ముందస్తుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఆ మేరకు తమ క్యాడర్‌ను సన్నద్దం చేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ కాలపరిమితి ఈ సంవత్సరాంతంతో ముగియనుండగా, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పార్టీల హడావిడి చూస్తుంటే  అంతకు ముందే  ఎన్నికలు ముంచుకువస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీపైన ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. పాదయాత్రలు, స్ట్రీట్‌ ‌మీటింగ్‌లు, సభలు, సమావేశాలపేరున ఆయా పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు పటిష్టపడకముందే ముందస్తు ఎన్నికలతో వాటిని చిత్తుచేసే ఆలోచన అధికార పార్టీకి ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.  రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జైలుకు పోక తప్పదంటూ చాలాకాలంగా భారతీయ జనతాపార్టీ  విస్తృత ప్రచారం చేస్తున్నది. ఇప్పటికే వివిధ కేసులతో కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని, ఆయన కుటుంబాన్ని బిజెపి పార్టీ ఇరుకున పెడుతూనే ఉంది.

ఏదో ఒక మిషతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి గవర్నర్‌ ‌పాలనకు సిఫారసు చేస్తుందా అన్న చర్చకూడా జరుగుతున్నది. దీనికి తగినట్లుగా ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజాగా తెలంగాణ పర్యటించిన సందర్భంగా మాట్లాడిన తీరుకూడా ముందస్తు దిశగా ఉండటం గమనార్హం. శివరాంపల్లిలోని పోలీస్‌ ‌శిక్షణా కేంద్రంలో ప్రొబెషనరీ ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌ ‌కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలని  బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఈసారి ఎట్టిపరిస్థితిలోనూ గోలకొండ కోటపైన కాషాయ జండా ఎగిరి తీరాలన్న లక్ష్యాన్ని ఆయన వారికి వివరించారు. అందుకు ఇప్పటినుండే ప్రజల మధ్య తిరుగాలంటూ అందుకు తీసుకోవాల్సిన కార్యాచరణను కూడా ఆయన వారికి వివరించడం గమనార్హం. నిరంతరం ఏదో ఒక యాత్రపేరున అంటే అది పాదయాత్ర అయినా, బస్సు యాత్రఅయినా, బైక్‌ ‌ర్యాలీనా ఏదైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే ఉండాలని సూచించారు.

ప్రధానంగా ప్రజల ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై దృష్టి సారించడమేకాదు, వారికి జరుగుతున్న అన్యాయాలపై స్పందించి, వాటి సాధన విషయంలో పోరాటాలు చేయాలని ఆయన వారికి సూచించారు.  దానికి తగినట్లుగా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ ‌కొరతపై రైతాంగం చేస్తున్న ఆందోళనపై ఇప్పుడ బిజెపి తీవ్రంగా స్పందిస్తోంది. దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి  సంబంధిత మంత్రితోపాటు, మంత్రి కెటి రామారావుతో బిజెపి సవాల్‌  ‌కూడా చేసింది•. ఈ విషయలో కాంగ్రెస్‌, ‌వైఎస్‌ఆర్‌టిపి పార్టీలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై దాడిని ప్రారంభించాయి. రాష్ట్రంలో వివిధ గ్రామాలకు చెందిన రైతాంగం సమీపంలోని సబ్‌స్టేషన్‌లపై దాడి చేయడం, సబ్‌స్టేషన్‌ల ముందు ధర్నాలు, రస్తారోకోలు చేస్తూ తీవ్ర ఆందోళన చేస్తున్న దరిమిలా ప్రతిపక్షాలు వారి పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. తెలంగాణ మాడల్‌ అని ఊదరగొడుతున్న తెలంగాణ సర్కార్‌ ‌నిర్వాకమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చనలేసినట్లుందీ బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీరని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ ‌షర్మిల విద్యుత్‌లో తీవ్ర ఆంతరాయం జరుగుతున్న ప్రతీ గ్రామం వద్ద  రైతులతోపాటు తానూ ధర్నాచేస్తూ తన నిరసన వ్యక్తం చేస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ‌డేట్‌, ‌టైమ్‌ ‌చెబితే ఎక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు లేదన్నది ఆధారాలతో నిరూపిస్తానని సవాల్‌ ‌చేస్తున్నాడు. కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికూడా తన పాదయాత్రల క్రమంలో విద్యుత్‌ ‌విషయంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను ఎత్తిచూపుతుండడంతో రాబోయే ఎన్నికలకు విద్యుత్‌ ‌సరఫరానే ప్రధానాంశంగా మారనున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల అభివృద్ధితో పంటల విస్తీర్ణ పెరిగి, డిమాండ్‌ ఎక్కువ కావడం, దానికి తగినట్లుగా విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేయలేక పోవడం ఇప్పుడా పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది. దీంతో గ్రామాల్లో కరెంటు కోతలు పెరిగాయి. ఛత్తీస్‌ఘడ్‌నుండి రాష్ట్రానికి అందుతున్న విద్యుత్‌ ‌నిలిచిపోవడం దెబ్బమీద దెబ్బగా తయారైంది. ఛత్తీస్‌ఘడ్‌నుండి కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు సంబంధించిన  బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం ఈ దురవస్థకు  కారణంగా మారింది.

ఇప్పుడీ సమస్య దాదాపు అన్ని జిల్లాలకు ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌ ‌నగర్‌, ఆదిలాబాద్‌, ‌ఖమ్మం, మెదక్‌ ‌జిల్లాలతోపాటు వనపర్తి, గద్వాల, నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో ఇప్పుడీ సమస్య తీవ్రమయింది. వేసంగి పంటలకు ఈ విద్యుత్‌ ‌కోత పెద్ద అవరోధంగా మారింది. చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ విద్యుత్‌లేకపోవడంతో అనేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న మామిడితోటలకు, బత్తాయి తోటలకు ఇబ్బందికరంగా మారింది. ఇక వరి సంగతి సరేసరి. అబ్‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ అం‌టూ దేశంలో సుగుణాత్మక పాలన తీసుకువస్తామని చెబుతున్న బిఆర్‌ఎస్‌కు ఎన్నికలు సమీపిస్తున్నవేళ రైతాంగ సమస్యలే చుట్టుముడుతున్నాయి. దీనితోపాటు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ఇళ్ళు , పోడు భూముల వ్యవహారంలాంటి పలు సమస్యలకు ముందస్తు ఎన్నికలే మార్గంగా బిఆర్‌ఎస్‌ ఆలోచిస్తోందని, దాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా  ఉండాలంటూ బిజెపితోపాటు ఇతర ప్రతిపక్షాలు కూడా తమ క్యాడర్‌ను సూచనలు  చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *