తరతమ భేదం లేదు
జీవజాతి విచక్షణ లేదు
పాప పుణ్యాల వివేకం లేదు
పేద ధనిక వర్గీకరణ లేదు
పసి ముసలి వ్యత్యాసం లేదు
ముందస్తు హెచ్చరిక లేదు
దాడి తీవ్రత అంచనా లేదు
పగలు రాత్రి పరిమితుల్లేవు
భూకంపానికి అందరూ ఒక్కటే !

కనివిని ఎరుగని భూప్రళయంతో..
కన్నీరాగని కోట్ల జన విలయాలు
హఠాత్తున భూమి కంపించ..
కాలి కింది నేల గజగజ వణుకు
భవనాలు ఊగి తూగి కూలు
నిలువునా నడి రోడ్లు చీలికలు
ఆకాశహర్మ్యాలు పేకమేడల్లా..
కుప్పకూలి శిథిలాల గుట్టలు
జగత్ప్రళయ ఘోర దృశ్యాలు !

ఎటు చూసిన హాహాకారాలు
జనం దిక్కుతోచక పరుగులు
కాంక్రీట్‌ ‌దిబ్బల్లో నరదేహాలు
దేహాల్లో దిగిన ఇనుప చువ్వలు
పసి కూనల ఆఖరి కేకలు
నిర్దయగా మింగిన ప్రాణాలు
ప్రకృతి ప్రకోప విలయాలు
కానరాని ఆపద్భాందవులు
భూకంప ఘోర వికృతులు !

అతి శీతల వాతావరణాలు
కుచిస్తున్న సహాయ చేతులు
సమాధానమే లేని విపత్తులు
పాలకుల చిత్తశుద్ది కరువులు
ముందు జాగ్రత్తలే ప్రాణ రక్షణలు
ఏకం కావాలి మానవీయ దాతలు
శాంతించాలి భూఅంతరంగాలు
చేతులు కాలక ముందే పట్టాలి ఆకులు
చిమ్మాలి దివ్య ధరణి వెలుగులు !

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
       కరీంనగరం – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *