ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చిత్తరంజన్ దాస్ బిజెపిలో చేరికకు రంగం సిద్ధమైంది..! బుధవారం బిజెపి జాతీయ నాయకుడు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ను ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భేటీ అయ్యారు. అనంతరం బిజెపి చేరికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అశ్వద్ధామ రెడ్డి లతో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ టిడిపి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావును అప్పట్లో ఓడించి కల్వకుర్తి ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నందమూరి తారక రామారావు ఓడించడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కార్మిక శాఖ మంత్రిగా నియమించింది ప్రస్తుతం కొన్ని ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తదనంతరం పరిణామాల నేపథ్యంలో అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 -19 సంవత్సరంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గెలుపుకు సహకరించిన ఆయన తదనంతరం జైపాల్ యాదవ్ వ్యవహార శైలి నచ్చక బిఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. త్వరలోనే బిజెపిలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు.




