మాటలకే పరిమితమైన మహిళా అభ్యున్నతి

తెలంగాణ రాష్ట్ర సాదనోధ్యమంలో మహిళల పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీ లను వివస్త్రలను చేసి బతుకమ్మలాడించిన పురుషాధిక్యతపై ఎక్కు పెట్టి బరిగీసి కొట్లాడిన చరిత్ర మహిళలకు ఉంది. ఈ స్ఫూర్తితో వెట్టిచాకిరి, గృహ హింసలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, దూడల సాలమ్మ, ఈశ్వరిబాయి, సదా లక్ష్మి, సరోజినీ నాయుడు, మల్లు స్వరాజ్యం లాంటి మహిళలు పోరాట నగారా మోగించారు. 1990వ దశకంలో బెల్లి లలిత తన జానపద పాటలతో మహిళా హక్కుల డిమాండ్‌ ‌మొదలైంది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో పురుషులతో పాటు స్త్రీలు రబ్బరు బుల్లెట్లకు, బూట్ల తండ్లాటలు చవిచూశారు. విమలక్క లాంటి అనేక మంది మహిళా ఉద్యమకారులు తమ మాట ఆట పాటకు పదును పెట్టి వంటింట్లో ఉన్నటువంటి సబ్బండ వర్గాల కులాల మహిళలను సైతం ఉద్యమంలో భాగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించగలిగారు. తెలంగాణ సాకారంతో తమ పట్ల కొనసాగుతున్న వివక్ష, దోపిడి, దౌర్జన్యం  నుంచి తాము రక్షించబడతామని, తమ జీవితాలలో సాధికారత సాధిస్తామని అనుకున్నారు. స్వరాష్టంలో తమకు ఆత్మ గౌరవంతో కూడిన జీవితం ఉంటుందని కలలు గన్నారు. కాని స్వయం పాలనలో ఆది నుండే మహిళల పట్ల వివక్ష మొదలైంది. ఉద్యమ కాలంలో ఆశించినంతగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత మహిళలకు తగిన గుర్తింపు దక్కకపోగా హత్యలకు, అత్యాచారాలకు నిలయమైంది.

పాలనలో మహిళలకు తగిన భాగస్వామ్యం ఏది..?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌చెపుతున్న ప్రకారమే తెలంగాణ లోని మొత్తం ఓటర్లు 2,99,92,941. ఇందులో మహిళల కంటే పురుషుల ఓట్లు కేవలం 1,25,221 మాత్రమే ఎక్కువగా ఉన్నారు. ఇంచుమించుగా మహిళా ఓటర్లు 48% గా ఉంది. ఓటు హక్కు వినియోగంలోనూ కూడా మహిళలే ప్రథమ స్థానంలో ఉన్నారు. కాని ఇందుకు అనుగుణంగా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. 119 మంది ప్రాతినిధ్యం వహించే తెలంగాణ శాసన సభలో 2014లో తెరాస 09 మంది మహిళలకి బి ఫామ్‌లు ఇస్తే  గెలుపొందిన మహిళా ఎమ్మెల్యేలు 06. 2018లో అక్రమ పద్దతిలో వచ్చి చేరినవారు కాక  తెరాస పార్టీ నుంచి 04 పోటి చేస్తే గెలుపొందిన మహిళా ఎమ్మెల్యేలు కేవలం 03 మాత్రమే. 2014 లోనైతే ఒక్క మహిళకు కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు. 2014తో పోలిస్తే సగానికి సగం తగ్గింది. ఒకసారి(2014) 5% మరొకసారి (2018) 3%  మాత్రమే  అసెంబ్లీకి పంపగలిగింది. ఈ బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తుండడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి ఉండదు. మహిళలు ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు కాడికి వచ్చేసరికి మహిళలు కావాలసి వస్తుంది. కాని వారి నిష్పత్తి ప్రాతిపదికన చట్టసభల్లో అవకాశం దక్కడం లేదు. యుఎస్‌లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకురాలు రితికా కుమార్‌ ‌తన మాటలలో ‘ప్రజాస్వామ్యం నిజమైన ప్రతినిధిగా ఉండాలంటే, ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు టేబుల్‌పై సీటు కలిగి ఉండాలి’’ అని  అన్నారు. స్థానిక సంస్థలలో మహిళలు ఎన్నికల్లో గెలవడమే కాకుండా తిరిగి మళ్లీ ఎన్నికయ్యే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నారు. చైర్మైన్‌లుగా, ఎంపిపిలుగా రాణిస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్‌ ‌కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అందుకు అనుగుణంగా ఉద్యమాలు చేస్తామని ప్రగల్భాలు పలికిన బారాసా పార్టీ అటువైపు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్ట లేదు. ఇక్కడ 3% అమలు చేస్తూ అక్కడ 33% మహిళలకు ఇవ్వాలని అడగడం నైతికమైన చర్యనా.! ఇక్కడ శాసనసభకు 40% మహిళలకు ఇచ్చి అక్కడ కేంద్రాన్ని నిలదీస్తే సమాజం హర్షిస్తది. అలా కాకుండా మహిళలను మూడవ తరగతి పౌరులుగా చూస్తూ మహిళల పేరిట సంబరాలు చేయడం తగునా.!

పెరుగుతున్న లైంగిక నేరాల పై స్పందించరా..!
దేశంలోనూ, తెలంగాణలోనూ పసిపిల్లల నుండి మొదలుకొని పండు ముసలి వరకు నిరంతరం అత్యాచారాలకు గురి అవుతూనే ఉన్నారు. నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డ్ ‌బ్యూరో  2021 లెక్కల ప్రకారం దేశంలో సగటున రోజుకు మహిళలపై 86 అత్యాచారాలు జరుగుతున్నాయని వెల్లడించింది. తెలంగాణలో మహిళలపై లైంగిక వేధింపులు 2020 నుండి 2021 వరకు 17 శాతానికి పైగా పెరిగాయని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమర్పించిన గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో 2021లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి 20,865 కేసులు నమోదయ్యాయని, 2020లో 17,791 కేసులు, 2019లో 18,394 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. నేర నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా నేరాలను కట్టడి చేయడానికి 17000 వాహనాలను కొనుగోలు చేసింది. దాదాపు 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయినా తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా హైదరాబాదులోనే మహిళలు, యువతులు హత్యలు అత్యాచారాలకు గురవుతున్నారు. రోజురోజుకు మహిళల పట్ల క్రైమ్‌ ‌రేటు పెరుగుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి స్పష్టం చేస్తుంది. మహిళల భద్రత కోసం అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది.
నిర్భయ నిధిని వినియోగించుకోవడంలో అలసత్వం ఎందుకు..?
మహిళల భద్రత కోసం కేంద్రం కేటాయిస్తున్న నిర్భయ నిధి తెలంగాణ సక్రమంగా వినియోగించుకోవడంలేదని ఆరోపణలు విలువెత్తుతున్నాయి. అందుకు కేంద్రం విడుదల చేసిన నివేదికే సాక్షం. 2016-17 నుంచి 2021-22 వరకు నిర్భయ నిధుల్లో 16 శాతం వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. తెలంగాణకు కేంద్రం రూ.238.06 కోట్లు విడుదల చేసిందని, అందులో రాష్ట్రం రూ.200.95 కోట్లు వినియోగించుకుందని పేర్కొంది. మహిళల భద్రత మరియు భద్రతను పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను అమలు చేయడానికి ఈ నిధిని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సక్రమంగా వినియోగించుకోలేక పోతుంది.

గృహ హింసలో తెలంగాణ రెండవ స్థానం సూచి దేనికి..?
గృహహింస కేసులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానం ఆక్రమించుకుంది. అస్సాం నంబర్‌ ‌వన్‌, ‌తెలంగాణ రెండు, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. దేశంలో గృహహింస ఘటనలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గృహ హింసలో 50.4%తో  తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. 75 % తో అస్సాం ప్రథ•మ స్థానంలో ఉండగా, ఢిల్లీ 48.93%తో రెండో స్థానంలో ఉంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన భారతదేశంలో స్త్రీలు మరియు పురుషుల సర్వే 2022లో ఈ విషయం వెల్లడించింది. అనేక ప్రాంతాలలో చాలా మంది మహిళలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయి.కిడ్నాప్‌, అత్యాచారయత్నం లాంటి అనేక ఘటనలు మహిళలు ఎదుర్కొంటున్నారు. 2021-22 నాటికి దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు సంబంధించిన 21 లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 83,536 కేసులు పరిష్కరించారు. ఇలాంటి కేసులను కోర్టులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై చర్యలు ఏవి..?
పోలీసులు శృతిని పాశవికంగా అతి క్రూరంగా అత్యాచారం చేసిన ఎన్కౌంటర్‌ ‌చేసిన విషయం నుండి మొదలుకొని, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులైన దుర్గం చిన్నయ్య, తాటికొండ రాజయ్య లాంటి అనేక మంది ప్రజా ప్రతినిధులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో కనీసం విచారణ కూడా చేపట్టలేదు. స్థానిక ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు తెలంగాణ సమాజానికి గరహనీయమైనది. దీనంతటికీ  ప్రజాస్వామిక పద్ధతిలో పాలన కొనసాగక పోవడం ఒక కారణమై•శీ…మరో వైపు పురుషాధిక్యత భావజాలంలో పాలన కొనసాగడం. పాలకవర్గ స్వభావం మారకుండా మహిళా అభ్యున్నతి కోసం చెబుతున్న మాటలు అబద్ధాలు మాత్రమే.
చట్టాలు ఎన్నొచ్చినా,చర్యలు మాత్రం కంటి తూడుపే
భారత రాజ్యాంగం మహిళల రక్షణ కోసం వారి అభ్యున్నతి కోసం అనేక హక్కులను కల్పించింది. ఈ హక్కుల ప్రాతిపదికగా భారత పార్లమెంట్‌ ‌మహిళల రక్షణ కోసం వారిని దోపిడీ పీడన నుండి కాపాడడం కోసం అనేక చట్టాలను రూపొందించింది. నిర్భయ చట్టం (క్రిమినల్‌ ‌లా అమెండ్మెంట్‌ ‌యాక్ట్ 2013)
‌మహిళలకు సంబంధించి నేరాలలో కఠిన శిక్షలు పడేలా ఈ చట్టం తీసుకొచ్చారు. డొమెస్టిక్‌ ‌వాయిలెన్స్ ‌యాక్ట్ 2005(‌గృహహింస నుంచి మహిళలు రక్షణ పొందే చట్టం), గృహహింస నిరోధక చట్టం, సతి సహగమన నిషేధ చట్టం, వరకట్న నిషేధ చట్టం 1961, సెక్సువల్‌ ‌హరాశ్మంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎట్‌ ‌వర్క్ ‌ప్లేస్‌ ‌యాక్ట్ 2013 ఇలా అనేక చట్టాలు రూపొందిస్తున్నప్పటికీ ఆచరణలో సరిగ్గా అమలు కావడం లేదు. ఇన్సిడెంట్‌ ‌జరిగినప్పుడు స్పందించినంత వేగంగా  న్యాయస్థానాల్లో పురోగతి ఉండడం లేదు. అందుకు నేరాల తీవ్రత మహిళ పట్ల రోజురోజుకు పెరిగిపోతుంది.మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు కంటి తూడుపు చర్యలుగా మాత్రమే ఉన్నవి.

మద్యంపై ఉన్న ప్రేమ మహిళల రక్షణపై ఏది..?
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం విక్రయాలే మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు అత్యాచారాలకు ప్రధాన కారణం. మధ్యమత్తులో మానవ మృగాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు అర్ధరాత్రి ఒంటిగంట వరకు బార్లకు పబ్బులకు వైన్‌ ‌షాపులకు అనుమతిలిస్తూ యథేచ్ఛగా ప్రభుత్వం మద్యంపై ఆధారపడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్న దుస్థితి. గ్రామాలల్లోను, పట్టణాలలోను విచ్చలవిడిగా బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ కుటుంబాల్లో ప్రభుత్వం చిచ్చులు పెడుతున్న పరిస్థితి దాపురించింది. ఒక్క 2022లోనే 34,352 కోట్ల మధ్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌ ‌శాఖానే వెల్లడించింది. రాష్ట్ర ఖజానా నింపుకోవడం కోసం మద్యం పాలసీలో అనేక మార్పులు తీసుకొస్తుంది. కానీ మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం చేపట్టే చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నవి. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నవి. మొన్న హైదరాబాదులో అప్సర అనే యువతిని సాయి కృష్ణ అనే బ్రాహ్మణుడు హత్య చేసినా కనీసం మహిళా కమిషన్‌ ఆ ‌కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు.

మహిళలకు ఇచ్చిన హమీల సంగతి ఏంది.?
బాలింతలకు కేసీఆర్‌ ‌కిట్టు, వితంతవులకు ఇచ్చే పెన్షన్‌, ‌కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌ ‌లాంటి పథకాలను మినహయిస్తే బారాస మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హమీ కూడా నేరవేర్చిన దాఖలాలు లేవు. చట్టసభలలో మహిళలకు 33.3% రిజర్వేషన్లు కోసం ఉద్యమాలు చేస్తామన్నారు..? మహిళా బ్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు.! మహిళా సంక్షేమ బోర్డును ఏర్పాటు హమీ ఇచ్చారు.! జిల్లా కేంద్రాలలో మహిళా పారిశ్రామిక కేంద్రాలను ఎక్కడ నెలకొల్పిన దాఖలాలు లేవు. పేద కుటుంబంలో ఆడపిల్ల పుట్టిన నెలలోపే పదివేల రూపాయలు డిపాజిట్‌ ‌చేసి 18 ఏళ్ళు వచ్చే నాటికి ఒక లక్ష రూపాయలు అమ్మాయికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు..! ఆ పథకం జాడకే లేదు. మహిళా దినోత్సవం రోజున సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ పేరున వివిధ కళలలో నైపుణ్యాలు ప్రదర్శించిన మహిళలకు పురస్కారాలు అందజేస్తూ ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తామన్నారు..అదీ లేదు.? మహిళల భద్రతా చట్టాలు అత్యంత కఠినంగా అమలు చేస్తామన్నారు.కానీ తెలంగాణ మహిళా కమిషన్‌ ‌మాత్రం అత్యాచారలకు గురైన మహిళలను పరామర్శించే సోయి కూడా లేకుండా పోయింది. జిల్లా కేంద్రాల్లో మహిళా పోలీస్టేషన్‌లు పర్వాలేదు, కాని నియోజకవర్గస్థాయిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేస్తానన్న హమీ ఆచరణలో నోచుకోలేదు.

మహిళా సాధికారిత కోసం పోరు సల్పాల్సిందే
తెలంగాణ రాష్ట్రం వస్తే తమ జీవితాల మీద తామే స్వాతంత్య్రం నిలబెట్టుకోగలమని, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో సాధికారితను పొందేందుకు తెలంగాణ రాష్ట్రం తమకు ఒక ఉపకరణంగా ఉంటుందని మహిళా లోకం భావించింది. ఆ క్రమంలోనే ఉద్యమంలో సింహ భాగాన్ని త్యాగం చేసినారు. స్వరాష్ట్రంలో ఇందుకు కావాలిసిన ఏ ఒక్క అడుగు ప్రభుత్వం వేయలేదు అనే విషయం రూడి అవుతున్నది. మహిళా లోకం అనే ఆటు పోటులు ఎదుర్కొంటున్నప్పటికీ రాజకీయ రంగంలో ఈ పురుషాధిక్యత సమాజాన్ని ఎదిరించి ముందుకు పోవడానికి ఇప్పుడున్న చలామణిలో ఉన్న రాజకీయ వ్యవస్థ అడ్డంకిగా మారుతుందని గ్రహించినారు.ఇందుకోసం ఉద్యమమే ఏకైక మార్గమని మహిళలలు చరిత్ర నుంచి అవగాహన కుదుర్చుకుంటున్నారు.తెలంగాణలో వచ్చిన భూస్వామ్య ఆధారిత కుల వ్యవస్థ మళ్లీ నిలదొక్కుకోవడాన్ని మహిళలు తమ గమనంలో ఉంచుకుంటున్నారు. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానాలు మరింతగా క్రూరత్వాన్ని పొంది కార్పొరేట్‌ ఆర్థిక వ్యవస్థగా మారింది.ఇందులో తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఆ వ్యవస్థకు అత్యంత అనుకూల వాతావరణం సృష్టిస్తున్నాయి ఈ పరిస్థితులలో కోల్పోయిన ఆర్థిక అవకాశాలను తిరిగి పొందాల్సింది. అసాధారణమైనటువంటి కృషి తమ హక్కుల కోసం అంతే స్థాయిలో పోరాడాల్సి ఉంది.

స్త్రీ శక్తి స్వరూపిణి అని, మహిళలు ఇంటి వెలుగులు అని ప్రకటించిన కేసిఆర్‌ ‌ప్రభుత్వం కనీసం మహిళలకు ఏ రంగం లోను  కూడా చోటు దక్కనీయలేదు. అడిగిన ప్రతిపక్షాలపై ఒంటెద్దు పోకడలతో దుయ్యబట్టారు. తెలంగాణ అస్తిత్వం పేరుతో జాగృతి సంస్థను స్థాపించుకొని బతుకమ్మ అంటే కవిత అని స్వయం ప్రకటనలు చేసుకొని ఎన్నికలలో ఓడిపోయినప్పటికి మరల మండలిలో ప్రాతినిధ్యం కల్పించారు. సబ్బండ కులాల మహిళలు పోరు చేస్తే గౌరవం దక్కేది వారికేనా.! తెలంగాణ మహిళలను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని తమ కూతురునే లిక్కర్‌ ‌స్కాంలో ఆదర్శంగా నిలుపుతూ తెలంగాణ పరువును దిగజారుస్తున్న పరిస్థితి.
– పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *