- డీలిమిటేషన్, జనాభా గణన అనేవి బిల్లు వాయిదా వేయడానికి కేంద్రం కుంటిసాకులు
- జనాభా సెన్సస్ చేయాడానికి జాప్యమెందుకు
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- తమ హయాంలో జరిగిన జనాభా గణనను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్న
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 22 : మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.అదే సమయంలో వెనుకబడిన తరగతులు, ఇతర వర్గాల మహిళలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలని తాను ప్రభుత్వాన్ని కోరినట్లు గాంధీ చెప్పారు. గత యుపిఎ పాలనలో నిర్వహించిన కుల గణనతో పాటు ప్రభుత్వం కుల గణనను నిర్వహించి, దాని ఫలితాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం దిల్లీలో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాజకీయమే బిల్లును తీసుకురావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యమని, కనుకనే జనాభా గణన, డీలిమిటేషన్ పక్రియతో ముడిపడి ఉన్నందున వొచ్చే 10 ఏళ్లలో దీనిని అమలు చేయబోమంటున్నారని రాహుల్ ఆరోపించారు. కుల గణన కోసం పెరుగుతున్న డిమాండ్ నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ బిల్లు ఉద్దేశించబడిందన్నారు.
2010లో రాజ్యసభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో గతంలో యూపీఏ ప్రభుత్వం ఓబీసీ కోటా ఇవ్వనందుకు చింతిస్తున్నారా…అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ జవాబిస్తూ..తాను ఆ విషయంలో 100 శాతం విచారం వ్యక్తం చేస్తున్నానని, తాము ఆ పని చేసి ఉండాల్సిందన్నారు. మొత్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు మంచిదేనని, అయితే జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌కు సంబంధించిన రెండు ‘ఫుట్నోట్స్’ జతచేయడం వల్ల మహిళలకు ఈ రిజర్వేషన్ కల్పించేందుకు చాలా ఏళ్లు పడుతుందని చెప్పారు. డీలిమిటేషన్, జనాభా లెక్కలు బిల్లు అమలును వాయిదా వేయడానికి కుంటి సాకులని, బిల్లును అమలు చేయకుండా ఎన్నికల సమస్యను సృష్టించడానికి ఈ మొత్తం కసరత్తు జరిగిందని ఆరోపించారు.
బిజెపి ప్రత్యేక సెషన్ ఆలోచనతో ముందుకు వొచ్చినా దాన్ని తాము అభినందించామని, ఆర్భాటాలు, ఆడంబరంతో తాము పాత భవనం నుండి కొత్త భవనానికి మారామని, ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని తీసుకువెళ్లే సమంయంలో అత్యంత నాటకీయతను ప్రదర్శించారని రాహుల్ అన్నారు. ఇక భారత ప్రభుత్వంలో కేవలం ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులు మాత్రమే ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు)కి చెందిన వారని, వారికి బడ్జెట్లో ఐదు శాతం మాత్రమే కేటాయించడం తనను ఆశ్చర్యపరిచిందని రాహుల్ అన్నారు. ఓబీసీలు, దళితులు, గిరిజనులకు బడ్జెట్లో కేవలం ఆరు శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారు..ఇతర వర్గాల నుండి ఎంత మంది ఉన్నారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న అని, అందకే తాను కుల గణన కోరుతున్నాని రాహుల్ తెలిపాడు. తమ హయాంలో జనాభా గణన జరిగిందని, ఆ డేటా అందుబాటులో ఉందని, ఆ డేటాను ప్రధాని ఎందుకు విడుదల చేయడం లేదని రాహుల్ ప్రశ్నించాడు. జనాభా సెన్సస్ చేయడానికి ఇంత జాప్యం ఎందుకని, వెంటనే చేసి చివరి కుల గణన డేటాను ఒకేసారి విడుదల చేయాలని రాహుల్ అన్నారు. బిజెపిలో గణనీయమైన సంఖ్యలో ఓబీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్ఠీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ…భారతదేశంలో డబ్బు ఎలా ఉంది, చట్టాల రూపకల్పనలో వారు ఎంతవరకు పాల్గొంటున్నారు, ఎంత ఖర్చు చేశారు అనే దానిపై వారి ఎంపీని లేదా ఎమ్మెల్యేనైనా అడిగితే వారే పాల్గొనడం లేదని చెబుతారన్నారు.
ప్రధానమంత్రి తాను ఓబీసీ నాయకుడనని చెబుతూనే, భారత ప్రభుత్వంలో కేవలం ముగ్గురు ఓబీసీలు(అధికారులు) ఎందుకు ఉన్నారో, ఈ దేశానికి వెన్నెముకగా ఉన్న ఓబీసీ సంఘం కేవలం ఐదుగురికి మాత్రమే ఎందుకు బాధ్యత వహిస్తుందో వివరించాలని తాను కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు బిజెపి సమాధానం చెప్పలేకపోయిందని, ఈ విషయాన్ని తాను ప్రస్తావించినప్పుడు వారి ముఖంలో భయాందోళనలను చూశానన్నారు. మహిళల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తారా అని అడగ్గా దశలవారీగా చేయాలని బదులిచ్చారు. ప్రస్తుత రూపంలో ఉన్న ఈ బిల్లు మహిళలకు రిజర్వేషన్ కల్పించే లక్ష్యాన్ని సాధించగలదా అని అడిగిన ప్రశ్నకు గాంధీ సమాధానమిస్తూ…సమస్య ఉందని, అయితే తాము బిల్లుతో ఏకీభవిస్తున్నాము, ఈ రెండు క్లాజులను (జనగణన మరియు డీలిమిటేషన్) తొలగించాలి, వెంటనే అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని రాహుల్ తెలిపారు.




