- మునుగోడు భూములపై టిఆర్‌ఎస్ కళ్లు
- కబ్జాలకు ప్లాన్ చేస్తున్న పార్టీ నేతలు
- ప్రచారంలో విరుచుకు పడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- ఎన్నికల గుర్తుల రద్దుకు టిఆర్‌ఎస్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంపై బండి హర్షం
- బూర నర్సయ్య గౌడ్ చేరికతో మునుగోడులో సమీకరణాలు మారుతాయంటున్న బిజెపి
మునుగోడు భూములపై టీఆర్‌ఎస్ నేతల కళ్లు పడ్డాయని..టీఆర్‌ఎస్ గెలిస్తే ఆ భూములు కబ్జా చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సర్వేలో బీజేపీ గెలుస్తుందన్న సమాచారంతో కేసీఆర్‌కు జ్వరం పట్టిందన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వోటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైందని ఆయన తెలిపారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను వెదజల్లుతున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వందమంది ఇన్ చార్జ్ లను నియమించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినప్పుడు టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం ఎందుకని ప్రశ్నించారు.
సొంత పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రజల ఆశ, ఆకాంక్షలను మునుగోడు ప్రజలు నెరవేరుస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలం కొండాపురం, నేర్మాట గ్రామాల్లో డీకే అరుణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు మటన్, చికెన్‌లు పంచుతు న్నారంటూ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో 57 ఏళ్లు పైబడిన వారికి పింఛన్లు ఇవ్వలేదన్నారు. చాలా గ్రామాల్లోనూ ’మిషన్ భగీరథ’ నీళ్లు రావడం లేదన్నారు. పాలమూరు, రంగారెడ్డిని దత్తత తీసుకుని ప్రతి ఎకరానికి నీరు ఇస్తానని హామీ ఇచ్చి ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. ’రైతుబంధు, దళితబంధు, గిరిజనబంధు పేర్లు చెప్పి మిగతా సంక్షేమ పథకాలను నిలిపివేశారు. ఇక ఎక్కడుంది బంగారు తెలంగాణ’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వసాన్ని కల్పించలేక పోయిందని చెప్పారు. భారతదేశ కీర్తిని పెంచే శక్తి బీజేపీ పార్టీకి మాత్రమే ఉందన్నారు. అవినీతి నాయకులకు బీజేపీ పార్టీ మీటర్లు పెడుతుంది గానీ, రైతులకు మాత్రం పెట్టదన్నారు.
ఎన్నికల గుర్తుల రద్దుకు టిఆర్‌ఎస్ పిటిషన్ మైకోర్టు కొట్టివేయడంపై బండి హర్షం
ఇక ఇండిపెండెంట్లకు సంబంధించిన 8 గుర్తులను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన యారాగండ్లపల్లిలో మాట్లాడుతూ…న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఒడిపోతామన్న భయంతో ఎదో ఒక వంకతో ఎన్నికలను ఆపాలని టీఆర్‌ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం గెలుస్తుందని…మునుగొడులో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి న్యాయస్థానంపై గౌరవం ఉందన్నారు. ఈ గుర్తులు టీఆర్‌ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయని…ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడేమి వచ్చిందో అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
బూర నర్సయ్య గౌడ్ చేరికతో మునుగోడులో సమీకరణాలు మారుతాయంటున్న బిజెపి
బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. బుధవారం బీజేపీ జాతీయ నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే బిజెపి అగ్రనేతలతో భేటీ అయిన బూర పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు. జెపి నడ్డా అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరుతారని తెలుస్తుంది. మరోవైపు బూర చేరికతో మునుగోడులో బిజెపికి సానుకూలం కాగలదని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బిసి వోట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి.




