ట్ర పతి, సుప్రీం కోర్ట్ లు చర్యలు చేపట్టాలని కోరారు. రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే రూ.6 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఖజానాని కెసిఆర్ కుటుంబం దోచుకున్నదని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ వ్యాపార వర్గానికి దోచిపెట్టరాని ఆరోపించారు. దళితుల సబ్ ప్లాన్ నిధులను రూ.2 లక్షల కోట్ల దోచుకోని దళిత జాతి అభివృద్ధిని అడ్డుకున్నారని తెలిపారు. కెసిఆర్ కుటుంబం ఇప్పటి వరకూ రూ.10 లక్షల కోట్ల అక్రమార్జన చేసారని ప్రకటించారు. స్వీస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు దాచుకున్నారని ప్రకటించారు. సుప్రీం కోర్ట్ పర్యవేక్షణలో విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ ఎన్నికల్లో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడానికి కెసిఆర్ వర్గం సిద్ధంగా ఉన్నాయన్నారు. కెసిఆర్ అక్రమ సంపాదనలో కేంద్ర బీజేపీ మంత్రులకు వాటాలు ఉన్నాయన్నారు. ఇదంతా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి బాగా తెలుసునని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అంతర్గత ఒప్పందంతో ముందుకు వెళుతున్నాయని తెలంగాణలో ప్రజా రాజకీయాలను, ఎన్నికలను ఖరీదయిన వ్యాపారంగా మార్చివేసిన ద్రోహులను వ్యతిరేకిoచాలని పౌర సమాజానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షులు వేదవృత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి దేవునూరి శ్రీనివాస్, పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శాఖ అధ్యక్షులు ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మెడిగడ్డ బ్రిడ్జి విఫలానికి కారకులను అరెస్ట్ చేయాలి





