– మరో 41మంది కూడా..
– పునరావాసం కల్పిస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మొత్తం 42మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి వీరంతా లొంగిపోయారు. ములుగు, భూపాలపల్లి మీదుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం సరిహద్దుల నుంచి పోలీసులు వీరిని వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. మావోయిస్టు నేత హిడ్మా గెరిల్లాను వదిలి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లిన తర్వాత బెటాలియన్ బాధ్యతలను బడ్సే దేవాకు, కేశాలుకు అప్పగించారు. అయితే కొన్ని రోజులు కిందటే కమాండర్ దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత బెటాలియన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సోడిమల్ల కేశాలు సైతం తాజాగా శుక్రవారం లొంగిపోయారు. ఇతనికి సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ వంటి పేర్లున్నాయి. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 42మంది మావోయిస్టులు ఆయుధాలతో శుక్రవారం తమ ముందు లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో గెరిల్లా బెటాలియన్ కమాండర్ సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ ఉన్నారని వెల్లడించారు.
ఆయుధాలు, బంగారంతో ..

ఆయుధాలు, బంగారంతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. 36 తుపాకులు, ఐదు ఏకే 47లు, నాలుగు ఎసఎలఆర్‌లు, 1,007 తూటాలతో పోలీసులు ముందు మావోలు లొంగిపోsయారన్నారు. అలాగే 800 గ్రాముల బంగారం సైతం అప్పగించినట్లు వెల్లడించారు. వీరి లొంగుబాటుతో అత్యంత కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పూర్తిగా కనుమరుగైనట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. గత ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ పెరగడంతో మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందివారు కాగా ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే. లొంగిపోయిన వారికి పునరావాస ప్యాకేజీ కింద రూ.1.93 కోట్లు అందజేస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య కార్డులు అందజేస్తాం. తెలంగాణకు చెందిన వాళ్లు సెంట్రల్ కమిటీలో 11మంది ఉండేవారు.. ఇప్పుడు ఇద్దరున్నారు. స్టేట్ కమిటీలో తెలంగాణ వాళ్లు 24 మంది ఉండగా ఇప్పుడు ఇద్దరే ఉన్నారు.. వాళ్లు కూడా లొంగిపోవాలని అని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





