- బుల్దానాలో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం
- 25 మంది ప్రయాణికుల సజీవదహనం
- ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్, క్లీనర్
- సహాయక చర్యలతో పాటు దర్యాప్టు చేపట్టిన పోలీసులు
- ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్బ్రాంతి
ముంబై, జూలై 1 : మహారాష్ట్రలోని బుల్దానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే బస్సు పూర్తిగా దగ్ధమవడంతో అందులో ప్రయాణిస్తున్న 25 మంది సజీవ దహనమయ్యారు. డ్రైవర్ సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాతృలను దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ట్రావెల్స్ బస్సు నాగ్‌పూర్ నుంచి పుణె వెళ్తుండగా.. ఒక్కసారిగా టైరు పేలడంతో అదుపు తప్పిందని బుల్దానా ఎస్పీ సునీల్ కడసానే చెప్పారు. పక్కనే ఉన్న స్తంభాన్ని, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిందని వెల్లడించారు. దీంతో బస్సులో మంటలు చెలరేగాయని, ఏం జరిగిందో తెలుసుకునే లోపే 25 మంది చనిపోయారన్నారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ఉన్నారన్నారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడిట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 1.35 నిమిషాలకు బుల్దానా సిటీ వద్ద బస్సు టైరు పేలినట్లు చెప్పాడు. ఆ వెంటనే బస్సు సడన్‌గా టర్న్ తీసుకున్నట్లు తెలిపాడు. ఆ ఓవర్‌టర్న్ వల్లే బస్సుకు చెందిన డీజిల్ ట్యాంక్ లీకైందని, దాని వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ ఉన్నారు. అయితే దీంట్లో ఒక డ్రైవర్ మరణించాడు. క్లీనర్‌తో పాటు మరో డ్రైవర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. డోరు ఉన్న సైడే బస్సు పడిపోవడం వల్ల.. దాని నుంచి జనం తప్పించుకోలేకపోయినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదంలో సజీవంగా ఉన్న వారు డ్రైవర్ సైడ్ వద్ద ఉన్న క్యాబిన్ సీటులో కూర్చున్నారు. వాళ్లు ముందు అద్దాలను పగులగొట్టి తప్పించుకున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ నిద్రలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైంది విదర్భ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించారు. నాగపూర్ నుంచి పుణె వెళ్తుంటే ఈ ఘటన జరిగింది. మృతిచెందిన కుటుం బాలకు సీఎం షిండే 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బుల్దానా జిల్లా శాఖ రెండు హెల్ప్‌లైన్ 7020435954, 07262242 683)నెంబర్లను విడుదల చేశారు. బస్సు డ్రైవర్‌ను, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ తెలిపారు.
బస్సు టైరు పేలడం వల్ల ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు నిద్రలో ఉన్న కారణంగా 25 మంది సజీవ దహనం అయ్యారు. బోల్తా కొట్టిన బస్సు డీజిల్ ట్యాంక్ లీకైందని, దాని వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.ఆ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.



