మాండూస్‌ ‌తుఫాన్‌తో ఎపిలో ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం

అమరావతి, డిసెంబర్‌ 13 :  ‌మాండూస్‌ ‌తుపాన్‌ ‌రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శజిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైంది. తుపాన్‌ ‌తీరం దాటే సమయంలో కురిసిన భారీ వర్షధాటికి బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. నష్టతీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సహాయచర్యలు తక్షణమే తీసుకున్నందున మరణాల సంఖ్యను నివారించగలిగామని అధికారులు చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి బాధిత ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష తీవ్రత తగ్గిన తరువాత నష్టాల లెక్కలు తీయాలని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌కె.ఎస్‌. ‌జవహర్‌రెడ్డి కూడా తుపాన్‌ ‌పీడిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు ఆయన చెప్పారు. వర్ష ధాటికి తిరుపతిలో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. స్వర్ణముఖి నదికి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో ప్రధాన రహదారిలోని కాజ్‌వేలపైకి నీరు పొంగి ప్రవహించింది. కేవీబీపురం మండలం కాలంగి, రేణిగుంట రిజర్వాయర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తిరుమలలోని అన్ని జలాశయాలు గరిష్ఠస్థాయికి చేరుకుంటున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు తీర్థాలకు వెళ్లే మార్గాలను టీటీడీ మూసేసింది. కొండ పై కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. నెల్లూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో నారుమళ్లు నీటమునిగాయి. ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే నారు పాచిపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

కడప జిల్లా  చాపాడు, బ్రహ్మంగారిమఠం మండలాల్లో వరి పంట నేలకొరిగింది. వర్షాల కారణంగా ప్రకాశం జిల్లాలో 3,190 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. శింగరాయకొండ, పొన్నలూరు, సంతనూతలపాడు మండలాల్లో పొగాకు 354 ఎకరాలు, మినుము 2836 ఎకరాల్లో నష్టం జరిగింది. తుఫాను ప్రభావంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు చేయూత అందించాలని కోరారు. రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. తడసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో టిడిపి నాయకులు, శ్రేణులు బాధితులకు అండగా నిలవాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *