ముఖ్యమంత్రి కెసిఆర్ నీలం మధుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం దుర్మార్గం

బొల్లారంలో కదం తొక్కిన బీసీలు, సబ్బండ వర్గాలు
నీలం మధుకు సంపూర్ణ మద్దతు
ఇప్పటికైనా పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
లేదంటే ఇండిపెండెంట్ గా నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరిక
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీలు, సబ్బండ వర్గాలు కదం తొక్కారు. బహుజన వర్గాల నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నేతలు ర్యాలీ నిర్వహించారు.జై బీసీ, జై జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 65 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చేయి చూపడం సరికాదన్నారు.119 సీట్లలో బీసీలకు కేవలం 23 సీట్లు మాత్రమే కేటాయించి బీసీ వర్గాలను విస్మరించడం సహేతుకమా అని ప్రశ్నించారు. పటాన్ చెరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గం అందులో ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి కెసిఆర్ మొండిచేయి చూపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అనునిత్యం ప్రజలతో మమేకమై అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన నీలం మధు ముదిరాజ్ ను  బీఅర్ ఎస్ పార్టీ  విస్మరించడం దుర్మార్గం అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పునరాలోచించుకొని పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ బహుజన బిడ్డ నీలం మధు ముదిరాజ్ కి కేటాయించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బీసీ సామాజిక వర్గం అంతా ఏకమై నీలం మధు ముదిరాజ్ ని  సబండవర్గాల అభ్యర్థిగా బరిలోకి దించి, భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మన్నే స్వామి,బొల్లారం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎన్ రాములు,గంతి శంకర్, మైలారం శీను,మచ్చ శ్రీను,శ్రీశైలం, నవీన్ కుమార్ మూర్తి,సట్టా రాజు,రాకేష్,రాము యాదవ్, ధర్మారావు,తేజ,లోకేష్ బాబు, విజయ,తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *