మానవాళిని దెబ్బతీస్తున్న అతి పారిశ్రామికీకరణ !

* వాతావరణ కాలుష్యంపై పాలకుల్లో చిత్తశుద్ది లోపిస్తోందా?
* వైద్య, ఆరోగ్య రంగానికి సవాల్‌గా పరిణమించిన  కాలుష్యం
* ఊహించని ఉత్పాతాలకు మానవ తప్పిదాలే  కారణం…
* వాస్తవిక రూపం దాల్చుతున్న పర్యావరణవేత్తల ఆందోళనలు
* విషతుల్య పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడాలి

మనది వ్యవసాయిక దేశం..వ్యవసాయమే మన ప్రధాన వనరు. మనకున్న భూమి, నీటి వసతులు ఎంతో విలువైనవి, సారవంతమైన నేలలు, సహజ జలవనరులు మనసొంతం. భారతదేశం అనాదినుంచి వ్యవసా యన్ని ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతోంది. వ్యయసాయాన్ని నమ్ముకున్న మనం.. వ్యవ సాయాధారిత రంగాలనే ఎంచుకోవాలి. మానవులను కబళించే..ఆరోగ్యాన్ని హరించే పరిశ్రమల జోలికి  వెళ్లకుండా ప్రజలు చైతన్యం కావాలి.  పరిశ్రమలను కొనితెచ్చుకుని అనారోగ్యంతో జీవించడం అసవరమా అని ఆలోచించాలి. విషతుల్య పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడాలి. అవసరమైతే వాటిని మూసివేయించాలి. కేవలం వ్యవసాయంతో పాటు, అనుబంధ రంగాలకు మాత్రమే ప్రోత్సాహం ఇచ్చుకునేలా చూడాలి. లేకుంటే మన వనరులు కలుషితం కాగలవు. ఇప్పటికే మన నదులు కలుషితం అవుతున్నాయి. గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నా కారణాలను గుర్తించి నివారణ చర్యలను పాలకులు ఏ మాత్రం  పట్టించుకోవడం లేదు. వాతావరణ కాలుష్యంపై పాలకుల్లో చిత్తశుద్ది లోపించింది. కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు. ఇంతకన్నా దారుణం మరోటి కాదు. ఈ విషయంపై సుప్రీం  మొట్టికాయలు వేస్తున్నా పట్టింపు లేకుండా పోయింది. పాలకుల నిర్లక్ష్యానికి ఇంతకన్నా నిదర్శనం లేదు.  దేశంలో కాలుష్యం పెరగకుండా, కాలుష్యం కాకుండా చర్యలు తీసుకుంటే తప్ప మనుగడ సాధ్యం కాదు. అయితే మధ్యలో వచ్చిన పాలకులు కక్కుర్తిపడిన ఖర్మానికి ప్రజలు కష్టాలు, నష్టాలు అనుభవించాల్సి వస్తోంది. దేశ జనాభా పెరుగుతున్నా మనకు సరైన పౌష్టికాహారం నేటికీ అందడం లేదు.

ఈ క్రమంలో మనమంతా చైతన్య వంతులం అయ్యి మన సహజ వనరులు కలుషితం కాకుండా కాపాడు కోవాల్సి ఉంది. కొండలు గుట్టలను కాపాడుకోవాలి. అడవులను రక్షించుకోవాలి. అడవులను, కొండలను నరకడం కూడా పర్యావరణ విధ్వంసం కిందకే వస్తుంది. మన  అడవులను నరకడంతో ఎన్నో దుష్ఫలితాలు ఎదుర్కొంటున్నాం. మట్టి కలుషితం అయినా, నీరు కలిషితం అయినా మన జీవన మనుగడ ప్రశ్నార్థకం కాగలదు. అయితే ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడి గా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం వల్ల మన నీరు, భూమి కలుషితం అవుతోంది. పర్యావరణ కాలుష్యం ఎక్కువై ప్రపంచ మానవాళి పలు అనారోగ్య సమస్యల వలయంలో చిక్కుకోవటమే  కాకుండా..  మార్కెట్లో మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలను ఇబ్బడి ముబ్బడిగా పడేయడం వల్ల సిరులు పండే నేల, జీవాధారమైన నీరు  కాలుష్యమౌతుంది. వాహనాలు, పరిశ్రమలు వదిలే పొగగాలి కాలుష్యాన్ని  తద్వారా ఉత్పన్నమయ్యే వేడి సమీప ప్రాంతాల జలాశయాల ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఉష్ణ కాలుష్యాన్నీ పెంచుతోంది. ఈ విధంగా మనం చేస్తున్న అకృత్యాల వల్ల కార్బన్‌ ఉద్గారం ఎక్కువ కావడం తో వాయు కాలుష్యం ఏర్పడి వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి.  వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ వ్యాధులు, వివిధ రకాల మెదడు, గుండె సమస్యలు పెరుగుతున్నాయి.

వాయు కాలుష్యం పెరిగి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం, మెదడులో రక్తం గడ్డ కట్టడం, కంటిచూపు మందగించడం లాంటి రుగ్మతలు ఎక్కువ అవుతున్నా యని అనేక ఆరోగ్య సర్వేలు వెల్లడించాయి. నేడు మనం నిత్యం వాడే  పాలు పండ్లు కూరగాయలు కలుషితమౌతున్నాయి. అలాగే పండించే  పంటలు కాలుష్యం బారిన పడుతున్నాయి. ఈ పదార్థాలు తినడం వల్ల కూడా విపరీతమైన ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం.  పచ్చని పంట పొలాలు విషతుల్యం అవుతాయి. ఆ మధ్య  విశాఖలో జరిగిన  గ్యాస్‌ లీకేజ్‌ ఘటన తక్కువదేవిూ కాదు. ఇలాంటి పరిశ్రమలు అవసరమా అన్నది ఆలోచన చేయాలి. మనకున్న భూమిని, ప్రకృతిని కాపాడుకునేందుకు గట్టి సంకల్పం కావాలి. దీర్ఘకాలంలో పర్యావరణానికి చేటు కలిగిస్తున్న మానవ తప్పిదాలు ఊహించని ఉత్పాతాలకు కారణం కావడం మిక్కిలి ఆందోళనకరం. పర్యావరణ, సంస్కృతి, జీవ వైవిధ్యాల పరంగా ప్రాశస్త్యం కలిగిన పశ్చిమ కనుమలు రానురాను ప్రమాద భరితంగా తయారవడానికి దోపిడీతో కూడిన మానవ తప్పిదాలే కారణమని పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు.

గనులు, క్వారీల తవ్వకాలు,అడవుల విధ్వంసం, పట్టణీకరణ, అటవీ భూములను అటవేతర పనులకు మార్పు చేయడం, నదులు, నదీ ప్రవాహ ప్రాంతాలకు అడ్డంగా పక్కా నిర్మాణాల వంటివి పశ్చిమ కనుమలను విధ్వంసం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు, గోవా, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ పశ్చిమ కనుమల్లో భాగం. గతేడాది నాటి కేరళ మహోగ్ర వరదలతో సహా ప్రస్తుత జలవిపత్తుల వరకు అన్నీ పడమటి కనుమల్లోనే సంభవిస్తుండటాన్ని బట్టి చూస్తే పర్యావరణవేత్తల ఆందోళనలు వాస్తవిక రూపం దాల్చుతున్నాయని భావించాల్సి ఉంటుంది.  2013లో ఉత్తరాఖండ్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తి నప్పుడు నదులపై ఇబ్బడిముబ్బడిగా నెలకొల్పిన జల విద్యుత్‌ ప్రాజెక్టులు నదుల ప్రవాహాన్ని ఆటంక పర్చి చుట్టుపక్కనున్న ప్రాంతాలను ముంచెత్తాయని కనుగొన్నారు. కానీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మళ్లీ ఎప్పుడైనా వరదలొచ్చినప్పుడు మాత్రమే అలాంటి అక్రమాలు చర్చకొస్తాయి. ప్రభుత్వాలకు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అబ్బినందున ప్రజలకు కష్టనష్టాలు తప్పట్లేదు. మొత్తంగా వరదలకు దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదల ఉధృతికి కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, బీహార్‌లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.

అత్యధిక వర్షపాతం నమోదయినా నీటి సంరక్షణపై పాలకుల్లో చిత్తశుద్ది లోపించడంతో పాటు, అమలు చేయాలన్న లక్ష్యం కానరావడం లేదు. సరిగ్గా 39 ఏళ్ల క్రితం 1984 డిసెంబర్‌ 2న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరంలో ‘యూనియన్‌ కార్బైడ్‌ కెమికల్స్‌’ ఫ్యాక్టరీలో నుంచి విషవాయు వులు వెలువడి నగరంలోని వేలాదిమంది ప్రజలను నిమిషాలలో మట్టుబెట్టాయి.  భోపాల్‌ యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ నుండి వెలువడిన  మిథేల్‌ ఐసోసైనేట్‌ అనే విషపూరిత రసాయన వాయువు వల్ల దుష్ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నాం. భోపాల్‌ నగరంలో ఆరోజు. అమెరికాకు చెందిన అతి పెద్ద బహుళజాతి కంపెనీ  ఒక స్టోరేజ్‌ ట్యాంకు నుండి వెలువడిన విషవాయువు కారణంగా నిద్రిస్తున్న నగర మంతటా వ్యాపించింది. 2,500 మంది అప్పటికప్పుడే మరణించగా క్రమంగా మృతుల సంఖ్య 22 వేల మందికి చేరింది. దాదాపు అయిదు లక్షల యాభైవేల మంది ప్రజలు తీవ్రమైన ప్రభావానికి గురయ్యారు. వందలాదిమంది శాశ్వతంగా వికలాంగులయ్యారు. గర్భిణీ స్త్రీలు మృత శిశువులను ప్రసవించారు. 15 వేల పశువులు, ఇంకా వేల సంఖ్యలో పక్షులు కూడా చనిపోయాయి. ఈ విష వాయువు వల్ల సంభవించే దీర్ఘకాలిక ప్రభావాల వల్ల నేటికీ ప్రజలు వైద్యం చేయించుకోవాల్సి దుస్థితిని చూస్తున్నాం.

ఆ విషపూరిత వ్యర్థాలు తీవ్ర పరిణామాలతో భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. వీటిని సక్రమంగా నిల్వ చేయకపోవడం వల్ల ప్రమాదం కొనసాగుతూనే ఉంది. ఈ దారుణమైన దుర్ఘటనకు కారకులెవరన్నది పక్కన పెడితే ఇలాంటి పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ద్వారా మన ప్రజలను మనమే చంపుకుంటు న్నామన్న  విషయాన్ని పాలకులు గుర్తించడం లేదు. అణుప్రమాదాల చరిత్రలోనే అతి పెద్దదైన ప్రమాదం జపాన్‌లోని ఫుకుషిమా ఘటన. దీని నుండి కూడా మన పాలకులు ఎటువంటి పాఠం నేర్చుకోలేదు. భోపాల్‌ విషయవాయువు వెలువడడానికి ముందు ప్లాంటులో భద్రతా చర్యలు సక్రమంగా లేవని, ప్రమాదకరంగా ఉన్నాయన్న హెచ్చరికలను కంపెనీ పట్టించుకోలేదు. వారు తమ స్వలాభం కోసం కార్మికులను, ప్రజలను బలిపశువులను చేశారు.  భోపాల్‌ ప్లాంట్‌లో భద్రతాచర్యలు లేవనే సమస్యను ఆ ప్లాంట్‌లోని కార్మిక సంఘాలు పదేపదే లేవనెత్తాయి. వాటిని యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ చివరకు బాధపడిందెవరు?  కార్మికులు, భోపాల్‌లోని పేదలు మాత్రమే. ప్లాంట్‌ చుట్టూ ఉన్న కార్మికుల కాలనీలు, పేదల బస్తీలు, మురికివాడల్లో నివసించేవారే ఎక్కువగా నష్టపోయారు. నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వం  చర్యలు తీసుకోలేక పోయింది.

బాధ్యులకు శిక్షపడిన తీరు కూడా అనుమానమే. భోపాల్‌ ప్రజలకు తగిన విధంగా నష్టపరిహారం ఇచ్చారా అంటే అదీ అరకొరే. వారి వైద్య ఖర్చులు చెల్లించడం లాంటివి కూడా అంతంతమాత్రమే.  ఇలాంటివి జరగకుండా అడ్డుకునేందుకు, జవాబుదారీతనం కల్పించేందుకు భారత ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోలేదు. దోపిడీ చేసేవారికి, బహుళజాతి కంపెనీల అత్యాశకు, ప్రభుత్వంలోని వారి మద్దతుదార్లకు వ్యతిరేకంగా దోపిడీకి గురౌతున్న పేదలు జరిపిన పోరాటమే. ఈ మొత్తం విషాదగాథ కొన్ని కఠోర సత్యాలను మన ముందుంచాయి. నాటి  నుంచి నేటి ప్రభుత్వాలు అమెరికా, భారత బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడుతూ వచ్చాయనేది అక్షరసత్యం. భోపాల్‌ దుర్ఘటనలో మరణించిన 22 వేల మంది, గాయపడిన లక్షలాది మంది ప్రజలు పేదవారే. ప్రపంచంలో ఎక్కడా ఎవరూ ఉపయోగించ వీలులేని అధ్వాన్నమైన టెక్నాలజీని భోపాల్‌లో వాడినట్లు గ్యాస్‌ దుర్ఘటన సంభవించేవరకూ తెలియదు. ఇప్పటికీ భోపాల్‌ యు.సి.సి. ప్లాంట్‌లో వేలాది టన్నుల విషపూరిత పదార్థాలున్నాయి. కార్పొరేట్‌, ఎం.ఎన్‌.సి శక్తివంత కంపెనీలు తమ చేష్టల వల్ల ప్రస్తుత తరంపైనా, రేపటితరాలపైనా చూపే ప్రభావాల గురించి పట్టించుకోవని రుజువు అయ్యింది.

తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఆర్జించే ఏకసూత్ర కార్యక్రమం వారిది. కాబట్టి మన దేశంలో పరిహారాలకు సంబంధించి కఠినమైన చట్టాలు తేవాలి. భోపాల్‌ దుర్ఘటనను ఎన్నడూ మరచిపోరాదు. దీనికి కారకులైనవారిని బోనులో నిలబెట్టాలి. భోపాల్‌ ప్లాంట్‌లోని వ్యర్థ పదార్థాలను తొలగించే బాధ్యత చేపట్టాలి. నష్ట పరిహారం పెంచాలి. బాధితుల కోసం సక్రమమైన వైద్య వ్యవస్థను ఏర్పాటుచేసి వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. భోపాల్‌ దుర్ఘటన నుండి గుణపాఠం నేర్చుకోకపోతే భవిష్యత్‌ తరాలు పాలక వర్గాలను క్షమించవు. అలాగే ప్రజలు కూడా చైతన్యం కాకపోతే ఇలాంటి దురవస్థలు కూడా తప్పవు. కాలుష్యం ఫలితంగా  ప్రపంచంలో మానవజాతి నయం చేయలేని భయంకర రోగాలబారిన  పడి వైద్య, ఆరోగ్య రంగానికి సవాల్‌గా పరిణమిం చడం చూస్తున్నాం. అతి పారిశ్రామికీకరణ అన్నది మానవాళిని దెబ్బతీస్తుందని గుర్తించాలి.

-ఎం.  శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *