ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం,వివక్ష చూపుతోందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజీలో ఉన్న పెద్దలను ప్రభుత్వం వదిలేస్తుందని ఆరోపిస్తూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమనగల్లు మీదుగా నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ ను బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి ఒగ్గు ప్రభాకర్ ఆధ్వర్యంలో బిజెపి, బిజెవైఎం నాయకులు అడ్డుకోబోయారు. ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై స్థానిక హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ముందుగా బీజేవైఎం నాయకులు ముఖ్యమంత్రి సెక్యూరిటీ కాన్వాయ్ కు అడ్డు తగిలారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్, బీజేవైఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తేరుకునే లోపే తెలంగాణ ప్రగతిరథంలో వస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ బస్సును అడ్డుకోబోయారు. అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వారిని వారించే ప్రయత్నం చేసి లాగివేసింది.. అనంతరం ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బంది వారిని పక్కకు నెట్టేశారు. దీంతో ముఖ్యమంత్రి ప్రగతి రథం ముందుకు సాగింది. అనంతరం బీజేవైఎం నాయకులను స్థానిక పోలీసులకు అప్పగించారు..




