– ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం
– ముఖ్యమంత్రి ఒక్కనాడైనా దీనిపై సమీక్షించలేదు
– మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం
జగదేవ్‌పూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఇద్దరు యువకులు డెంగ్యూతో మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిమ్మాపూర్‌లో కొనతం మహేష్ (34), నాయని శ్రావణ్ కుమార్ (16)లు డెంగ్యూతో మరణించడం బాధాకరమన్నారు. వారి మరణాలు ప్రభుత్వ హత్యలేనన్నారు. గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు డెంగ్యూతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాయని తెలిపారు. డెంగ్యూతో మరణించిన యువకుల తల్లిదండ్రుల కడుపు కోతకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. నేడు పంచాయతీ కార్యదర్శులు అప్పులపాలై సమ్మె ప్రకటించే పరిస్థితి వచ్చిందని, పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదని విమర్శించారు. ఊర్లకు ఊర్లు మంచాన పడుతున్నాయని, వైరల్ ఫీవర్‌కే ప్రజలు అప్పులపాలై రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటించారా? కనీసం పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. పల్లెల్లో ప్రజలు, హాస్టళ్లలో విద్యార్థులు హాస్పిటల్స్ పాలయ్యారు.. రైతులు రోడ్లపై పడ్డారు అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విష జ్వరాలు రాకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీష్‌రావు అన్నారు. పంచాయతీల నిర్వహణపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రూ.300 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చేవారు.. రేవంత్ రెడ్డి కనీసం పది పైసలైనా ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో నిలబడి జాగారాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. యూరియా బస్తాలు దొరకడం లేదు కానీ ఏ ఊరికి పోయినా బెల్ట్ షాపులు మస్తు ఉన్నాయి అని ఎద్దేవా చేశారు. తులం బంగారం దేవుడెరుగు కానీ యూరియా బస్తాలే బంగారం అయ్యాయి.. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 26వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టాం.. ఇప్పుడు కనీసం 3,000 మెట్రిక్ టన్నులు కూడా రాలేదన్నారు. రేవంత్ పాలన రైతులకు కాళరాత్రులను మిగిల్చింది అని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





