- ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలి
- కుటుంబానికి 25 లక్షలు ఆర్ధిక సాయం అందించాలి
- ఐదు నెలలుగా హోంగార్డులకు జీతాల్లేవు
- హోంగార్డ్ రవీందర్ మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో భద్రత కోసం డీజీపీకి వినతి
- హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని పరామర్శ్డ…పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదని రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. కేసీఆర్‌పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హోంగార్డులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. రాష్ట్రం దివాలా తీయడానికి కారణం కేసీఆర్ అవినీతి అని విరుచుకుపడ్డారు. కాంట్రాక్టర్లు, కమీషన్లు ఇచ్చే వారికే బిల్లులు ఇస్తున్నారన్నారు. రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డీజీపీని కోరామని రేవంత్ తెలిపారు.
సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో భద్రత కోసం డీజీపీకి వినతి
ఈ నెల 16,17 తేదీలలో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో హాజరయ్యే జాతీయ నాయకుల భద్రత కల్పించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్న ఘటనను డీజీపీ దృష్టికి తెచ్చామని అన్నారు. ఈ నెల 16, 17న తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయన్నారు. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని…ఇందుకు సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు.
పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర చేశాయని మండిపడ్డారు. విజయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలని కోరామన్నారు. కేసీఆర్ రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రభుత్వం నుంచి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. విజయభేరీ సభకు ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. కేసీఆర్ చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తుక్కుగూడాలో సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని చెప్పారు. కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని పరామర్శ్డ…పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయం
ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ఉస్మానియా హాస్పిటల్‌లో పరామర్శించారు. కాంగ్రెస్ తరపున రవీందర్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ…హోంగార్డు రవీందర్ ది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆత్మహత్యకు కారణమైన సంబంధిత అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందేనన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం ఇప్పటికీ ఆలోచించడంలేదని విమర్శించారు. కమిషనర్‌తో మాట్లాడి ఆ కుటుంబానికి ఆదుకోవాలని కోరామన్నారు.
కానీ కమిషనర్ స్పందించిన తీరు సరిగా లేదు. ప్రభుత్వ వైఖరినే ఆయన చెప్పినట్లున్నారన్నారు. హోంగార్డు చనిపోతే సంఘీభావం తెలపకుండా మిగతా హోంగార్డులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. రవీందర్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రవీందర్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రవీందర్ కుటుంబానికి 25 లక్షలు ఆర్ధిక సాయం అందించాలన్నారు. వారి కుటుంబం నిరసన తెలపకుండా ఇక్కడి నుంచి తరలించాలని చూస్తున్నారని విమర్శించారు. రవీందర్ కుటుంబానికి అండగా ఉండాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. కనీస మానవత్వం లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అరెస్టు చేసిన హోంగార్డు జెఏసీ నేతలను విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక హోంగార్డులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత వినయ్ రెడ్డి
ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి వినయ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ… బీఆరెస్‌తో కొట్లాడే వారికి ఆర్మూర్ లో బీజేపీ పదవులు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితి రాష్ట్రమంతా ఉందన్నారు. బీజేపీ, బీఆరెస్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. బీజేపీ కేసీఆర్ దోపీడీని బలపరుస్తోంది అని విమర్శించారు. ‘‘బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్‌ను అడుగుతున్నా..బీఆరెస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నా ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదు? అరవింద్ కూడా మోదీ చెప్పింది తప్ప..ఏం చేయలేరు. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు పెట్టలేదు.
కేసీఆర్ ఏమైనా సత్యహరిశ్చంద్రుడా? మహాత్ముడా?శాండ్, ల్యాండ్, మైన్ అన్ని దందాల్లో బీఆరెస్ నేతలే’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతీ అరాచకాలకు బీఆరెస్, కేసీఆర్ కారణం. కేసీఆర్ లక్ష కోట్లు దాచుకున్నరు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్లు ఖర్చు చేసి గెలవలనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ 5వేల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర అప్పు చేసిండు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇదీ అమీన్ వంటి నియంత అన్నారు రేవంత్ రెడ్డి. ఆర్మూర్ కు ఆయన చేసిందేం లేదు అని విమర్శించారు. జమిలి పేరుతో బీజేపీ, బీఆరెస్ రెండు పార్టీలు కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయి. ఇద్దరు కాదు…వంద మంది వొచ్చినా కాంగ్రెస్‌ను ఏం చేయలేరని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ గడ్డపైకి నేను వొస్తా… కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి…జీవన్ రెడ్డి పని పట్టండి అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.




