- విపక్షాలను గెలిపిస్తే సంక్షేమం సంక్షోభమే ..: బిఆర్‌ఎస్
- బిఆర్‌ఎస్ అవినీతిపై ధ్వజమెత్తుతున్న కాంగ్రెస్, బిజెపి
ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది రాజకీయ పార్టీల మాటలు తూటాలుగా పేలుతున్నాయి. పార్టీలు, సిద్ధాంతాల పరంగా మాట్లాడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఆవేశ పూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. అయితే వారి విమర్శలు హద్దు మీరుతున్నాయి. మాటల్లో దిగజారుడుతనం కనిపిస్తున్నది. నోటికి ఎంతవస్తే అంతే అన్నట్లుగా నాయకులు గళాలను విప్పుతున్నారు. కాగా నిన్నటితో నామినేషన్‌ల ఘట్టం ముగియగా …, ఈ నెల 15న ఎవరెవరు పోటీలో ఉంటారన్నది స్పష్టం కానుంది. పోలింగ్‌కు మధ్యలో ఉన్న పదిహేను రోజులు వ్యవధిలో తెలంగాణ రాజకీయ సమీకరణల్లో అనూహ్య మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ శక్తిమేరకు పోరాటం చేస్తున్నాయి. ప్రధానంగా బిఆర్‌ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనపై ఈ రెండు పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. ఇంతకాలంగా బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలనే ఈ పార్టీలు తమ ప్రచార అస్త్రంగా మలుచుకున్నాయి. దక్షిణాదిరాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు తెలంగాణను ముఖద్వారంగా చేసుకోవాలన్న ప్రయత్నంలో బిజెపి ఉంది.
అందుకే ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఈ రాష్ట్ర ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వయంగా ప్రధాన మంత్రి అంతటివాడే ఇప్పటికి అనేక సార్లు తెలంగాణలో పర్యటించాడు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఈ నెల 7న వొచ్చిన మోదీ, మరోసారి 11వ తేదీన రానున్నారు. మోదీ మొదటినుండీ బిఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చూస్తూనే ఉన్నారు. ఆయన అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరుకున్నాయని, త్వరలోనే పాపం పండుతున్నదని ఆయన తాజా పర్యటనలో పేర్కొన్న విషయం తెలియందికాదు. బిజెపి ప్రధానంగా బిఆర్‌ఎస్ కుటుంబ పాలనపైన ధ్వజమెత్తుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరైనా బాగుపడ్డారంటే అది కెసిఆర్ కుటుంబానికి చెందిన ఆ నలుగురే నంటూ ఆ పార్టీ మొదటినుండీ ఎత్తిచూపుతోంది. ఉద్యోగుల నోటిఫికేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, ప్రాజెక్టుల్లోని అవినీతిపై నిలదీస్తున్నది.. అయితే కాంగ్రెస్‌పైన కూడా తన విమర్షనాస్త్రాలను అదే విధంగా సంధిస్తున్నది. నెహ్రూ మొదలు నేటి రాహుల్, ప్రియాంక వరకు ఒకే కుటుంబానికి చెందిన వారు కాంగ్రెస్‌ను శాసిస్తూ వొస్తున్న రీతిపైన సెటైర్లు వేస్తున్నారు. బిసి సిఎంను ప్రకటించడం ద్వారా ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు నిద్రలేకుండా చేశామనుకుంటున్న బిజెపి, విపక్షాలు కూడా సిఎంను ఎవరిని చేస్తారన్న ప్రకటన చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ఆ పక్షాలను ఇరుకున పెడుతున్నది. నిజంగా కాంగ్రెస్‌కు బిసీలపైన అభిమానమే ఉంటే నిజామాబాద్‌లో 11 శాసనసభ స్థానాల్లో ఒక్క బిసీకి కూడా టికెట్ ఇవ్వకపోవడాన్ని బిజెపి ఎత్తి చూపుతోంది. కాంగ్రెస్ విధానాలు నచ్చకనే ప్రజలు గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించిన విషయాన్ని ఆ పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
కాంగ్రెస్‌కూడా అంతే ధీటుగా బిఆర్‌ఎస్, బిజెపిలను ఎదుర్కుంటున్నది. రెండు తోడుదొంగలేనంటూ, ఈ రెండు పార్టీలకు అంతర్ఘత ఒప్పందాలున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ముఖ్యంగా కెసిఆర్ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడంపట్ల బిజెపిని కాంగ్రెస్ తప్పుపడుతోంది. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని తమ పార్టీతోపాటు, బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా ఆరోపిస్తున్న క్రమంలో ఇంతవరకు దానిపైన సరైన దర్యాప్తు చేయకపోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్‌కు ఏటిఎం అని ప్రధాని మొదలు, పలువురు కేంద్ర నాయకులు అనడమేగాని చర్యలు తీసుకోవడం లేదంటోంది కాంగ్రెస్. ప్రధానంగా దిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై చర్యలు చేపట్టకపోవడపట్ల తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నది కాంగ్రెస్. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర పాలకులు దోపిడీ చేశారని గొంతెత్తి అరిచిన కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రంలో బడా కాంట్రాక్టులన్నిటినీ పర్సంటేజీల కోసం ఆంధ్ర కాంట్రాక్టర్లకే కట్టబెట్టాడని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కూలుతున్నా రాష్ట్రానికి వొచ్చిన ప్రధాని దాని ఊసెత్తకపోవడంపై తీవ్ర అగ్రహం వ్యక్తంచేస్తున్నది. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాంగ్రెస్ ప్రజలను కోరుతున్నది. ఇక తమ పార్టీ పాలనలో ఏమీ చేయలేదనడాన్ని కాంగ్రెస్ నిర్ద్వందంగా ఖండిరచింది. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో నాగర్జున సాగర్ మొదలు అనేక ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రాణహిత` చేవెళ్ళ ప్రాజెక్టుకు తుమ్మళహెట్టి దగ్గర వైఎస్ శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆ పార్టీ గుర్తుచేస్తున్నది. ఇక ఉచితాల విషయానికి వొస్తే రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెసేనని, 108 అంబులెన్స్ ద్వారా ఆరోగ్య పరిరక్షణ, పోడు భూములకు పట్టాలు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటున్నారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలతోపాటు డిక్లరేషన్‌ల పేర వివిధ వర్గాల అభ్యున్నతికి తమ పార్టీ కృషిచేస్తుందని చెబుతున్న కాంగ్రెస్, మరిచిపోయి కూడా అవినీతి బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వోటు వేయవద్దని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది.
అయితే అధికారంలోకి వొస్తే తమ పారీ ఏంచేస్తుందన్నది చెబుతున్న క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘కెసిఆర్ ఫుల్ బాటిల్ కావాలా…?’ అని అడిగిన విధానాన్ని మాత్రం పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇదిలాఉంటే ఎప్పుడు పరుష పదాలతో ప్రతిపక్షాలను చీల్చిచెండాడే బిఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పవరకు వివిధ నియోజకవర్గాల ప్రచార సభల్లో చాలా వరకు సౌమ్యంగా మాట్లాడటం గమనార్హం. రాజకీయాల్లో ఇంకా పరిణితి రావాలని, వోటు వేసేప్పుడు అభ్యర్థి, ఆయన వెనుక ఉన్న పార్టీ విధానాలను ఆలోచించి వేయాలనే చెబుతున్నారు. అయితే ఆయన కూడా బిజెపి, కాంగ్రెస్‌లను ఒక పరిధిలో ఘాటుగానే విమర్షిస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ పట్ల ఎలా సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నదన్న విషయాన్ని ఉదాహరణలతో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. విభజన ఒప్పందాలను నెరవేర్చకపోగా, వివిధ రాష్ట్రాలతో సమానంగా నిధులు, పథకాలను అమలు పర్చకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. గత రెండు విడుతలుగా ఎన్నికల మానిఫెస్టోలో పొందుపర్చిన వాటితో పాటుగా ఇతరత్రా సంక్షేమ పథకాలను అమలు చేయడంద్వారా సమాజంలోని భిన్న వర్గాల వారిని ఆర్థికంగా, హార్థికంగా తమ ప్రభుత్వం ఆదుకుంటున్న తీరును ఆయన ఏకరువు పెడుతున్నారు. ముఖ్యంగా దేశంలో మరే రాష్ట్రంలో అమలులోలేని 24 గంట కరెంటుపైనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి కేవలం మూడు గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి అన్నాడన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేరీతిలో చెప్పే ప్రయత్నంచేస్తున్నాడు. అందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తమ రాష్ట్రంలో అయిదు గంటల విద్యుత్‌ను ఇస్తున్నామని చెప్పిన మాటలను నొక్కిచెబుతున్నారు.
అలాగే మాజీ పిసీసీ అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజలు టాక్స్ రూపంలో చెల్లించే డబ్బును సంక్షేప పథకాలపేర వృధా చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ధరణిని బంగాళఖాతంలో కలుపుతామంటున్న బిజెపి, కాంగ్రెస్‌ల విధానాలవల్ల లబ్ధిదారులకు జరిగే నష్టమేంటన్న విషయాన్ని ప్రజలకు విస్తారంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాయి బిఆర్‌ఎస్ వర్గాలు. మొత్తంమీద రాష్ట్రంలో ఇప్పుడు ఈ మూడు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది.
-మండువ రవీందర్‌రావు




