మహిళలపై దాడి హేయమైన చర్య : కిషన్‌ రెడ్డి

మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 25 : చెంగిచర్ల ఘటనలో గాయపడ్డ పలువురు మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి పరామర్శించారు. చెంగిచర్లలో ఆదివారం హోలీ వేడుకలు జరుకుంటున్న వారిపై ఓ వర్గం గూండాలు దాడికి పాల్పడి విచక్షణారహితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఫైరయ్యారు. గాయ పడ్డ గిరిజన మహిళలు నివాసిస్తున్న ప్రాంతాన్ని సోమవారం ఆయన సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ సంబురాలు జరుపుకుంటున్న వారిపై ఓ వర్గం గూండాలు అకారణంగా దాడులు చేయడం పట్ల ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హిందూ మహిళలపై ఏకపక్షంగా జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. పోలీసులు చట్టపరిధిలో పని చేయకుండా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, బాధితులపైనే ఒత్తిడి తేస్తూ వారిపైనే కేసులు నమోదు చేసే విదంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే గూండాలు మహిళలపై దాడులు చేస్తున్నా వారించకుండా వారిపై కేసులు నమోదు చేయకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు. చెంగిచర్ల కబేళా గూండాలకు, అరాచకశక్తులకు అడ్డాగా మారిందని, ఈ దాడుల వెనక ఉన్నది కూడా స్లాటర్‌ హౌజ్‌ మాఫియా అని ఆరోపించారు. ఈ మాఫియా నేర సామ్రాజ్యాన్ని కూల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కబేళా పూర్తిగా నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా జంతువుల వద కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పేదలైన బాధిత మహిళలపై పోలీసులు వివక్షతో వ్యవహరిస్తున్నారని, రాజకీయ నాయకుల అండలేదని, పేదలనే వివక్షతో కేసును నీరుగార్చాలని చూస్తున్నారన్నారు. బీజేపీ నాయకులు బాధితులకు అండగా ఉండి వారికి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించాలని కిషన్‌ రెడ్డి ఆదేశించారు.  చెంగిచర్ల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కూడా అర్హులైన స్థానికులకు ఇవ్వకుండా మాఫియా చేతిలో పెట్టారని ఆయన ఆరోపించారు. వెంటనే వారందరినీ ఖాళీ చేయించాల్సి అవసరం ఉందన్నారు. మహిళలపై దాడులకు భాధ్యులపై ట్రైబల్‌ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 24 గంటల్లో పోలీసులు నిందితులపై కేసులను నమోదు చేయకుంటే ఖబర్ధార్‌ అంటూ హెచ్చరించారు. కిషన్‌ రెడ్డి వెంట మల్కాజిగిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *