న్యూ దిల్లీ, ఆగస్ట్ 22 : దేశంలో రైతులు మళ్లీ నిరసన బాట పట్టారు. గతంలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరు సాగించిన రైతులు… ఇప్పుడు నిరుద్యోగంపై సమరశంఖం ఊదారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై అసంతృప్తితో నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా పంచాయత్ పేరుతో రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున రైతు సంఘాలు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది రైతులు నిరసనా స్థలానికి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.
భారీ భద్రత నేపథ్యంలో నోయిడా- ఢిల్లీ సరిహద్దులో ట్రాఫిక్ జామ్ అయింది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీకి చేరుకునే ఎంట్రీ పాయింట్ కు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని, హై సైక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాంతో పాటు అక్కడక్కడా సిమెంట్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ దగ్గర దీక్షకు అనుమతి లేదని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పినా.. రైతులు మాత్రం తమ నిరసనను వ్యక్తం చేసేందుకు జంతర్ మంతర్ కు చేరుకుంటున్నారు.




