ఉపాధి, ఆర్థికాభివృద్దిని కలిగిస్తూ మురుగునీరు తొలగించేలా శుద్దిప్లాంట్
ఉన్నతస్థాయి సవిూక్షలో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హైదరాబాద్ మహానగరంలో మూసీనది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై ఆయన సోమవారం సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, హాకర్ జోన్లు, పాత్ వేలను ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్‌షిప్ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీనదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు తగు నీటి మట్టం ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
రెండు రోజుల్లో దిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి
ఖాలీ ఉన్న మంత్రి పదవుల భర్తీ, ఎంపి అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించే అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : సీఎం రేవంత్ రెడ్డి మరో దిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ఇంకా ఖాలీగా ఉన్న 6 మంత్రి పదవుల భర్తీ మరియు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, పార్టీలో చేరికలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ లోక్ సభ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆశావహుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రతి నియోజకవర్గానికి భారీగా పోటీ నెలకొంది. మరోవైపు పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి చాలా మంది బలమైన నేతలు వొచ్చారు. వారంతా వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న యోచనలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఎంపీ అభ్యర్థులపై ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో ఎంపీ అభ్యర్థులపై కొంత వరకు క్లారిటీ వొచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవుల కోసం కూడా పోటీ పెరిగింది. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని కొందరు కీలక నేతలు ఇప్పుడు ఎంపీ టిక్కెట్ రేసులో ఉన్నారు. చాలాకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నా ఎమ్మెల్యే టిక్కెట్ దక్కిని నేతలు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. ఈ అంశాలపైనా దిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తుంది.




