మార్పు మొదలైంది..

కాంగ్రెస్‌ ‌పాలనతో ప్రజల జీవనంలో మెరుగుదల
అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ
ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా చర్యలు
అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా పథకాల అమలు
ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12: ‌తెలంగాణలో ప్రభుత్వం మారిన కొద్ది నెలలలోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌ద్వారా ప్రకటించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం ప్రజా ప్రభుత్వ విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వొచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకిన సందర్భాలు తరచూ చూశామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, సాధారణ ప్రజానీకాన్ని కేంద్రీకరించి అమలు చేస్తున్న విధానాలు తక్షణ ఉపశమనం కలిగించాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  పలు కీలక కార్యక్రమాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడం సాధ్యమైంది. గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న సమయంలో, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినూత్నంగా నిలిచింది.  ఇళ్లకు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఇవ్వడం ద్వారా మధ్య తరగతి, పేద కుటుంబాలకు భారం తగ్గింది.

ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పరిష్కారంగా, సామాన్య ప్రజలకు వైద్య ఖర్చులను భరించే అవకాశం. ఇప్పటికే ఉన్న రేషన్‌ ‌సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచి, అధిక నాణ్యత కలిగిన బియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా పోషకాహార భద్రతను పెంచారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఈ ట్వీట్‌ ‌చివర్లో, ‘ఇది మార్పు..!! ఇది ప్రజల ప్రభుత్వం..!!’ అంటూ తన ప్రభుత్వ తీరును గర్వంగా ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గ విధంగా చర్యలు తీసుకుంటామని, ఇది సరళమైన హామీ కాదని – అమలులోనే చూపిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *