- 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 5.71 లక్షల ఎకరాలకు సాగునీరు..91 వేల ఎకరాల స్థిరీకరణ
- మీరు సరిగ్గా ఉంటే ప్రజలు ఎందుకు ఓడిస్తారు
- గుజరాత్‌లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పూర్తికి 56 ఏళ్లు పడితే..
- కాళేశ్వరాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేశాం
- పాలమూరు డిపిఆర్‌ను కేంద్రానికి సమర్పించాం
- అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత లక్ష ఎకరాలు జూరాల కింద ఆయకట్టు పెంచామని, మిషన్ కాకతీయ వంటి పనుల వల్ల వలసలు ఆగి వెళ్లిన వారు తిరిగి వొచ్చారని, చిత్తశుద్దితో పని చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా నీటి పారుదల శాఖపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ చేసిన ప్రసంగంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…సెప్టెంబర్ 13, 2022 నాడు పాలమూరు డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మే 12, 2022 నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగులో అభ్యంతరం వ్యక్తం చేశామని, ఎన్జీటీ, కేఆర్‌ఎంబీతో ఏపీ ప్రభుత్వానికి పనులు ఆపాలని ఉత్తర్వులు ఇప్పించగలిగామని తెలిపారు. ప్రజల్లో నమ్మకం వల్ల రెండు సార్లు తమకు అధికారం ఇచ్చారని, మూడోసారి కూడా గెలిచేది బీఆర్‌ఎస్సేని అన్నారు.
ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ…తాము ఎవరినీ కొట్టట్లేదని, వారికి వారే కొట్టుకుంటున్నారని, వారు సరిగ్గా ఉంటే ప్రజలు ఎందుకు ఓడిస్తారని ప్రశ్నించారు. ‘ఆనాడు జలయజ్ఞం పేరుతో మీరు ఏం చేశారో తెలుసు. దాని మీద అప్పుడు పుస్తకాలు కూడా వొచ్చిన విషయం అందరికీ తెలుసు. పాలమూరులో మీ హయాంలో ఎందుకు వలసలు పోయారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద పారింది 27,300 ఎకరాలు మాత్రమే. పంప్ హౌసులు పూర్తి చేయకుండా కాలువలు తవ్వకుండా బిల్లులు తీసుకున్నారు. మా ప్రభుత్వం వొచ్చి రూ. 3663 కోట్లతో మూడింటిని పూర్తి చేసి 5,69,506 ఎకరాలకు నీళ్లు అందించాం. తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి కళ్ల ముందు కనపడుతుంది. పండిన పంట మోయడానికి హమాలీలు సరిపోవడం లేదు. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేస్తే 20 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. భూగర్భ జలాలు 6 మీటర్లు పెరగడం ప్రభుత్వం సాగునీటి రంగంపై పెట్టిన శ్రద్ధకు నిదర్శనం. గోదావరిలో 967 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకుంటున్నాం.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞంలో కొత్తగా వొచ్చిన ఆయకట్టు 5,71,000ఎకరాలు కాగా, 93,000 ఎకరాలు స్థిరీకరించారు. మా ప్రభుత్వం 9 ఏళ్లలో 17,23,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 30,56,000 ఎకరాలు స్థిరీకరణ చేయడం జరిగింది. ప్రాజెక్టులు వారీగా చూస్తే తుమ్మిళ్లను రికార్డు స్థాయిలో 11 నెలల్లో పూర్తి చేశాం. భక్త రామదాసు ప్రాజెక్టుని 10 నెలల్లో పూర్తి చేశాం. మిడ్ మానేరు, శ్రీరాం సాగర్ రెండో దశ, గోదావరి నది మీద లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతి బ్యారేజ్‌లను పూర్తి చేశాం. ఎస్సారెస్పీ పునరుజ్జీవం, సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. కిన్నెరసాని కాలువల పూర్తి, గొల్లవాగు, మత్తడి వాగు, పాలెం వాగు, ర్యాలీ వాగు, గడ్డెన్న సుద్ద వాగు ప్రాజెక్టు, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ కెనాల్, గట్టుపొడిచిన వాగు, దేవాదుల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్‌లను పూర్తి చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ కోసమని, బతికుండగా చూస్తామా? అని అనుకున్నారు. కానీ మూడున్నరేళ్లలో పూర్తి చేసి సాగు, తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు అందిస్తున్నాం. రికార్డు సమయంలో పూర్తి చేశాం.
ప్రాణహిత ప్రాజెక్టును మొదలెట్టినప్పుడు 16 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం..పనులు ప్రారంభం కాకముందే 38 వేల కోట్లకి పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంతేకాక, సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇచ్చే సమయానికి అంచనా వ్యయాన్ని 48 వేల కోట్లు చేశారు. నీళ్లు లేని చోట ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించారు. డబ్బు ఖర్చు చేసి ఉంటే అదంతా వృథా అయ్యేది. కాళేశ్వరంలో దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్ధ్యం, మూడు బ్యారేజీలు, పది ఎత్తిపోతల స్టేషన్లు, 16 రిజర్వాయర్లు, 108 మెగా బాహుబలి పంపులు, 98 సర్జిపూల్స్, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 400 కేవీ సబ్ స్టేషన్లు, 220 కేవీ సబ్ స్టేషన్లు, వందలాది కిలోమీటర్ల విద్యుత్ లైన్లను మూడున్నరేళ్లలో పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టు కింద ఒక లక్షా 30 వేల 500 ఎకరాల కొత్త ఆయకట్టు ఇప్పటికే ఇచ్చాం. 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి 56 ఏళ్లు పట్టింది. 1961లో కొబ్బరికాయ కొడితే 1980లో పనులు ప్రారంభించి 2017లో పూర్తయింది.
మధ్యప్రదేశ్‌లో నిర్మించిన ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ 1984లో శంఖుస్థాపన చేస్తే 2005లో 21 సంవత్సరాలకు పూర్తి చేశారు. మూడున్నరేళ్లలో కాళేశ్వరాన్ని పూర్తి చేసి 817 చెరువులు, 66 చెక్‌డాంలు నింపాం. మేడిపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు 122 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకి ఇప్పటి వరకు 140.91 టీఎంసీలను ఎత్తి పోసి పంటలను కాపాడాం. గోదారిపై 5 బ్యారేజులు నిర్మించి 170 కిలోమీటర్ల వరకు నదిని జీవనదిగా మార్చాం. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ 34.6 కిలోమీటర్లు పూర్తి కావచ్చింది. ఏడాదిలో ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. పాలమూరు – రంగారెడ్డి డీపీఆర్ కేంద్రానికి పంపాం. వట్టెం నుంచి డిండికి నీళ్లు తీసుకుంటామని ప్రతిపాదన ఇచ్చాం. అక్కడి నుంచి అనుమతులు వొస్తే పనులు ప్రారంభిస్తాం’ అంటూ మంత్రి హరీష్ రావు సవివరంగా సమాధానం ఇచ్చారు.




